పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు.
ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.
నాణ్యత కూడా ముఖ్యమే..
భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి.