ఈ వివాదం సరికాదు | Judicial appointments: Supreme Court vs central govt | Sakshi
Sakshi News home page

ఈ వివాదం సరికాదు

Published Tue, Nov 29 2016 1:31 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ఈ వివాదం సరికాదు - Sakshi

ఈ వివాదం సరికాదు

న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఎడతెగకుండా కొనసాగుతున్న వివాదంలో మరో కొత్త అంకానికి తెర లేచింది. మరోసారి ఇరు పక్షాలూ మాటల యుద్ధానికి దిగాయి. ఈసారి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ అఖిల భారత సదస్సు దీనికి వేదికైంది. వివిధ హైకోర్టుల్లో 500 న్యాయమూర్తుల ఖాళీలున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌. ఠాకూర్‌ అంటే... కింది స్థాయి కోర్టుల్లో 5,000 న్యాయాధికారుల నియామకాల మాటేమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చురకంటించారు. ఈ రెండూ నిజమే. సమస్యల్లా రెండింటి విష యంలోనూ ఇరు పక్షాలూ కూర్చుని మాట్లాడుకోకపోవడమే! అలాంటి సందర్భమే అసలు రానట్టు ఇరువురూ బహిరంగ వేదికలపై సంవాదం జరుపుకోవడం వారి కెలా ఉందో గానీ చూసేవారికి మాత్రం అయోమయంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోకుండా అలాంటి పరిస్థితి తలెత్తితే వేరు. కానీ పదే పదే ఇది పునరావృతమవుతోంది. ప్రభుత్వ విభాగాలు లక్ష్మణరేఖ దాటకూడదని జస్టిస్‌ టి.ఎస్‌. ఠాకూర్‌ అంటే... న్యాయవ్యవస్థకూ ఆ రేఖ ఉంటుందని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ గుర్తుచేశారు.

రవిశంకర్‌ ప్రసాద్‌ అయితే అత్యవసర పరిస్థితి చీకటి రోజుల్ని గుర్తుచేసి అప్పుడు హైకోర్టులన్నీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తే సుప్రీంకోర్టు దారుణంగా విఫలమైందని చెప్పారు. మౌలిక సమస్య నుంచి ఇరు పక్షాలూ చాలా దూరం జరిగాయని దీన్నంతా గమనిస్తే అర్ధమవుతుంది. అసలు సమస్య పరి ష్కారమై ఉంటే ఇలా పరస్పరం చురకలంటించుకునే స్థితి ఏర్పడేది కాదని సుల భంగానే చెప్పొచ్చు. లక్ష్మణ రేఖ ప్రస్తావనకు రావడం ఇది మొదటిసారేమీ కాదు. సరిగ్గా ఆర్నెల్ల క్రితం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఈ మాటే చెప్పారు. అంతకు నాలుగేళ్ల మునుపే 2012లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. హెచ్‌. కపాడియా కూడా దీన్ని అంగీ కరించారు. అందువల్ల ఒక్కోసారి సమతుల్యత దెబ్బతింటున్న మాట వాస్తవమే అయినా ‘న్యాయం చేయాలన్న ఆత్రుతే’ అందుకు కారణమని సంజాయిషీ ఇచ్చు కున్నారు.

సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య విభేదాలున్నాయి. కొన్ని దశాబ్దా లుగా అనుసరిస్తున్న కొలీజియం విధానంలో లోపాలున్నాయని, కమిషన్‌ ఏర్పాటు చేసి నియామకాల ప్రక్రియ సాగిస్తే పారదర్శకత ఉంటుందని కేంద్రం చెబుతోంది. అది కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యానికి దారితీస్తుందన్నది న్యాయ వ్యవస్థ అభ్యంతరం. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమిషన్‌ ఏర్పాటు ప్రయత్నం జరి గినా సాధ్యపడలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ బాధ్యతను స్వీకరించి జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ చట్టాన్ని, అందుకనుగుణంగా రాజ్యాంగ సవరణను చేసింది. అయితే అవి చెల్లుబాటుకావని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం కొట్టే సింది. ఆ తర్వాత చాన్నాళ్లు అనిశ్చితి కొనసాగినా న్యాయవ్యవస్థ అడగ్గా అడగ్గా కేంద్రం విధానపత్రం(ఎంఓపీ) విడుదల చేసింది. అయితే జాతీయ భద్రత రీత్యా ఏ నియామకాన్నయినా, పదోన్నతినైనా జాతీయ భద్రత రీత్యా తిరస్కరించే హక్కు కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండాలన్న అందులోని నిబంధనను న్యాయ వ్యవస్థ అంగీకరించలేదు. ఈ నిబంధన తమ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని అది భావించింది. దానిపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదరనంత మాత్రాన నియామకాలు ఆగిపోలేదు.

కానీ అవి అనుకున్న స్థాయిలో వేగంగా జరగటం లేదన్నది న్యాయ వ్యవస్థ ఫిర్యాదు. ఆ పంచాయతీ సాగుతుండగానే మళ్లీ సుప్రీంకోర్టు కొలీజియం నుంచి 77 మందితో నియామకాల జాబితా వెళ్లింది. అందులో 34 నియామకాలను కేంద్రం అంగీకరించి మిగిలిన 43 పేర్లను తిప్పి పంపింది. ‘జాతీయ భద్రతా కారణాల రీత్యా’ వీరి నియామకాలను అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఇంతవరకూ అనుసరిస్తున్న పద్ధతి ప్రకారమైతే కేంద్రం కాదన్న పేర్లను సుప్రీంకోర్టు వెనక్కి పంపేది. అప్పుడిక కేంద్రం అంగీకరించాల్సివచ్చేది. ఇప్పుడు మాత్రం అలా చేసే ఉద్దేశం మోదీ ప్రభు త్వానికి లేదు. అందుకే ముందు ఎంఓపీ సంగతి తేల్చమని అంటున్నది. అంతే కాదు... ఎంతసేపూ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల గురించే ఎందుకు మాట్లాడతారు.. సబార్డినేట్‌ కోర్టుల నియామకాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, కేసులు పెండింగ్‌ పడుతున్నాయని ఆందోళనపడుతున్నవారు ఆ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. ఇదే ప్రశ్న గతంలోనూ వినిపించింది. కానీ న్యాయవ్యవస్థ నుంచి జవాబు లేదు. పైగా నియామకాల విషయంలో తమను నిందించడం సరికాదని ప్రభుత్వం అంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 120 ఖాళీలను భర్తీ చేయడమే తమ చిత్తశుద్ధికి తార్కాణమంటోంది.


ఎవరి అధికారాలను ఎవరు కబ్జా చేస్తున్నారన్న అంశం సామాన్యులకు పెద్దగా పట్టదు. వారికి కావలసిందల్లా సత్వర న్యాయం. ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరిగే స్థితి పోవాలని వారు కోరుకుంటున్నారు. డబ్బూ, సమయమూ వృథా అవుతున్నదని ఆందోళనపడుతున్నారు. న్యాయస్థానాల్లో, న్యాయవాదుల కార్యాల యాల్లో ఫైళ్లే కనిపిస్తాయిగానీ వాటి వెనక లక్షలాది పౌరుల జీవన్మరణ సమస్యలుం టాయి. వారి కష్టాలు, కన్నీళ్లు, ఆవేదన, ఆరాటం ఉంటాయి.

వాటిని గమనంలోకి తీసుకున్నప్పుడే సమస్య తీవ్రత అర్ధమవుతుంది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ సదస్సులో జరిగిన సంవాదాన్నిబట్టి కేంద్రం వైఖరి మారదని తేలింది. ఇప్పటికైనా ప్రతిష్టకు పోకుండా, ఎవరిది పైచేయన్న ధోరణికి పోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారాన్ని వెదకడంపై ఇరుపక్షాలూ దృష్టిపెట్టాలి. ఎవరికి ఏ లక్ష్మణరేఖ ఉన్నా, అధికారం ఉన్నా అవి రాజ్యాంగం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి సంక్రమించి నవే. వారి సంక్షేమం, ప్రయోజనాలు మాత్రమే దేనికైనా గీటురాయి కావాలి తప్ప ఆధిపత్య పోరుగా, అహంభావ సమస్యగా మారకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement