Interest charges
-
పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్బీఐ కార్యాచరణగా ఉంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు.. ► రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ఇవ్వాలని ఆర్బీఐ నిర్ధేశించింది. ఆర్బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి. ► రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది. ► డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి. ► రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ► డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి. ► ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు. -
క్రెడిట్ కార్డు.. ఏదీ ఉచితం కాదు
కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు ఒక్కోసారి ఉచిత క్రెడిట్ కార్డుల గాలం వేస్తుంటాయి. అందులో కొందరు చిక్కుకుంటారు కూడా. కానీ నిజానికి క్రెడిట్ కార్డులకు సంబంధించి ఉచితమంటూ ఏదీ ఉండదు. అన్నిటికీ రకరకాల చార్జీలుంటాయి. కాకపోతే ఆయా సంస్థలు కార్డుల జారీ లక్ష్యాలను సాధించుకోవడం కోసం అన్ని వివరాలనూ ఒకోసారి ముందుగా చెప్పవు. కనక ఇలాంటి వాటి గురించి ముందుగా కాస్త అవగాహన ఉంటే ఆ తర్వాత సమస్యలుండవు.క్రెడిట్ కార్డులపై విధించే ఫీజులు, చార్జీల గురించి.. అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ కథనం. చాలా మటుకు క్రెడిట్ కార్డులకు వార్షిక మెయింటెనెన్స్ ఫీజుంటోంది. బ్యాంకు ఒకవేళ ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తామంటే దానర్థం గరిష్టంగా ఒక్క ఏడాది పాటు మాత్రమే జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు మినహాయింపునిస్తామని. ఆ తర్వాత ఎప్పట్లాగే వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు వర్తిస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం జీవితకాలం ఉచిత కార్డులిస్తున్నాయి. కాబట్టి ఉచిత క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడే అది జీవితకాలం ఉచితమా లేక తర్వాత ఏడాది నుంచి మెయింటెనెన్స్ చార్జీలు ఉంటాయా అన్నది అడిగి తెలుసుకోవాలి. వడ్డీ చార్జీలు ఎక్కువే... క్రెడిట్ కార్డు నెలవారీ బిల్లులో రెండు అమౌంట్లు ఉంటాయి. ఒకటి మొత్తం కట్టాల్సిన బకాయి కాగా రెండోది కనీసం కట్టాల్సిన అమౌంటు. మిగతాది తర్వాత కట్టొచ్చులే అనే ఉద్దేశంతో కొందరు కనీస మొత్తం చెల్లించి ఊరుకుంటుంటారు. కానీ ఆ మిగతా మొత్తం మీద దాదాపు 2–4 శాతం మేర నెలవారీగా వడ్డీ విధిస్తారన్న సంగతి వారికి తెలియదు. సాధారణంగా నెలవారీ వడ్డీ రేటును ఏడాది మొత్తానికి అన్వయించి వార్షిక ప్రాతిపదికన పర్సెంటేజీ రేటును నిర్ణయిస్తారు. ఇది ఏకంగా 36–38% స్థాయిలో కూడా ఉండొచ్చు. కార్డు పోయినా చార్జీలు.. ఒకవేళ క్రెడిట్ కార్డు పోగొట్టుకుంటే.. కొత్త కార్డు జారీ చేయాలంటే బ్యాంకు చార్జీలు వసూలు చేస్తుంది. ఏటీఎం విత్‌డ్రాయల్ చార్జీలు క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంల నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తే చార్జీలు ఉంటాయి. సాధారణంగా ఇలాంటి నగదువిత్డ్రాయల్పై లావాదేవీ చార్జీలు.. తీసుకున్న మొత్తంలో ఏకంగా 2.5 శాతం మేర ఉంటాయి. ఇదే కాకుండా విత్‌డ్రా చేసుకున్న తేదీ నుంచే వడ్డీ లెక్కింపు మొదలైపోతుంది. ఈ వడ్డీ ఏడాదికి 24–46 శాతం రేంజిలో ఉంటుంది. కనుక నగదు విత్‌డ్రాయల్ అవసరాల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగించకపోవడమే మంచిది. దాని బదులు డెబిట్ కార్డు వినియోగమే శ్రేయస్కరం. చార్జీల మోతే... లేట్ పేమెంట్ చార్జీలు గడువు లోగా నెలవారీ క్రెడిట్ కార్డు బకాయిలను ఖాతాదారు కట్టలేని పక్షంలో అదనంగా లేట్ పేమెంట్ చార్జీలు ఉంటాయి. వడ్డీ చార్జీలతో సంబంధం లేకుండా ఇది ఫ్లాట్ ఫీజు రూపంలో ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ చార్జీలు క్రెడిట్ కార్డుపై నెలవారీ ఉన్న పరిమితికి మించి కస్టమరు లావాదేవీలు జరిపిన పక్షంలో బ్యాంకు ఈ చార్జీలను విధిస్తుంది. విదేశీ లావాదేవీ చార్జీలు విదేశాల్లో క్రెడిట్ కార్డుపై జరిపే ప్రతీ లావాదేవీకి ఈ చార్జీలు వర్తిస్తాయి. ఇవి ఆయా విదేశీ లావాదేవీ పరిమాణంలో 3–5 శాతం మేర ఉంటాయి. ఈ మొత్తాన్ని సదరు లావాదేవీ జరిగిన తేదీ నాడు ఉన్న మారకం రేటు ప్రకారం రూపాయి మారకంలోకి మార్చి బ్యాంకు వసూలు చేస్తుంది. పెట్రోలు, రైలు టికెట్ కొనుగోలుపై చార్జీలు సాధారణంగా పెట్రోల్ లేదా రైలు టికెట్లను క్రెడిట్ కార్డుపై కొంటే అదనంగా చార్జీలు ఉంటాయి. ఇది కొనుగోలు వ్యయంలో నిర్దిష్ట శాతంగా ఉంటుంది. అవుట్‌స్టేషన్ చెక్ చార్జీలు క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించేందుకు అవుట్‌స్టేషన్ చెక్కులను ఉపయోగిస్తే అదనంగా చార్జీలు వర్తిస్తాయి. బిల్లు మొత్తం ఏ శ్లాబ్‌లోకి వస్తుందో చూసి.. దాన్ని బట్టి బ్యాంకు నిర్దిష్ట శాతం మేర చార్జీలు వసూలు చేస్తుంది. చెక్కు బౌన్సింగ్ లేదా ఈసీఎస్ చార్జీలు ఒకవేళ క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపునకు జారీ చేసిన చెక్కు బౌన్సయినా లేదా డిజానర్ అయినా.. అదనంగా చార్జీల వడ్డన ఉంటుంది. సేవా పన్ను.. క్రెడిట్ కార్డు లావాదేవీలపై సేవా పన్ను ఉంటుంది. ఇవీ ఆర్బీఐ నిబంధనలు.. క్రెడిట్ కార్డు సమస్యల నుంచి ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం ఆర్బీఐ సూచనలకు లోబడే వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు ఉండాలి. బ్యాంకులు క్రెడిట్ కార్డులపై తాము వసూలు చేసే వడ్డీ సీలింగ్ రేటు (ప్రాసెసింగ్, ఇతరత్రా చార్జీలు సహా) ముందుగానే వెల్లడించాలి. వీటితో పాటు మరికొన్ని నిబంధనలు.. ఒకవేళ ఎవరైనా కస్టమర్ నుంచి అధిక వడ్డీ రేటు వసూలు చేస్తుంటే దానికి తగిన కారణాలు (డిఫాల్ట్ కావడం మొదలైనవి) ఖాతాదారుకు తెలియజేయాలి. ఇందులో భాగంగా వివిధ రకాల ఖాతాదారుల నుంచి వసూలు చేసే వడ్డీ రేట్లను బ్యాంకులు తమ వెబ్సైట్లలోనూ ఇతరత్రా సాధనాల్లోనూ ముద్రించి, అవగాహన కల్పించాలి. ఇక ఏయే చార్జీల వడ్డన ఉంటుందనే దానిపై కార్డు హోల్డరుకు తెలియజేసేలా లెక్కించేందుకు ఉపయోగిస్తున్న విధానాలను తెలియజేయాలి. మినిమం బ్యాలెన్స్ మాత్రమే కడుతున్న పక్షంలో గడువు తేదీ తర్వాత బకాయి మొత్తం మీద వడ్డీ వడ్డింపు ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతో తెలియజేయాలి. ప్రతి నెలా మినిమం బ్యాలెన్సే కట్టుకుంటూ పోతే మొత్తం బకాయి తీరడానికి అనేక సంవత్సరాలు పడుతుందన్న సంగతి తెలియజెప్పేందుకు తగు చర్యలు తీసుకోవాలి.