క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో జరిపించే సర్వేలపై ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు పెదవి విరుస్తుంటారు. ఎన్నో పరిమితులతో జరిపే ఇలాంటి సర్వేలవల్ల వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం తక్కువంటారు. అయితే, అంత విస్తృతమైన యంత్రాంగం ఉండే వ్యవస్థ మరోటి ఉండదు గనుక...స్థూలంగానైనా పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి అంతకుమించి గత్యంతరం లేదు. ఇటీవల జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) వివిధ అంశాలపై విడుదల చేసిన గణాకంకాలను గమనించిన వారెవరికైనా అసంతృప్తి కలగకమానదు. ఆ సంస్థ మంచినీరు, నిరుద్యోగం, మురికివాడలు వంటి అంశాలపై నివేదికలను విడుదలచేసింది. మురికివాడల విషయంలో ఆ సంస్థ నివేదిక కొంత ఆశాజనకంగా కనబడుతున్నా మంచినీరు లభ్యతలో నెలకొన్న దుస్థితి ఆందోళన రేకెత్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 46.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 76.8 శాతం కుటుంబాలకు మాత్రమే ఇళ్లవద్ద మంచినీరు లభ్యమవుతున్నదని నివేదిక చెబుతోంది. దీన్నిబట్టి గ్రామాల్లో దాదాపు 54 శాతంమంది, పట్టణప్రాంతాల్లో 23.2 శాతంమంది ఎక్కడెక్కడినుంచో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితులున్నాయని అర్ధం. అయితే, ఇళ్లవద్ద మంచినీరు లభ్యమవుతున్నదని సర్వే చెప్పినంతమాత్రాన అది రోజూ సాధ్యమవుతున్నదని భావించలేం. రోజు విడిచి రోజు ఇవ్వడం మొదలుకొని వారానికి, పదిరోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా చేసే స్థితి ఎన్నోచోట్ల ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి కోసం సగటున 35 నిమిషాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 31 నిమిషాలు వెచ్చించవలసి వస్తున్నదని ఆ సర్వేయే చెబుతోంది. ఇది 2008-09నాటితో పోలిస్తే బాగా పెరిగిందని కూడా అంటున్నది. అంటే, మంచినీటి లభ్యత ఆనాటికానాటికి తగ్గుతున్నదని అర్ధం. నీటి కోసం సగటున 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం కుటుంబాలు కనీసం అర కిలోమీటరు వెళ్లకతప్పదని సర్వే చెబుతోంది. మన దేశంలో మిగిలిన ఇంటి పనుల్లాగే మంచినీరు సంపాదించే భారం కూడా ఇల్లాలిదే గనుక ఇంత దూరం వెళ్లడం, తెచ్చుకోవడమనే పని ఎక్కువగా వారి మీదే పడుతుందని సులభంగానే అర్ధమవుతుంది.
మంచినీటి లభ్యత లేకపోవడంవల్ల ఎదురయ్యే సమస్యలు బహుముఖమైనవి. పల్లె ప్రాంతాల్లోని 85 శాతం తాగునీటి అవసరాలను భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. 46.1 శాతంమందికి ఇంటివద్దనే మంచినీరు లభ్యమవుతున్నదని సర్వే చెబుతున్నంత మాత్రాన అదంతా సురక్షితమైన నీరు అని భావించడానికి వీల్లేదు. ఈ మంచినీరులో ఎక్కువ భాగం ఈ భూగర్భ జలాలనుంచి పంపిణీ చేస్తున్నదే. ఆ నీటి స్వచ్ఛత సందేహాస్పదమైనది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి శుద్ధికి సంబంధించి అమలుచేసే సాంకేతికత ఇప్పటికీ అంతంతమాత్రమే. పరిశుభ్రమైన మంచినీరు పొందడం ప్రాథమిక హక్కుగా గుర్తించిన ఈ దేశంలో నీటి సంబంధమైన రోగాలతోనే ఎక్కువమంది అస్వస్థులవుతున్నారు. వారిలో అనేకులు మృత్యువాతపడుతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ప్రజలు ఫ్లోరైడ్, ఆర్సెనిక్, నైట్రేట్ వంటి హానికారకాలు మింగవలసి వస్తున్నదని ఇతరేతర గణాంకాలు చెబుతున్నాయి. మన రాష్ట్రం విషయమే తీసుకుంటే నల్లగొండ, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు గ్రామాలు సరైన నీరు లభించక వ్యాధులబారిన పడుతున్నాయి. పరిశుభ్రమైన నీరు లభించకపోవడంవల్ల గ్రామీణులు ఎముకలు గుల్లబారడం, మూత్రపిండాలు దెబ్బతినడం, బుద్ధిమాంద్యం రావడం వగైరా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన తాగునీరును ఎంతమంది పొందగలుగుతున్నారో సర్వే చేసిన సంస్థ ఆరా తీస్తే కళ్లు తిరిగే ఫలితాలు వెల్లడవుతాయి. కానీ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఆ దిశగా దృష్టి సారించలేదు. ప్రపంచంలో ఏటా 34 లక్షలమంది నీటిద్వారా సోకే వ్యాధులవల్లే మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతున్నది. ఇంటివద్ద అవసరమైన నీరు లభించని పరిస్థితులుండటంవల్ల అది వ్యక్తిగత పరిశుభ్రతపైనా, పారిశుద్ధ్యంపైనా కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇళ్లవద్దే మరుగుదొడ్లు ఏర్పాటుచేసుకోవడం నీరు లభ్యంకాని కుటుంబాలకు సాధ్యం కాదు. కనుక అలాంటివారంతా పారిశుద్ధ్యలోపం కారణంగా మరిన్ని వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుంది.
ఇక ఉద్యోగిత శాతం కూడా అంతంతమాత్రంగానే ఉన్నదని సర్వే వెల్లడించింది. ఉపాధి లభ్యతలో పెరుగుదల రేటు తిరోగమనంలో ఉన్నదని నివేదిక అంటున్నది. 2009-10లో ఉపాధి లభ్యత 39.2 శాతం ఉంటే, 2011-12కు అది 38.6 శాతం ఉందని సర్వే వివరించింది. ఉపాధిని పెంచడం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నట్టు చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పథకాల ప్రభావం అవసరమైన స్థాయిలో ఉండటం లేదని ఈ గణాంకాలను చూస్తే అర్ధమవుతుంది. 2004-05 మొదలుకొని చూస్తే గ్రామీణ యువతలోనూ, పట్టణ యువతలోనూ నిరుద్యోగం అంచెలంచెలుగా పెరుగుతోంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు క్రమేపీ తగ్గుతున్నాయని నివేదిక చెప్పడం ప్రభుత్వానికి కొంతలో కొంత ఓదార్పు కలిగిస్తుంది. 2009తో పోలిస్తే మురికివాడల తగ్గుదల మూడోవంతు ఉందని నివేదిక అంటున్నది. అక్కడుండే 71 శాతం కుటుంబాలకు మంచినీరు లభ్యమవుతున్నదని నివేదిక తెలిపింది. అయితే, అక్కడి పిల్లలకు ఇప్పటికీ విద్య, వైద్యంవంటి సదుపాయాలు సరిగా లేవు. ఒకపక్క తమ పాలనవల్ల దేశంలో అన్ని రంగాలూ మెరుగుపడ్డాయని యూపీఏ ప్రభుత్వం చెప్పుకుంటుండగా వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నదని తాజా సర్వే వెల్లడిస్తున్నది. ప్రభుత్వ విభాగాలు ఎన్నో పరిమితులకు లోబడి చేసే ఇలాంటి సర్వేలు కూడా భయంకర వాస్తవాలను వెల్లడిస్తున్నందున పాలకుల్లో ఇప్పటికైనా కదలిక రావాలి. అవసరమైన చర్యలకు సిద్ధపడాలి.
చేదు నిజాల సర్వే!
Published Wed, Jan 1 2014 12:14 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement