రియల్టీ సెక్టార్కు మోదీ జోష్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రాయితీలతో సోమవారం నాటి మార్కెట్లో రియల్టీ దూసుకుపోతోంది. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ పేదప్రజలకనుగుణంగా గృహ నిర్మాణం రాయితీలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు మాంచి జోష్ నిచ్చాయి. ఒకవైపు మార్కెట్లు100 పాయింట్లకు పైగా కోల్పోయి నష్టాల బాటలో సాగుతున్నప్పటికీ రియల్టీ ఇండెక్స్ లాభాల్లో పరుగులు పెడుతోంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా, ఇతర వివిధ బ్యాంకులు ఎంసీఎల్ ఆర్ భారీ తగ్గింపును ప్రకటించడం ఈ రంగానికి సానుకూలంగా మారింది. లెండింగ్ రేటు తగ్గింపుతో బ్యాంకింగ్ సెక్టార్ కుదేలవ్వగా రియల్టీ సుమారు 2.2 శాతానిపైగా లాభపడుతోంది.
ముఖ్యంగా ప్రధాని ప్రకటించిన ప్రోత్సాహకాలు రియల్టీకి మంచి బూస్ట్ ఇవ్వనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ రంగాలో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. దీంతో యూనిటెక్ 6.3 శాతం జంప్చేయగా, హెచ్డీఐఎల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐబీ రియల్టీ, శోభా డెవలపర్స్ 3.7-1.4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల లాభాలు కూడా జోరుగా ఉన్నాయి. కోల్టే పాటిల్ డెవలపర్స్ 5 శాతం, అన్సాల్10శాతం లాభపడుతున్నాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, బీవోబీ, యూనియన్ బ్యాంక్ , కోటక్ బ్యాంక్ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.