'పెట్టుబడులతో భారత్కు రండి'
- ఇన్నోప్రోమ్ వేదికగా నాలుగో పారిశ్రామిక విప్లవశంఖం
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు బృందం
ఎకటెరిన్బర్గ్: నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేయని దేశాలు ప్రపంచ గమనంలో వెనుకబడిపోతాయని రష్యాలో జరుగుతున్న ఇన్నోప్రోమ్-2016 అభిప్రాయపడింది. భారత్ భాగస్వామిగా జరుగుతున్న ఇన్నోప్రోమ్-2016 ప్రారంభ వేడుక ఆదివారం సాయంత్రం రష్యాలోని ఎకటెరిన్బర్గ్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. భారతదేశం తరుపున హాజరైన కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రారంభోపన్యాసం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యానికి అంతర్జాతీయ వేదికలపై ప్రపంచదేశాల సహకారాన్ని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇన్నోప్రోమ్-2016లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధరరాజే తదితరులు ఇన్నోప్రోమ్కు తమ ప్రతినిధి బృందాలతో సహా హాజరయ్యారు. రష్యన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్ మంటురోవ్ స్వాగతోపన్యాసం చేశారు. భారత్ తరఫున 110కి పైగా పారిశ్రామిక సంస్థల ప్రాతినిధ్యంతో కూడిన ఈ ప్రదర్శనలో చైనా, ఇటలీ, మరికొన్ని దేశాల నుంచి పెద్దసంఖ్యంలో ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నాలుగు రోజులు 150కి పైగా విభిన్న తరహా కార్యక్రమాలు ఇన్నోప్రోమ్-2016లో హైలైట్ కానున్నాయని రష్యన్ వాణిజ్యమంత్రి చెప్పారు.
ప్రపంచం నవీన పారిశ్రామిక విప్లవం దిశగా పయనిస్తోందని, దీని ఫలితంగా 2020 నాటికిఅ పారిశ్రామిక రంగం 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని చవిచూడనున్నదని ఇన్నోప్రోమ్ ప్రారంభ వేడుకలో ప్రసంగించిన వక్తలు అభిప్రాయపడ్డారు. పరిశ్రమ, తయారీరంగాల్లో ప్రాధమికమైన మార్పు చోటుచేసుకోనున్నదని, ఏ దేశాలైతే ఈ దిశగా అడుగులు వేయలేకపోతాయో ఆ దేశాలు ఈ పరుగుపందెంలో వెనుకబడిపోతాయని పేర్కొన్నారు. గత ఏడాది చైనా, ఈసారి భారత్, వచ్చే ఏడాది జపాన్ భాగస్వామ్య దేశాలుగా వుండే ఈ ఇన్నోప్రోమ్ వేదిక ఎన్నో ఆలోచనలకు, పరస్పర వాణిజ్య సహకారానికి, వాణిజ్య విస్తృతికి దోహదపడగలదని అన్నారు.
అంతర్జాతీయ వాణిజ్య వేదికకు భారత్ భాగస్వామ్య దేశంగా నిలబడటం రష్యాతో దృఢమైన సంబంధాలకు తాము ఇస్త్తున్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా వృద్ధిశాతం తిరోగమనంలో వున్న తరుణంలోనూ భారత్ 7.6 శాతం నమోదు చేయడం గర్వకారణమని అన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంతో ఈ ఏడాది మరింత ఆశాజనకమైన వృద్ది సాధిస్తామని చెప్పారు. భారత్ పారిశ్రామిక వేత్తలు ప్రపంచ వాణిజ్య వేత్తలతో సత్సంబంధాలు నెరపుతారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తంచేశారు. భారత్ నుంచి ఇంజనీరింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో రష్యా అతిపెద్ద దిగుమతిదారుగా వున్నదని శ్రీమతి నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. ఇరు దేశాలూ పరస్పరం సరళతరమైన వాణిజ్యానికి తెర తీశాయని అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. రెండు దేశాలు పెట్టుబడులను మరింతగా ఆకర్షించాల్సిన అవసరం వున్నదని అన్నారు.
భారత్లో రష్యన్ పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లు వుండగా, రష్యాలో భారత్ పెట్టుబడులు 8 బిలియన్ డాలర్లుగా వున్నదని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వివరించారు. రష్యన్ పెట్ట్టుబడిదారులు భారత్కు తరలివచ్చి తమ ఉత్పత్తులను పరిచయం చేయాలని ఆమె ఈ వేదికపై నుంచి పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందుగా మనం మారాలన్న మహాత్మాగాంధీ మాటాలను స్వెర్డ్లోవస్క్ గవర్నర్ తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఔషధ, ఐటీ, ఖనిజ రంగాలలో ఎన్నో అవకాశాలు రష్యాలో వున్నాయని చెప్పారు. ఇన్నోప్రోమ్-2016 భాగస్వామ్య దేశాలకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
ఇన్నోప్రోమ్-2016 ఆరంభ వేడుకలో పెద్దఎత్తున వచ్చిన భారతీయ కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా భారత్ భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ సాగిన నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఇన్నోప్రోమ్-2016లో మొత్తం 500మంది వక్తలు ఆర్థిక, నగరీకరణ, ఐటీ, తయారీరంగాలపై ప్రసంగాలు చేయనున్నారు. వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధి బృందాలకు స్వెర్డ్లోవస్క్ గవర్నర్ సంప్రదాయక విందునిచ్చారు.