మీడియా ముందు ముఖ్యమంత్రి డ్రామాలు
ధర్మవరం : ప్రత్యేక హోదా కావా లంటూ మీడియా ముందు డ్రామాలు ఆడుతున్నాడేకానీ.. ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా కేంద్రానికి లేఖ ఇచ్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకోసం నిరసన చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి..ఇక్కడి ప్రజల మనోభావాలు అక్కడి వారికి తెలుస్తాయనే ఉద్దేశం కూడా లేకుండా ఏదో యుద్ధవాతావరణం ఏర్పడినట్లు ఎక్కడి వారినక్కడ అరెస్ట్ చేయించడం సమంజసం కాదన్నారు.
చంద్రబాబు భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీని గట్టిగా నిలదీయలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడని దుయ్యబట్టాడు. రాష్ట్రం మీద ఏమాత్రం బాధ్యత ఉన్నా కేంద్రంలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ మంత్రుల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమకు కాకుండా, అమరావతికి పన్ను మినహాయింపు కోరిన మహానుభావుడన్నారు. ఆయన ఎప్పుడూ ప్రాంతాలమధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుపెడుతూనే ఉంటాడన్నారు. ఏదిఏమైనా.. ప్రభుత్వం ఎంత అణచివేయాలని చూసినా.. ప్రత్యేక హోదా కోసం చేయి కలిపిన ప్రతి ఒక్కరికీ తన ధన్యావాదాలన్నారు.