
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోచైర్మన్ నందన్ నీలేకని సహవ్యవస్థాపకుడిగా ఏర్పాటైన ఫండమెంటమ్ పార్టనర్‌షిప్ దేశీయంగా తొలి దశ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు వీలుగా 22.7 కోట్ల డాలర్లు(రూ. 1,793 కోట్లు) సమీకరించినట్లు వెల్లడించింది. తద్వారా ప్రాథమికస్థాయి వృద్ధిలోగల స్టార్టప్‌లకు నిధులు అందించనున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో సిరీస్–బి రౌండ్ ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు ఫండమెంటమ్ సహవ్యవస్థాపకుడు, జనరల్ పార్టనర్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు.
ఏదైనా ఒక స్టార్టప్ కొన్ని మైలురాళ్లకు చేరడం, వృద్ధి బాట పట్టడం వంటి పరిస్థితుల్లో రెండో రౌండ్ ద్వారా నిధులను అందించే సంగతి తెలిసిందే. ఇది రెండో ఫండ్ అని పేర్కొన్న ఆశిష్ ఏడాదికి 4–5 స్టార్టప్‌లకు 2.5–4 కోట్ల డాలర్ల మధ్య పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వివరించారు. 10 కోట్ల డాలర్లతో తొలి ఫండ్‌ను నిర్వహించిన ఫండమెంటమ్.. ప్రస్తుతం యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్‌ఈజీ, స్పిన్నీ తదితరాలకు నిధులు అందించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment