interm Budjet
-
36,220–36,778 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్ ప్రతిపాదనల అనంతరం లబ్దిపొందుతాయని అంచనావేస్తున్న ఆటో, కన్జూమర్ షేర్లు ర్యాలీ జరపగా, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలతో బాండ్లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు క్షీణించాయి. మరోవైపు రూపాయి క్షీణత ఫలితంగా ఐటీ షేర్లు కూడా మెరుగుపడ్డాయి. రానున్న కొద్ది రోజుల్లో బడ్జెట్ రోజునాటి ట్రెండే కొనసాగే అవకాశం లేదు. మరో మూడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై అంచనాలు, ప్రపంచ ఆర్థికాభివృద్ధి గమనం తదితర అంశాలపై మార్కెట్ దృష్టి నిలపవచ్చు. తాజా బడ్జెట్ ప్రతిపాదనలపై విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్ కదలికలు ఉండొచ్చు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... ఫిబ్రవరి 1తో ముగిసిన వారం తొలిరోజున 35,565 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం బడ్జెట్ సమర్పణ తర్వాత 36,778 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంకంటే 444 పాయింట్లు లాభపడి 36,469 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలు సెన్సెక్స్ సమీప ట్రెండ్‌కు కీలకం. ఆ రోజునాటి కనిష్టస్థాయి అయిన 36,220 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తుండగా, నిరోధం ఆ రోజునాటి గరిష్టస్థాయి అయిన 36,778 పాయింట్ల వద్ద ఎదురవుతున్నది, ఈ శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు సెన్సెక్స్ వచ్చేవారం కదలవచ్చు. 36,220 పాయింట్ల స్థాయిని కోల్పోతే వేగంగా 35,740 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ రెండో మద్దతును కోల్పోయి, ముగిస్తే 35,565–35,380 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం 36,778 పాయింట్ల స్థాయిని అధిగమించి, ముగిస్తే అప్‌ట్రెండ్ బలోపేతమై 37,050–37,200 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపై 37,500 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక శ్రేణి 10,813–10,983 గతవారం తొలిరోజున 10,630 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తదుపరి క్రమేపీ పెరుగుతూ వారాంతంలో 10,983 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 114 పాయింట్ల లాభంతో 10,894 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలైన 10,813–10,983 పాయింట్ల శ్రేణిని నిఫ్టీ ఎటు ఛేదిస్తే అటు వేగంగా కదలవచ్చు. 10,813 పాయింట్ల స్థాయిని కోల్పోయి, ముగిస్తే 10,680 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ రెండో మద్దతును సైతం వదులుకుంటే వేగంగా 10,630–10,535 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,983 పాయింట్ల స్థాయిని దాటగలిగితే పటిష్టమైన అప్ట్రెండ్లోకి మార్కెట్ మళ్లవచ్చు. కొద్ది వారాల నుంచి పలు దఫాలు గట్టి అవరోధాన్ని కల్పిస్తున్న ఈ స్థాయిపైన నిఫ్టీ వేగంగా 11,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,220 పాయింట్ల స్థాయి కూడా నిఫ్టీకి కష్టసాధ్యం కాదు. -
కోతల్లోనే ఘనత!
సమీప భవిష్యత్తులో మళ్లీ అధికారానికి వచ్చే అవకాశాలు లేనేలేని యూపీఏ ప్రభుత్వం తన చివరాఖరి సాధారణ బడ్జెట్‌ను సోమవారం పార్లమెంటుకు సమర్పించింది. మొన్నటి రైల్వే బడ్జెట్‌కైనా, ఇవాళ్టి సాధారణ బడ్జెట్‌కైనా స్వపక్షం సభ్యులు, కేంద్ర మంత్రులే తీవ్ర ఆటంకాలు కల్పించారంటే అది యూపీఏ పాలనా తీరుకు, దాని దిగజారుడుతనానికి అద్దం పడుతుంది. ఒక చర్యకు సంసిద్ధమవుతూ, దానికి వ్యతిరేకంగా సభలో ఏమైనా చేసుకోండని తనవారికే చెప్పే పాలకపక్షాన్ని బహుశా మరెక్కడా చూడలేం. అయితే ఈ కపటనాటకం చాటునా, అది సృష్టించిన అయోమయం చాటునా కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం దేశ ప్రజలనుంచి చాలా అంశాలను మరుగున పడేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంవత్సరం గనుకా, ఇది అనామతు ఖాతాయే గనుకా ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రతిపాదనలేమీ ఇందులో ఉండబోవన్నది అందరూ అనుకున్నదే. అయితే, ద్రవ్యలోటును తమ ప్రభుత్వం గణనీయంగా అదుపు చేయగలిగిందని చిదంబరం చెప్పుకోవడంలోనే అసలు సంగతంతా ఉంది. ద్రవ్యలోటుకు కళ్లెం వేయడానికి ప్రయత్నించడమంటే ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవడం. వృథా వ్యయాన్ని గుర్తించి దాన్ని తగ్గించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆ పేరిట సామాజిక సంక్షేమ పథకాల కేటాయింపులకు కోత విధించడమే ప్రభుత్వాలు నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు చిదంబరం ఏకరువు పెట్టిన గణాంకాలను గమనిస్తే ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో ప్రణాళికా వ్యయం దాదాపు రూ. 80,000 కోట్లు కోతకు గురైందని అర్ధమవుతుంది. అంటే, ప్రతిపాదిత ప్రణాళికా వ్యయంలో 14.4శాతం తగ్గింది. వివిధ పథకాలద్వారా ఉత్పాదకతను పెంచే, జీవనప్రమాణాలను పెంచే ప్రణాళికా వ్యయానికి కోతబెట్టడమంటే సామాజిక సంక్షేమాన్ని గాలికొదలడమే. ప్రభుత్వం వైపు నుంచి ఆయా రంగాలకు అందాల్సిన పెట్టుబడులకు నిలిపేయడమే. అలాంటి పనిచేసి, అది తమ ఘనతగా చెప్పుకోవడం చిదంబరానికే చెల్లింది. ఉదాహరణకు సామాజిక సేవలకు గత బడ్జెట్లో రూ. 1,93,043 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 1,64,393 కోట్లు మాత్రమే ఉంది. పరిశ్రమలు, గనుల ఖాతాకు రూ. 48,010 కోట్లు కేటాయించగా అదిప్పుడు రూ. 36,167కోట్లవద్దే ఆగిపోయింది. గ్రామీణాభివృద్ధికి రూ. 56,438 కోట్లు కేటాయించిన చిదంబరం ఇప్పుడు సవరించిన అంచనాలను రూ. 50,646 కోట్లుగా చూపుతున్నారు. వాస్తవానికి మన పల్లెసీమల దీన స్థితిని, మౌలిక సదుపాయాల విషయంలో అవి వెనకబడివున్న తీరును గమనిస్తే నిరుడు బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం ఏమాత్రం సరిపోదని అప్పట్లోనే నిపుణులు చెప్పారు. తీరా యూపీఏ ప్రభుత్వం ఆమాత్రం మొత్తానికికూడా కోతవేసిందని అర్ధమవుతోంది. ఆఖరికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తం రూ. 18,781 కోట్లలో రూ. 1,224 కోట్లు ఆపేశారు. తాజా బడ్జెట్లో దాని పరిస్థితి మరీ ఘోరం. ఈసారి ఆ రంగాలకు కేటాయించింది కేవలం రూ. 9,987 కోట్లు మాత్రమే! పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు వెళ్లాల్సిన రూ. 22,000 కోట్లకూ కోతపడింది. సబ్సిడీలకు ఈసారి 2.46 లక్షల కోట్లు వ్యయం చేయనున్నట్టు చిదంబరం ఘనంగా ప్రకటించారు. అయితే, ముందటి సంవత్సరం(2012-13) బడ్జెట్లో కేటాయించిన మొత్తంతో పోల్చినా ఇది దాదాపు రూ. 2,000 కోట్లు తక్కువ. నిరుడు అందులో దాదాపు రూ. 27,000 కోట్లు కోత విధించి, ఇది ఎన్నికల సంవత్సరం గనుక మళ్లీ యథాతథ స్థితికి తెచ్చారు. అయితే, వాస్తవ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని లెక్కేస్తే ఈ కేటాయింపు తక్కువగా ఉన్నట్టే లెక్క. పైగా, ఈసారి ఆహార భద్రత చట్టం అమలుకయ్యే వ్యయం కొత్తగా కలుస్తుంది గనుక ఇతర రంగాల సబ్సిడీలకు ఆమేరకు కోత పడుతుంది. ఇక ఎరువుల సబ్సిడీలకు నిరుడు కేటాయించిన రూ. 67,970 కోట్లు మాత్రమే ఈసారి కూడా కొనసాగించారు. సర్కారు నిర్వాకం ఫలితంగా ఉత్పాదక రంగం దారుణంగా దెబ్బతిన్నా...రైతులు మాత్రం రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసి దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టారు. అందుకోసమైనా ఎరువుల సబ్సిడీలకిచ్చే మొత్తానికి పెంచాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం గ్రహించివుంటే బాగుండేది. గడిచిన సంవత్సరంలో ద్రవ్యలోటు శాతం 4.8 శాతంగా ఉండగలదని అంచనా వేసి, దాన్ని అంతకంటే తక్కువకు...అంటే 4.6 శాతానికి తగ్గించగలిగానని చిదంబరం సంతోషించి ఉండొచ్చుగానీ ఆ క్రమంలో సాధారణ ప్రజానీకానికి అందాల్సిన పథకాలకూ, ఇతరేతర ప్రాజెక్టులకూ అన్యాయం జరిగింది. ఇక ఉన్నతాదాయవర్గాలు ఉపయోగించే కార్లు, ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లు, ఇతర వినియోగ వస్తువులపైనా సుంకాలు తగ్గించారు. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడమే ఇందులోని ఆంతర్యం. ఆదాయ పన్ను శ్లాబ్‌ల సవరణ జోలికి మాత్రం వెళ్లలేదు. చిరకాలంగా మాజీ సైనికోద్యోగులు కోరుతున్న... ఒకే హోదావారికి ఒకే పింఛన్ ఇవ్వలన్న డిమాండుకు ఈ ఎన్నికల సంవత్సరంలో మోక్షం లభించింది. నిరుడు నిర్భయ స్మృతిలో రూ. 1,000 కోట్లతో ప్రారంభించిన ప్రత్యేక నిధికి ఈసారి రెట్టింపు మొత్తాన్ని కేటాయించారు. అయితే, ఎంతమంది అత్యాచార బాధితులకు నిర్భయ నిధి ఆసరా ఇవ్వగలిగిందో ప్రభుత్వం చెబితే బాగుండేది. 2006-07నాటికి 9.6 శాతంవరకూ వెళ్లిన వృద్ధిరేటు ఆ తర్వాత క్రమేపీ ఎందుకు క్షీణించిందో....అందుకు అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో పెరుగుతూ పోయిన కుంభకోణాల పాత్ర ఎంతో ‘ప్రోగ్రెస్ రిపోర్టు’లో చిదంబరం చెప్పలేదు. మొత్తానికి కొసమెరుపులేమీ లేకుండానే యూపీఏ ఆఖరి బడ్జెట్ ముగిసిపోయింది.