ఇండిగో ఐపీఓ నేటి నుంచి టేకాఫ్
* ఈ నెల 29 వరకూ
* ప్రైస్‌బాండ్ రూ.700-765
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన కంపెనీ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఐపీఓ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. రూ.3,018 కోట్ల ఈ ఐపీఓ గురువారం(ఈ నెల29న) ముగుస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత భారత మార్కెట్లో ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓకు రూ.700-765 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. రూ.1,272.2 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా, రూ.1,746 కోట్ల విలువైన ముగ్గురు ప్రమోటర్ల (రాకేశ్ గంగ్వాల్, శోభా గంగ్వాల్, చిన్కెర్పు ఫ్యామిలీ ట్రస్ట్)వాటా షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా జారీ చేస్తారు.
బార్క్లేస్ బ్యాంక్ పీఎల్సీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియాలు ఈ ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఇండిగో 98 విమానాలతో సర్వీసులను నిర్వహిస్తోంది. వీటిలో 75 విమానాలను ఆపరేటింగ్ లీజ్ విధానంలో తీసుకున్నవే. ఈ విధానంలో వ్యయాలు తక్కువగా ఉంటాయని అంచనా.