బోర్డు, వ్యవస్థాపకులను ఒక్కతాటిపైకి తెస్తా
బెంగళూరు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, మేనేజ్మెంట్ను ఒక్క తాటిపైకి తేవడం, విభేదాలు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేసేలా చూడటమే తన ప్రధాన లక్ష్యమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ చైర్మన్ రవి వెంకటేశన్ తెలిపారు. ఇది ’సాధ్యపడే’ విషయమేనని, తాను నాన్ ఎగ్జిక్యూటివ్ కో–చైర్మన్ అయినప్పటికీ వారంలో నాలుగైదు రోజులు దీనికే సమయం కేటాయిస్తున్నానని ఆయన వివరించారు. టాప్ మేనేజ్మెంట్ వ్యవహార శైలిపై ఇన్ఫీ ప్రమోటర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రవి వెంకటేశన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కంపెనీ గానీ ఐకమత్య స్ఫూర్తిని రగిల్చగలిగితే పరిస్థితులు వాటంతటవే సర్దుకోగలవని ఆయన తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు మొదలైన వాటిపై సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే అంతా కచ్చితంగా దానిపై దృష్టి పెట్టాల్సిందేనని రవి చెప్పారు. మరోవైపు, ఇన్ఫీ నుంచి తాను తప్పుకోకుండా ఉండాల్సిందంటూ మూర్తి ఇటీవల బాధపడటంపై స్పందిస్తూ.. తాను వాటి గురించి మాట్లాడబోనని, దీనిపై వివరణనిచ్చేందుకు ఆయనే సరైన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుత సీఈవో విశాల్ సిక్కాను ఎంపిక చేసిందే నారాయణ మూరి అని రవి వివరించారు. సిక్కా అనేక సానుకూల మార్పులు తీసుకొచ్చారని, ఆయన ఐడియాలను ఉద్యోగులు, క్లయింట్లతో పాటు మూర్తి కూడా మెచ్చుకునే ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు.