కోతల్లోనే ఘనత! | Union interm Budjet | Sakshi
Sakshi News home page

కోతల్లోనే ఘనత!

Published Tue, Feb 18 2014 1:31 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Union interm Budjet

సమీప భవిష్యత్తులో మళ్లీ అధికారానికి వచ్చే అవకాశాలు లేనేలేని యూపీఏ ప్రభుత్వం తన చివరాఖరి సాధారణ బడ్జెట్‌ను సోమవారం పార్లమెంటుకు సమర్పించింది. మొన్నటి రైల్వే బడ్జెట్‌కైనా, ఇవాళ్టి సాధారణ బడ్జెట్‌కైనా స్వపక్షం సభ్యులు, కేంద్ర మంత్రులే తీవ్ర ఆటంకాలు కల్పించారంటే అది యూపీఏ పాలనా తీరుకు, దాని దిగజారుడుతనానికి అద్దం పడుతుంది.  ఒక చర్యకు సంసిద్ధమవుతూ, దానికి వ్యతిరేకంగా సభలో ఏమైనా చేసుకోండని తనవారికే చెప్పే పాలకపక్షాన్ని బహుశా మరెక్కడా చూడలేం. అయితే ఈ కపటనాటకం చాటునా, అది సృష్టించిన అయోమయం చాటునా కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం దేశ ప్రజలనుంచి చాలా అంశాలను మరుగున పడేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంవత్సరం గనుకా, ఇది అనామతు ఖాతాయే గనుకా ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రతిపాదనలేమీ ఇందులో ఉండబోవన్నది అందరూ అనుకున్నదే. అయితే,  ద్రవ్యలోటును తమ ప్రభుత్వం గణనీయంగా అదుపు చేయగలిగిందని చిదంబరం చెప్పుకోవడంలోనే అసలు సంగతంతా ఉంది. ద్రవ్యలోటుకు కళ్లెం వేయడానికి ప్రయత్నించడమంటే ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవడం. వృథా వ్యయాన్ని గుర్తించి దాన్ని తగ్గించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆ పేరిట సామాజిక సంక్షేమ పథకాల కేటాయింపులకు కోత విధించడమే ప్రభుత్వాలు నేర్చుకుంటున్నాయి.
 
 ఇప్పుడు చిదంబరం ఏకరువు పెట్టిన గణాంకాలను గమనిస్తే ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో ప్రణాళికా వ్యయం దాదాపు రూ. 80,000 కోట్లు కోతకు గురైందని అర్ధమవుతుంది. అంటే, ప్రతిపాదిత ప్రణాళికా వ్యయంలో 14.4శాతం తగ్గింది. వివిధ పథకాలద్వారా ఉత్పాదకతను పెంచే, జీవనప్రమాణాలను పెంచే ప్రణాళికా వ్యయానికి కోతబెట్టడమంటే సామాజిక సంక్షేమాన్ని గాలికొదలడమే. ప్రభుత్వం వైపు నుంచి ఆయా రంగాలకు అందాల్సిన పెట్టుబడులకు నిలిపేయడమే. అలాంటి పనిచేసి, అది తమ ఘనతగా చెప్పుకోవడం చిదంబరానికే చెల్లింది. ఉదాహరణకు సామాజిక సేవలకు గత బడ్జెట్‌లో రూ. 1,93,043 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 1,64,393 కోట్లు మాత్రమే ఉంది. పరిశ్రమలు, గనుల ఖాతాకు రూ. 48,010 కోట్లు కేటాయించగా అదిప్పుడు రూ. 36,167కోట్లవద్దే ఆగిపోయింది. గ్రామీణాభివృద్ధికి రూ. 56,438 కోట్లు కేటాయించిన చిదంబరం ఇప్పుడు సవరించిన అంచనాలను రూ. 50,646 కోట్లుగా చూపుతున్నారు. వాస్తవానికి మన పల్లెసీమల దీన స్థితిని, మౌలిక సదుపాయాల విషయంలో అవి వెనకబడివున్న తీరును గమనిస్తే నిరుడు బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం ఏమాత్రం సరిపోదని అప్పట్లోనే నిపుణులు చెప్పారు. తీరా యూపీఏ ప్రభుత్వం ఆమాత్రం మొత్తానికికూడా కోతవేసిందని అర్ధమవుతోంది. ఆఖరికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తం రూ. 18,781 కోట్లలో రూ. 1,224 కోట్లు ఆపేశారు. తాజా బడ్జెట్‌లో దాని పరిస్థితి మరీ ఘోరం. ఈసారి ఆ రంగాలకు కేటాయించింది కేవలం రూ. 9,987 కోట్లు మాత్రమే! పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు వెళ్లాల్సిన రూ. 22,000 కోట్లకూ కోతపడింది. సబ్సిడీలకు ఈసారి 2.46 లక్షల కోట్లు వ్యయం చేయనున్నట్టు చిదంబరం ఘనంగా ప్రకటించారు. అయితే, ముందటి సంవత్సరం(2012-13) బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంతో పోల్చినా ఇది దాదాపు రూ. 2,000 కోట్లు తక్కువ. నిరుడు అందులో దాదాపు రూ. 27,000 కోట్లు కోత విధించి, ఇది ఎన్నికల సంవత్సరం గనుక మళ్లీ యథాతథ స్థితికి తెచ్చారు. అయితే, వాస్తవ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని లెక్కేస్తే ఈ కేటాయింపు తక్కువగా ఉన్నట్టే లెక్క. పైగా, ఈసారి ఆహార భద్రత చట్టం అమలుకయ్యే వ్యయం కొత్తగా కలుస్తుంది గనుక ఇతర రంగాల సబ్సిడీలకు ఆమేరకు కోత పడుతుంది. ఇక ఎరువుల సబ్సిడీలకు నిరుడు కేటాయించిన రూ. 67,970 కోట్లు మాత్రమే ఈసారి కూడా కొనసాగించారు. సర్కారు నిర్వాకం ఫలితంగా ఉత్పాదక రంగం దారుణంగా దెబ్బతిన్నా...రైతులు మాత్రం రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసి దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టారు. అందుకోసమైనా ఎరువుల సబ్సిడీలకిచ్చే మొత్తానికి పెంచాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం గ్రహించివుంటే బాగుండేది. గడిచిన సంవత్సరంలో ద్రవ్యలోటు శాతం 4.8 శాతంగా ఉండగలదని అంచనా వేసి, దాన్ని అంతకంటే తక్కువకు...అంటే 4.6 శాతానికి తగ్గించగలిగానని చిదంబరం సంతోషించి ఉండొచ్చుగానీ ఆ క్రమంలో సాధారణ ప్రజానీకానికి అందాల్సిన పథకాలకూ, ఇతరేతర ప్రాజెక్టులకూ అన్యాయం జరిగింది.
 
  ఇక ఉన్నతాదాయవర్గాలు ఉపయోగించే కార్లు, ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు, ఇతర వినియోగ వస్తువులపైనా సుంకాలు తగ్గించారు. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడమే ఇందులోని ఆంతర్యం. ఆదాయ పన్ను శ్లాబ్‌ల సవరణ జోలికి మాత్రం వెళ్లలేదు. చిరకాలంగా మాజీ సైనికోద్యోగులు కోరుతున్న... ఒకే హోదావారికి ఒకే పింఛన్ ఇవ్వలన్న డిమాండుకు ఈ ఎన్నికల సంవత్సరంలో మోక్షం లభించింది. నిరుడు నిర్భయ స్మృతిలో రూ. 1,000 కోట్లతో ప్రారంభించిన ప్రత్యేక నిధికి ఈసారి రెట్టింపు మొత్తాన్ని కేటాయించారు. అయితే, ఎంతమంది అత్యాచార బాధితులకు నిర్భయ నిధి ఆసరా ఇవ్వగలిగిందో ప్రభుత్వం చెబితే బాగుండేది. 2006-07నాటికి 9.6 శాతంవరకూ వెళ్లిన వృద్ధిరేటు ఆ తర్వాత క్రమేపీ ఎందుకు క్షీణించిందో....అందుకు అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో పెరుగుతూ పోయిన కుంభకోణాల పాత్ర ఎంతో ‘ప్రోగ్రెస్ రిపోర్టు’లో చిదంబరం చెప్పలేదు. మొత్తానికి కొసమెరుపులేమీ లేకుండానే యూపీఏ ఆఖరి బడ్జెట్ ముగిసిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement