Industries Department Review
-
‘మార్గాలు అన్వేషించాలి’
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, దొనకొండ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధి జరిగే విధంగా పారదర్శక పాలసీ విధానం తీసుకురావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలసీని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఐ.టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి విడివిడిగా సమీక్ష నిర్వహించారు. మార్గాలు అన్వేషించాలి.. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఇచ్చే ప్రాధాన్యతలు, రాయితీలను అవగాహన చేసుకుని, మన రాష్ట్రానికి అత్యధిక నిధులు, పరిశ్రమలు తరలివచ్చేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని మంత్రి తెలిపారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణమున్న ఆంధ్రప్రదేశ్ కు ..కేంద్రం సహకారం, పాలసీలు బాగుంటే పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ తయారు చేసే పరిశ్రమలతో పాటు, ఆ విడి భాగాలు కూడా ఇక్కడే తయారు చేసే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా పాలసీ ఉండాలన్నారు. పరిశ్రమలకు కావలసిన మెటీరియల్, యూనిట్లకు సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటే పారిశ్రామికవేత్తలకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. తద్వారా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి అన్నారు.(చదవండి: ఏపీ వైపు.. పారిశ్రామిక వేత్తల చూపు) బాధ్యతను మరిచిపోకూడదు.. ఐ.టీ పాలసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఐ.టీ ప్రమోషన్ పై దృష్టి సారించాలన్నారు. ఐ.టీ రంగానికి అత్యాధునిక సదుపాయాలు, అందుబాటులో వనరులు ఏమేం ఉన్నాయో చూసుకుని వాటికి మరింత ప్రాధాన్యతనిస్తూ పాలసీ తయారు చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఐ.టీ, పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే బాధ్యతను మరచిపోకుండా పాలసీని తయారు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి మేకపాటి స్పష్టమైన సూచనలు చేశారు. పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీఐఐసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు కృష్ణ గిరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఐ.టీ శాఖ సమీక్షా సమావేశంలో ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సీఈవో పవనమూర్తి, ఐ.టీ సలహాదారులు, తదితరులు హాజరయ్యారు. -
గ్లోబల్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులతో పారి శ్రామిక, ఐటీ రంగాలకు చిరునామాగా మారిన తెలంగాణకు మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపుతున్న అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే ప్రభు త్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్.. శుక్రవారం ఐటీ, పరిశ్రమలు, అనుబంధ శాఖల విభాగాధిపతులతో ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, ఐటీ, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పెట్టుబడులపై మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ మరియు ఐటీ రంగాల్లో రాబోయే కొద్ది నెలల్లోనే భారీ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివిధ సంస్థలు సమర్పించిన పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్షించారు. కాగా, వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన పరిశ్రమలకు అక్టోబర్‌లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని, పెట్టుబడుల ద్వారానే ఉద్యోగావకాశాల కల్పన మెరుగవుతుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీ.. ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, సిరిసిల్ల అప్పారెల్ పార్కులతో పాటు.. వివిధ పారిశ్రామిక, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల పురోగతిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన పారిశ్రామిక పార్కుల్లో మరిన్ని కంపెనీల ఏర్పాటుతో పాటు, త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించిన కేటీఆర్.. ఐటీ రంగంలో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ఈ రంగంలో హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. రాబోయే నాలుగేళ్ల కాలానికి విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన నివేదికను అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే అంశాన్ని సవాలుగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తేవడం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ నదీం అహ్మద్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, టెక్స్టైల్స్ కమిషనర్ శైలజా రామయ్యర్, పరిశ్రమలు, ఐటీ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు. -
పొగబెడుతున్నాయ్..
- జిల్లాలో కాలుష్యం దారుణం - పరిశ్రమలకు భయం, భక్తి లేవు - కాలుష్య కారక కంపెనీలకు నోటీసులు - పరిశ్రమల శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి ఆగ్రహం సంగారెడ్డి జోన్: ‘జిల్లాలో కాలుష్య కారక కంపెనీలకు భయం, భక్తి లేవు.. కాలుష్యాన్ని ఇష్టానుసారం వెదజల్లుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలోని అటువంటి పరిశ్రమలను గుర్తించి నోటీసులు పంపుతా’మని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ అధికారులు, పారిశ్రామిక సంస్థలతో గురువారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై సర్వే నిర్వహించి నివేదిక అందజేయాల ని పీసీబీ అధికారులను ఆదేశించారు. పటాన్చెరు, పాశమైలారంలో కాలుష్యం దారుణంగా వుందని, ని యంత్రణకు ఏ చర్యలు తీసుకున్నారని మంత్రి ప్రశ్నిం చగా కాలుష్య నియంత్రణ శాఖ ఈఈ భిక్షపతి బదులిస్తూ 2 కాలుష్య కారక కంపెనీలను మూసివేయించామని చెప్పారు. జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ కింద గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధికి పాటు పడాలని జూపల్లి సూచించారు. నిజమైన లబ్ధిదారులకే రుణాలు పీఎంఈజీపీ పథకం కింద నిజమైన అర్హులను గుర్తించి రుణాలివ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డీఐసీ జీఎం సురేష్‌ను ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరంలో జిల్లాలో 16 శాతం మాత్రమే గ్రౌండింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దరఖాస్తులు తక్కువొస్తున్నాయని తేటతెల్లమవుతోందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. సంగారెడ్డి మండలంలో 1982లో ఓడీఎఫ్ పరిశ్రమ ఏర్పాటులో ప్రజల నుంచి భూమిని తీసుకున్నారని, ఇంకా 44 మంది భూ బాధితులకు నష్టపరిహారం అందలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. వారికి రూ.1.48 కోట్ల మేరకు అందజేయాల్సి వుందన్నారు. దీనిపై డీఐసీ జీఎం సురేష్‌ను మంత్రి ప్రశ్నించగా ఈ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో వుందన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బీహెచ్ఈఎల్ అనుబంధ పరిశ్రమలు దాదాపు 44 ఈ ఏడాది మూత పడ్డాయని, దీనివల్ల ఆర్డర్లన్నీ పోతున్నాయన్నారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి బదులిచ్చారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, ఐసీసీ ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.