సాక్షి, అమరావతి: విశాఖపట్నం, దొనకొండ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధి జరిగే విధంగా పారదర్శక పాలసీ విధానం తీసుకురావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలసీని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఐ.టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి విడివిడిగా సమీక్ష నిర్వహించారు.
మార్గాలు అన్వేషించాలి..
కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఇచ్చే ప్రాధాన్యతలు, రాయితీలను అవగాహన చేసుకుని, మన రాష్ట్రానికి అత్యధిక నిధులు, పరిశ్రమలు తరలివచ్చేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని మంత్రి తెలిపారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణమున్న ఆంధ్రప్రదేశ్ కు ..కేంద్రం సహకారం, పాలసీలు బాగుంటే పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ తయారు చేసే పరిశ్రమలతో పాటు, ఆ విడి భాగాలు కూడా ఇక్కడే తయారు చేసే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా పాలసీ ఉండాలన్నారు. పరిశ్రమలకు కావలసిన మెటీరియల్, యూనిట్లకు సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటే పారిశ్రామికవేత్తలకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. తద్వారా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి అన్నారు.(చదవండి: ఏపీ వైపు.. పారిశ్రామిక వేత్తల చూపు)
బాధ్యతను మరిచిపోకూడదు..
ఐ.టీ పాలసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఐ.టీ ప్రమోషన్ పై దృష్టి సారించాలన్నారు. ఐ.టీ రంగానికి అత్యాధునిక సదుపాయాలు, అందుబాటులో వనరులు ఏమేం ఉన్నాయో చూసుకుని వాటికి మరింత ప్రాధాన్యతనిస్తూ పాలసీ తయారు చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఐ.టీ, పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే బాధ్యతను మరచిపోకుండా పాలసీని తయారు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి మేకపాటి స్పష్టమైన సూచనలు చేశారు. పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీఐఐసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు కృష్ణ గిరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఐ.టీ శాఖ సమీక్షా సమావేశంలో ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సీఈవో పవనమూర్తి, ఐ.టీ సలహాదారులు, తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment