సైనా నెహ్వాల్ కు అరుదైన గౌరవం
దుబాయ్: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సైనాను తన అంబాసిడర్ గా ఎంచుకున్నట్లు ప్రకటించింది. మొత్తం ఐదుగరు టాప్ ప్లేయర్లను ఫెయిర్ అండ్ హనరబుల్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ అంబాసిడర్స్ గా ఎంపిక చేసిన బీడబ్ల్యూఎఫ్ అందులో సైనాను కూడా ఎంపిక చేసినట్లు చెప్పింది. డెన్మార్క్ కు చెందిన క్రిస్టిన్నా పిడెర్సెన్, విక్టర్ అక్సెల్సెన్ లు, జపాన్ కు చెందిన డబుల్స్ పెయిర్ మిసాకి మత్సుతోమో, అయకా తకాహషిలు కూడా ఇందులో ఉన్నారు.
దుబాయ్ లో మంగళవారం జరగనున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ డిప్యూటీ ప్రెసిడెంట్ గుత్సావో సలాజర్ అంబాసిడర్లను మీడియాకు పరిచయం చేశారు. బ్యాడ్మింటన్ ను మరింత వృద్ధి చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ తీసుకున్న సరికొత్త చర్యల్లో ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ కొత్తది. బీడబ్ల్యూఎఫ్ తరఫున అంబాసిడర్లు ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ పై విస్తృత ప్రచారం చేస్తారని సలాజర్ చెప్పారు. అంబాసిడర్లుగా ఎంపికైన ప్లేయర్లకు సర్టిఫికేట్లను అందజేశారు.