రాజకీయ చరిత్రలో ఆయనే 'హీనుడు'
'ఆవిడగారు ఎవర్ని పెళ్లిచేసుకుందో చూడండి.. స్కర్ట్ కనిపిస్తే చాలు, వేధించడం మొదలుపెడతాడాయన. ఒక్కరా, ఇద్దరా, ఆయన బారిన పడ్డ మహిళల సంఖ్య చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే ఆయన.. రాజకీయ చరిత్రలో మహిళల పట్ల అతి హీనంగా ప్రవర్తించిన వ్యక్తిగా మిగిలిపోతాడు' అంటూ ట్రంప్ మరోసారి కంపు వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్, ఆమె భర్త, యూఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి అసభ్యకర పదజాలాన్ని వినియోగించారు. వాషింగ్టన్ లోని స్పోకనే కన్వెన్షన్ సెంటర్ లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ట్రంప్.. తన ప్రత్యర్థి పార్టీకి చెందిన హిల్లరీ వైవాహిక జీవితంపై మాటలదాడి చేశారు.
'క్లింటన్ చేతిలో పరాభవానికి గురౌన మహిళల పట్ల హిల్లరీ దారుణంగా వ్యవహరించారు. నిజానికి ఆ మహిళలకు క్లింటన్ చేసిన నష్టం కంటే హిల్లరీ చేసిన చేటే పెద్దది. ఎందుకలా జరిగిందంటే.. హిల్లరీది ఫక్తు కుటిల మనస్తత్వం' అని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారుచేసుకున్న ట్రంప్ ఇప్పుడు హిల్లరీనేకాక గతంలోనూ మహిళలను చులకనచేస్తూ మాట్లాడారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
మరో నెల రోజుల్లో రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల అభ్యర్థుల పేర్లు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇరు నేతలూ ప్రత్యర్థులపై సంధించేందుకు ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు 91 మిలియన్ డాలర్ల వ్యయంతో అన్ని టెలివిజన్ చానళ్లలో డెమోక్రాట్ అభ్యర్థి గురించిన ప్రచారాన్ని చేసేందుకు హిల్లరీ పీఏసీ(పొలిటికల్ యాక్షన్ కమిటీ) ప్రణాళికలను సిద్ధంచేసింది. ప్రచారంలో ఎక్కువ భాగం ట్రంప్ పై విమర్శలకే ప్రాధ్యాన్యం దక్కనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మహిళలను ఉద్దేశించి ట్రంప్ చేసిన కంపు వ్యాఖ్యల వివరాలను సేకరించిన హిల్లరీ పీఏసీ వాటిని జనానికి వినిపించి, ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయనుంది.