మేమింతే..
సాక్షి, హన్మకొండ: ఊరందరిదీ ఓ దారైతే ఉలిపి కట్టది ఓ దారి అన్నట్టుగా ఉంది ఏటూరునాగారం ఐటీడీఏ తీరు. వనజాతర నిర్వహణలో అన్ని ప్రభుత్వ శాఖలను ముందుండి నడిపించాల్సిన ఐటీడీఏ అన్నింట్లో వెనుకబడింది. ఇతర ప్రభుత్వ శాఖలు ఇప్పటికే పనులు ప్రారంభించగా... సమీకృత గిరిజానాభివృద్ధి సంస్థ ఇంకా టెండర్ల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. గిరిజన వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాం నాయక్ ఇలాకాలోనే గిరిజన జాతరపై ఐటీడీఏ నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వం పట్టింపులేని తనానికిఅద్దం పడుతోంది. మేడారం జాతర పనులకు సంబంధించి మొదటి డెడ్లైన్ గడిచినా ఇప్పటి వరకు ఈ శాఖ పనులు ప్రాథమిక దశను కూడా దాట లేదు.
స్పష్టత లేని ఐటీడీఏ అధికారులు
వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరలో వివిధ అభివృద్ధి పనులకు ఈ శాఖ మొదట రూ.పది కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత వాటిని రూ. 6.41 కోట్లకు కుదించింది. చివరకు ఆ పనులు ప్రారంభించలేక చతికిలపడుతోంది. ఐటీడీఏ పరిధిలో రూ. 1.42 కోట్లతో జంపన్నవాగులోని మంచినీటి బావుల్లో పూడికతీత, పైపుల ద్వారా నీటి సరఫరా, రూ. 22 లక్షలతో పెయింట్, ఇతర పనులను చేపడుతోంది. ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఈ పనులు 2013 డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలి. గద్దెల చుట్టూ పెయింటింగ్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి.
మరోవైపు మంచినీటి సరఫరాకు సంబంధించిన పనుల ను టెండర్ ద్వారా వద్దంటూ స్వయంగా ఐటీడీఏ శాఖనే చేపడుతోంది. చిలకలగుట్ట, జంపన్నవాగు, రెడ్డిగూడెం సమీపంలో మంచినీటి బావులు ఉండగా... వీటిలో ఇప్పటివరకు రెడ్డిగూడెం దగ్గర ఉన్న నాలుగు బావుల్లోనే పూడికతీత పూర్తయింది. ఇక జంపన్నవాగు, చిలకల గుట్ట వద్ద ఉన్న బావుల వైపు ఐటీడీఏ అధికారు లు కన్నెత్తి చూడలేదు. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారు, పైపులెప్పుడు బిగిస్తారనే అంశంపై అధికారులకే స్పష్టత లేకుండా పోరుుంది.
కథంతా కాజ్వే చుట్టూ...
ఐటీడీఏ చేపడుతున్న పనుల్లో సగానికి పైగా నిధులు ఊరట్టం కాజ్వే చుట్టు చేపట్టే రోడ్లకు వెచ్చిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎడ్లబండ్లపై వచ్చే భక్తులకు ఈ కాజ్వే మార్గం ఎంతో కీలకం. గత జాతర తర్వాత ఈ కాజ్వే దెబ్బతినగా, డిసెంబర్లో పర్యటించిన కలెక్టర్ మరమ్మతు చేయించాలని సూచించినా ఫలితం లేదు. రూ. 24.5 లక్షలతో కాజ్వే మరమ్మతులు, రూ.50 లక్షలతో కాజ్వే నుంచి ఊరట్టం వరకు సీసీ రోడ్డు, రూ.48.50 లక్షలతో కాజ్వే నుంచి చిలకలగుట్ట వరకు రో డ్డు, రూ.40లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు నుంచి వనం రోడ్డు వరకు రహదారి, రూ.1.30 కోట్ల తో జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు నుంచి కా జ్వే వరకు కొత్తగా రోడ్డు నిర్మాణం, రూ.1.30 కోట్లతో కొండాయి-దొడ్ల వరకు రోడ్డు, రూ 4.77 కోట్లతో చిన్నచిన్న పనులతో కలిపి రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతోంది.
తొలుత అనుకున్నట్లుగా ఇవన్నీ గత నెల 31 నాటి కి పూర్తి కావాల్సి ఉండగా... 2014 జనవరి 5 నాటికి టెండర్ల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. వీటికి సంబంధించి టెక్నికల్ బిడ్లను అధికారు లు శనివారం తెరిచారు. వీటిని ఎప్పుడు పరిశీ లించి, కాంట్రాక్టర్లకు అప్పగిస్తారో.. అవెప్పుడు పూర్తవుతాయో... తెలియడం లేదు. దేశంలోనే పేరుగాంచిన అతిపెద్ద గిరిజన జాతరపై గిరిజ నుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.