
‘ఇన్నోప్రోమ్’ సదస్సుకు సీఎం చంద్రబాబు
10 నుంచి రష్యాలో పర్యటన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ‘ఇన్నోప్రోమ్’లో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 10 నుంచి రష్యాలో పర్యటించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ సదస్సులో చంద్రబాబు మూడు కీలక ఉపన్యాసాలు చేస్తారని చెప్పారు. పారిశ్రామిక ప్రదర్శనకు భారత్ నుంచి ఏపీ, మహారాష్ట్ర, రాజస్తాన్ సీఎంలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన కజకిస్తాన్ రాజధాని ఆస్తానాను సీఎం రష్యా పర్యటనకు ఒక్కరోజు ముందుగా సందర్శిస్తారని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్, జోనింగ్ జరిగినప్పటికీ ఆస్తానా నిర్మాణ విధానాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఈ నెల 12న రష్యాలో ముఖ్యనేతలు, పారిశ్రామికవేత్తలతో సీఎం ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రష్యా పర్యటన సాగుతుందని వివరించారు.
ఉర్దూ వర్సిటీలో ఈ ఏడాది నుంచే తరగతులు: సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ముస్లిం పెద్దలు చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో కలిశారు. సీఎంకు కర్జూరం తినిపించి, ఖురాన్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో సీఎం మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సీఎంను కలిసిన వారిలో ముస్లిం పెద్ద ఫతావుల్లా, ఎండీ అక్బర్ ఉన్నారు. అలాగే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సీఎంను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.