గౌర్వరం
జీవితం ప్లస్ అవ్వాలి..అంతకంటే మంచి విషయం జీవితంలో ప్లస్లుండాలి!!భూకంపాలొస్తాయి.. సునామీలొస్తాయి.. ద్రోహాలు జరుగుతాయి.. అన్యాయం ఉంటుంది!జీవితంలో వేసుకునే లెక్కల్లో ఇవన్నీ మైనస్‌లే!!మరి ఇన్ని మైనస్‌లను తలదన్నే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది?ఎవరిస్తారు?నిన్ను నువ్వు గౌరవించుకున్న క్షణం.. ఆ ప్లస్లన్నీ నీలోనే కనపడతాయి!! సునాలీ ఆనంద్ గౌర్ మనందరికీ అద్దం పట్టిచూపించిన గౌరవం అదే!!
తెల్లవారి పేపర్ తెరిస్తే హత్యలు, రేప్‌లు, మోసాలు, లూటీలు. టీవీ ఆన్ చేసినా అవే ఘోరాలు. పక్కవాళ్లను పలకరిస్తే కష్టాల ఏకరువు పెడతారు. స్నేహితులతో మాట్లాడితే ఇంక్రిమెంట్ లేదు వర్క్‌లోడ్‌తో స్ట్రెస్ అంటూ సమస్యల పురాణం విప్పుతారు. చుట్టాలను చుట్టొస్తే ఇంటికో రామాయణం.బాబోయ్... ఇంత నెగటివ్ వాతావరణమా? ఎక్కడా సంతోషం లేదా? ఎవరూ ఆనందంగా లేరా? ప్రాబ్లమ్స్‌తో పరేషాన్ అవడం తప్ప పాజిటివ్ ఆలోచనలతో ఒక్కరూ ఉండరా?తన చుట్టూ కనిపించిన వాతావరణం చూసి షాక్ అయింది సునాలీ ఆనంద్ గౌర్. పాజిటివ్ ఎనర్జీ నింపేందుకు సిద్ధమైంది.మనం బతకొచ్చు.బతుకు మీద ఆశ ఉన్నవాళ్లు మన చుట్టూ ఉన్నారు అని పదే పదే ఆమె చెప్పదల్చుకుంది.ఆమె చేస్తున్న ప్రయత్నానికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది.ఎవరీ గౌర్?ఆనంద్ గౌర్ పుట్టింది, పెరిగింది, చదువుకుందీ ఢిల్లీలోనే. ఢిల్లీ యూనివర్శిటీలో లా చేసింది. లాయర్‌గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. రెండేళ్లు గడిచేసరికి చిరాకేసింది. కోర్టులో అడుగు పెడితే చాలు కలహాలు, కొట్లాటలు వినడంతోనే పొద్దుపొడిచేది. విసుగొచ్చింది.ఆ నెగటివ్ వాతావరణాన్ని భరించలేక నల్లకోటుకి రాంరాం చెప్పేసింది.
ఆ తర్వాత?
ఢిల్లీలోని గోలే మార్కెట్లో తల్లి నడిపిస్తున్న సెయింట్ పాట్రిక్స్ ప్లే స్కూల్లో టీచర్‌గా చేరింది. పిల్లలతో గడుపుతూంటే తనలో కలుగుతున్న ఒక కొత్త ఉత్తేజాన్ని గమనించింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లినా అదే ఉత్సాహం.. ఉల్లాసంతో ఉండేది. లాయర్‌గా ఉన్నప్పుడు గూడు కట్టుకున్న దిగులంతా ఇప్పుడు తుడిచేసినట్టయిపోయింది. అంటే పిల్లల్లో నెగటివ్ ఎనర్జీ లేదు. వాళ్ల కేరింతలు.. అల్లరి.. ఆనందం.. అంతా పాజిటివే! అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న మనుషుల్లో కేవలం పాజిటివిటీనే చూడాలని నిర్ణయించుకుంది. పెదవుల మీద చిరునవ్వు ఆ శక్తినిస్తుందనీ గ్రహించింది.
పాజిటివ్ జర్నీ...
టీచర్‌గా ఉండగానే గౌర్‌కు పెళ్లయింది. అత్తగారి ప్రాంతమైన గురుగ్రామ్‌కు షిఫ్ట్ అయింది సునాలీ. అయినా టీచర్ ఉద్యోగం వదల్లేదు. రోజూ గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి బస్సులో వచ్చేది. వచ్చేటప్పుడు, స్కూల్ అయ్యాక తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు తన చుట్టూ ఉన్న మనుషులను గమనించడం మొదలుపెట్టింది. బస్‌స్టాప్‌లోకి ఆదరాబాదరగా పరిగెత్తుకొచ్చే వాళ్లను చూసి పలకరింపుగా నవ్వేది. అప్పటిదాకా కంగారు పడ్డవాళ్లు ఆమె నవ్వుకు బదులుగా నవ్వేవారు. కొంచెం కుదుటపడ్డట్టుగా అనిపించేవారు. హడావిడిగా బస్ ఎక్కేవాళ్లనూ ‘హాయ్’ అంటూ నవ్వుతూ విష్ చేసేది. సీట్ దొరక్క రాడ్ పట్టుకుని వేళ్లాడుతున్న వాళ్లు సైతం ఆమె చెప్పిన హాయ్‌ను మనాసారా ఆస్వాదించేవాళ్లు. ఆ రోజుకి అది చాలు అనుకుని తాను కోరుకున్న ఎనర్జీతో ఇంటికెళ్లేది సునాలి.
ఒకసారి..
బడికి బయలుదేరుతుంటే బస్‌స్టాప్‌కి వెళ్లే దారిలో ఉన్న ఓ ఇంట్లోంచి ఓ ముసలావిడ అయిదారు బాటిళ్లలో చల్లటి నీళ్లను నింపి తీసుకొస్తూ కనిపించింది. వాటిని ఆమె ఏం చేస్తుందా? అనే కుతూహలం సునాలీలో. బస్‌స్టాప్‌కి రాగానే మంచి నీళ్లను అక్కడ ఫుట్‌పాత్ మీదున్న వాళ్లకు ఇచ్చింది ఆ ముసలావిడ. ఆ పెద్దావిడ పాజిటివ్ ఎనర్జీని తనకు అందించినట్టు ఫీలయింది సునాలీ. బడి నుంచి ఇంటికి వెళ్లాక ఫేస్బుక్లో ఓ పేజ్ క్రియేట్ చేసింది ‘సోల్ స్టరింగ్’ పేరుతో. తాను ఉదయం చూసినదాన్ని ఓ కథలా రాసింది. వందల లైక్‌లు.. పదుల్లో కామెంట్స్. ఇక ఆ ప్రయత్నం ఆపలేదు. తెలీకుండానే... యాక్సిడెంటల్‌గా జర్నలిస్ట్ అవతారమెత్తింది.
ఇప్పుడు..
ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. తనకు వీలు చిక్కినప్పుడల్లా వీ«ధుల్లోకి వెళ్తుంది. అలాంటి పాజిటివ్ మనుషులు ఎవరు కనిపించినా వాళ్ల గురించి సోల్ స్టరింగ్లో రాస్తుంది. భర్త, కూతురితో బయటకు వెళ్లినా కెమెరా, పేపర్, పెన్నూ వెంట తీసుకెళ్తుంది. మనుషుల్లోని పాజిటివ్‌నెస్‌ను వెదుకుతుంది. ఫేస్బుక్లో పెడ్తుంది. అలా ఒకసారి ఆమె ఢిల్లీలోని ఓ మాల్‌కు వెళ్లింది. మాల్ బయట సిమెంట్ బెంచ్ మీద ఓ వృద్ధుడు కూర్చొని కనిపించాడు. ఒంటరిగా వచ్చిపోయే జనాలనే చూస్తున్నాడు. ఆమె దృష్టి అతని మీద పడింది. వెళ్లి ఆయనను పలకరించింది. నవ్వుతూ బదులిచ్చాడు అతను. ఆ మాటా ఈమాటా మాట్లాడి వివరాలు అడిగింది. అప్పుడు తెలిసింది సునాలికి అతను ఓ క్యాన్సర్ పేషంట్ అని. కీమో థెరపీలో ఉన్నాడని. ‘ప్రతిరోజూ సాయంకాలం అలా రద్దీ ఉన్న చోటికి వచ్చి జనాలను చూస్తూ ఉత్సాహాన్ని నింపుకుంటున్నాను. క్యాన్సర్‌తో పోరాడ్డానికి అదెంతో శక్తినిస్తోంది. జీవితం పట్ల ఆశను పెంచుతోంది’ అని అతడు చెప్పాడు. మరణం ఖాయమని తెలిసిన మనిషిలోనూ కనిపించిన ఆ పాజిటివిటీ ఆమెను కదిలించింది. అతని గురించి ఫేస్బుక్లో రాసింది. లైక్‌లు, కామెంట్లు, షేర్లతో ఆ వార్త మారుమోగింది. అది చూసిన మెయిన్‌స్ట్రీమ్ పత్రికలూ సునాలీ ద్వారా అతని చిరునామా పట్టుకొని అతని గురించి రాశాయి. క్యాన్సర్ చికిత్స కోసం అతనికి ఊహించని విధంగా ఆర్థిక సహాయం అందింది. దాంతో సునాలీ ఫేమస్ అయింది. ఆమె ‘సోల్ స్టరింగ్’ కథనాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఢిల్లీలోని ప్రధాన స్రవంతి పత్రికలన్నీ సునాలీ ఇంటర్వ్యూను ప్రచురించాయి. ఆమె పాజిటివ్ ప్రయాణంలో చాలామంది అడుగులు కలిపారు. ఢిల్లీలో ఇప్పుడది ఓ ఉద్యమంలా సాగుతోంది. మనిషిలోని మంచినే చూసే ఉద్యమం.
‘పాజిటివ్ థింకింగ్.. ఎన్ని ప్రతికూల పరిస్థితులనైనా జయించేలా చేస్తుంది. ఇప్పుడు మనలో లేనిది అదే. దాన్ని తిరిగి పోందాలనే నా తపన. అందుకే నా చుట్టూ ఉన్న మనుషుల్లోని పాజిటివ్‌నెస్‌ను సోల్ స్టరింగ్లో పెడ్తున్నా. దాంతో మిగిలిన వాళ్లూ ఇన్స్పైర్ అవుతారని’ అంటుంది సునాలీ ఆనంద్ గౌర్.
ఈ పెద్దాయన ఒక క్యాన్సర్ పేషెంట్. రోజూ సాయంత్రాలు ఫుట్‌పాత్ మీద కూర్చుని జనాన్ని చూస్తూ వాళ్లలోని ఉత్సాహాన్ని గమనించడం ద్వారా క్యాన్సర్‌ని ఎదుర్కునే శక్తి పొందుతుంటాడు. మనిషికి మనిషికి మించిన మందు లేదు. ఈ విషయాన్ని గమనించి గౌర్ ఆయన మీద రాసిన ఫేస్బుక్ కథనానికి విశేషమైన స్పందన వచ్చింది.
– శరాది