పదిలోనూ ఇంటర్నల్స్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లోనూ ఇంటర్నల్స్ అమల్లోకి రానున్నాయి. ఏడాది పాటు విద్యార్థులు చేసిన అసైన్మెంట్స్, ప్రాజెక్టులు, ప్రయోగాలకు 20 శాతం మార్కులు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టులో రాత పరీక్షకు 80 శాతం మార్కులనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం ద్వితీయ భాష మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్ష పేపర్లు ఉన్నాయి. వాటిని కూడా రెండు కాకుండా ఒకటిగానే చేసి ఆరు పేపర్లు అమల్లోకి తేవటంపై చర్చ జరుగుతోంది. నాలుగు సహ-పాఠ్య కార్యక్రమాలకు 50 మార్కుల చొప్పున 200 మార్కులను కేటాయించనున్నారు. ఈ మేరకు టెన్త్ మెమోల స్వరూపంలోనూ మార్పులు తేనున్నారు. దీనికి అనుగుణంగా పదో తరగతి పాఠ్య పుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మార్చుతోంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. వచ్చే విద్యా సంవత్సరం (2014-15) నుంచి కొత్త పాఠ్య పుస్తకాలతోపాటు కొత్త పరీక్షల విధానాన్ని అమల్లోకి తేనుంది.
ప్రధానంగా రానున్న మార్పులు...
పరీక్షల్లో పాఠం చివరలో ఉండే అభ్యాసం ప్రశ్నలివ్వరు. ఒకే సమాధానం ఉండే ప్రశ్నలు కాకుండా రెండు మూడు రకాల జవాబు ఉండే ప్రశ్నలనే అడుగుతారు.
ప్రశ్నను పాజిటివ్ కోణంలో చూసినా, నెగిటివ్ కోణంలో చూసినా.. విద్యార్థి రాసే జవాబుకు ఆధారాలు చెబుతూ తన వాదనను బలపరచుకోవాలి. గైడ్స్, టె స్టు పేపర్లు, క్వశ్చన్ బ్యాంకుల్లో ఇస్తున్నట్లు ప్రశ్న జవాబుల విధానం ఉండదు.
ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్ష. ప్రాజెక్టులు, ప్రయోగాలు, అసైన్మెంట్లకు 20 మార్కులు ఇస్తారు.ప్రస్తుతం ఉన్న ఆరు సబ్జెక్టులతోపాటు విలువల విద్య-జీవన నైపుణ్యాలకు (50 మార్కులు), కళలు-సాంస్కృతిక విద్యకు (50 మార్కులు), శారీరక వ్యాయామ విద్య (50 మార్కులు), పని విద్య-కంప్యూటర్ ఎడ్యుకేషన్ (50 మార్కులు) పేప ర్లు ఉంటాయి. వీటిని వార్షిక పరీక్షల్లో కాకుండా స్కూల్లోనే పరిశీలించి మార్కులు ఇస్తారు. వాటిని పరీక్షల విభాగానికి పంపితే విద్యార్థుల మెమోల్లో చేర్చుతారు.