ఈ అమ్మాయికి పేరు పెట్టలేం...
రోజా పువ్వుని ఏ పేరుతో పిలిస్తేనేమి?
పరిమళం గొప్పగానే ఉంటుంది కదా!
దేవుడిని ఏ పేరుతో పిలుచుకుంటేనేమి?
దీవెనలు అద్భుతంగానే ఉంటాయి కదా!
అందుకేనేమో తెలుగులో ఈ నుడికారం వచ్చింది ‘పేరు పెట్టలేం’ అని!
ప్రతిభే సహజలక్షణమైన వాళ్లకు ఏం వంకలు పెట్టగలమని?
సాహితీ పింగళి పేరెంట్స్ ఆ పేరును ప్రేమతో పెట్టుకున్నారు ప్రతిభను చూసి కాదు..
ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతిభను చూసి ఓ గ్రహానికే ఈమె పేరు పెట్టారు!
అందుకే ఈ అమ్మాయికి ఏవిధంగానూ మనం పేరు పెట్టలేం..
ఆకాశంవైపు చూసి చప్పట్లు కొట్టగలం!
బెంగళూరు.. ఖాళీ సమయాల్లో తమ అపార్ట్మెంట్లోని తన గది కిటికీలోంచి బయట కనిపిస్తున్న దృశ్యాలను చూడ్డం పధ్నాలుగేళ్ల సాహితికి చాలా ఇష్టం. ఆలా రోజూ చూస్తూంటే ఓ విశాలమై ప్రదేశం కనిపించింది ఒకరోజు. అదేంటో అర్థంకాలేదు కాని ప్రతిరోజూ గమనించడం మొదలుపెట్టింది. అక్కడే జరుగుతున్న భవన నిర్మాణ కార్మికులు సాయంకాలం వెళుతూ వెళుతూ.. ఆ ప్రదేశంలో ఏదో పారేయడం.. టిఫిన్ బాక్స్‌ల్లో మిగిలినవి, వాటర్ బాటిల్స్‌లోని నీళ్లను అందులో పారబోయడం.. ఆమె కంట పడింది. డంప్‌యార్డ్ కోబోలు అనుకుంది. ఎందుకనో.. దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆ అమ్మాయికి. ఒక ఆదివారం.. చూసొద్దామని బయలుదేరింది. తీరా దగ్గరకు వెళ్లాక తెలిసింది అది డంప్‌యార్డ్ కాదు.. చెరువు. కైకొండ్రహళ్లి చెరువు. అప్పటి నుంచి నీటి కాలుష్యం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని చెరువులు, సరస్సుల కాలుష్యం మీద అధ్యయనం చేయాలనే ఆసక్తి పెరిగింది సాహితీ పింగళికి. కార్యరూపం ఇచ్చింది. యేడాది పాటు పరిశీలించి పరిశోధించింది. చెరువుల్లోని నీటి కాలుష్యాన్ని కనుగొనే యాప్‌కు రూపమిచ్చింది. కేవలం పదహారేళ్ల వయసులో ఆమె సాధించిన ఈ విజయాన్ని ఎమ్ఐటి (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లోని లింకన్ ల్యాబరేటరీ, ఐఏయూ (ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్) అబ్బురపడ్డాయి. పాలపుంతలోని పేరులేకుండా ఉన్న ఎన్నో చిన్నగ్రహాల్లో ఒకదానికి ఆమెపేరును ఖాయం చేసి సాహితికి అపూర్వ సత్కారాన్నిచ్చాయి. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు.. ఆకాశం కూడా హద్దు కాదఅని నిరూపించింది. ఈ ఘనతే బయోగ్రఫీకి ఎంచుకునేలా చేసింది.
కుటుంబం.. సాహితి తండ్రి గోపాల్ పింగళి.. సైంటిస్ట్, ఐబీఎమ్ వైస్ ప్రెసిడెంట్. అరుణ.. భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు. కొన్నాళ్లు అమెరికాలో ఉన్నారు. సాహితీ అక్కడే పెరిగింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు లలిత, శ్రీకరి. సాహితి మొదటి నుంచీ చురుకైన పిల్లే. అయిదు, ఆరు తరగతుల్లోనే రచయిత కావాలనుకుంది. తర్వాత సైన్స్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఇష్టం పెంచుకుంది. ‘ఇక్కడి కన్నా అమెరికాలో పర్యావరణ స్పృæ ఎక్కువ. అక్కడే పెరగడం వల్లేమో మరి నాకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువైంది’ అని చెప్తుంది. ప్రస్తుతం మిషిగన్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్‌షిప్ చేస్తోంది.
నింగిలో నిలబెట్టింది
‘మా కుటుంబంలోని వాళ్లెవరైనా ఎప్పుడైనా ఇలా అంతర్జాతీయ సదస్సుకు మన దేశం తరపున ప్రాతినథ్యం వహిస్తారని ఎన్నడూ ఊహించలేదు. సాహితి వల్ల ఊహించనిది నిజమైంది. ఈ సంతోషాన్ని పంచుకోవడానిక మాటలు రావడంలేదు. ఇప్పుడు నా కూతురు ఇండియా తరపున ఈ విజయం సాధించింది. తండ్రినైన నాకూ స్ఫూర్తినిచ్చింది నా బిడ్డ. మా కుటుంబం పేరును నింగిలో నిలబెట్టింది’ అంటూ పుత్రికోత్సాహం పొందుతున్నాడు సాహితి తండ్రి గోపాల్. క్లాస్ పుస్తకాలు పక్కన పడేసి.. ఈ పరిశోధనలో నిమగ్నమైతే.. మా పిల్లకు పిచ్చిపట్టిందనుకున్నాం నేను, నా భార్య’అంటూ సాహితి పరిశోధనా రోజులను గుర్తు చేసుకున్నారాయన. సాహితి ఒక్కతే కాదు ఈ తరం పిల్లలంతా పర్యావరణ స్పృహతోనే ఉన్నారు’ అని ఆయన ఇప్పటి పిల్లలకు కితాబునిచ్చారు.
కలర్‌కోడింగ్
సాహితి తయారు చేసిన యాప్ ప్రకారం... చెరువులోని నీరు బ్లూకలర్‌లో మార్క్ అయితే.. అవి తాగడానికి యోగ్యమైనవన్నమాట. ఉదా రంగులో మార్క్ అయితే స్నానానికి మాత్రమే పనికివస్తాయని అర్థం. పసుపు రంగులో మార్క్ అయితే చేపలు వంటి వాటికి మంచివని సూచన.
ఇమాజిన్.. హౌ ద వరల్డ్ వుడ్ బీ విదవుట్ ఎనీ టెక్నాలజీ.. పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారమే వెళ్తుంది సాహితి. రోజువారీకార్యక్రమాలైనా.. అధ్యయనాలైనా! ఏ పనినైనా వారానికి ప్లాన్ చేసుకుంటుంది. మిన్ను విరిగి మీద పడ్డా ఆ ప్రణాళిక తప్పదు. ఉదయం నాలుగింటికే నిద్ర లేస్తుంది. రాత్రి తొమ్మిదింటికల్లా పడుకుంటుంది. పరీక్షలున్నా సరే. ఎనిమిదో తరగతిలోనే కాలేజ్ లెవల్ పుస్తకాలు చదివేది. ఇంటర్నేషనల్ సీనియర్ లెవెల్ పరీక్షలు రాసింది. తనకు నచ్చింది చదవడంలోనే స్వేచ్ఛను ఆస్వాదిస్తానంటుంది. పదేళ్ల వయసులో ‘ఇమాజిన్.. హౌ ద వరల్డ్ వుడ్ బీ విదవుట్ ఎనీ టెక్నాలజీ.. ఇమాజిన్.. దట్ దేర్ వర్ నో స్క్ర్యూ ఇఫ్ యు హాడ్ టు హోల్డ్ థింగ్స్ టుగెదర్.. దేర్ వుడ్ బీ నథింగ్ టు డూ యువర్ డెస్క్ వుడ్ బ్రేక్ అండ్ డోర్స్ వుడ్ ఫాల్ ఫ్లాట్.. ఇమాజిన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బికాజ్ ఆఫ్ దట్’అని కవిత రాసి బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.
ఇప్పటి వరకు వీళ్లు...
భారతీయుల్లో... సీవీ రామన్.. భౌతికశాస్త్రంలో నోబెల్గ్రహీత, గ్రహం పేరు.. 55753 రామన్.., టెంజింగ్ నార్గే.. ఎవరెస్ట్ అధిరోహి, గ్రహం పేరు.. 6481, రబీంద్రనాథ్ టాగూర్.. కవి.. గ్రహం పేరు.. 7855 టాగూర్, అనౌష్క శంకర్, సితార్ విద్వాంసురాలు, గ్రహం పేరు.. 292872, విశ్వనాథన్ ఆనంద్, చెస్ క్రీడాకారుడు.. గ్రహం పేరు.. 4538 విశ్యానంద్, మాధవ్ పాఠక్.. బ్రెయిలీస్లేట్ను ఆ«ధునీకరించినందుకు.. గ్రహం పేరు.. 12509 పాఠక్, విష్ణు జయప్రకాష్, మైక్రోబయెల్ ఫ్యూయెల్ సెల్‌ను కనుగొన్నందుకు, గ్రహం పేరు.. 25620 జయప్రకాష్, మరికొందరు కూడా ఉన్నారు.
బహుముఖ ప్రజ్ఞ...
సాహితీ పింగళి... చదువులో ఫస్ట్. ఆటల్లో మేటి. సంగీతం అంటే ప్రాణం. పియానో, వీణ వాయిస్తుంది. భరతనాట్య కళాకారిణి కూడా. ‘డాన్స్చేసేటప్పుడు అందులో నిమగ్నమైపోతుంది’ అని చెప్తుంది సాహితి తల్లి అరుణ. హ్యారీపాటర్ అంటే పిచ్చి ఇష్టం. హారీపాటర్లో ఉన్నట్టు నిజంగా కూడా మ్యాజికల్ బీస్స్›్ట ఉంటే ఎంత బాగుండు. అవి మన చెరువులన్నీ శుభ్రం చేసేవి’ అని కళ్లు ఇంతింత చేసుకొని చెప్తుంది ఈ కుర్ర శాస్త్రవేత్త.
ప్లాస్టిక్ మగ్గు.. మొబైల్ యాప్
‘అవర్ లేక్స్.. అవర్ వాయిస్’లో తమ చుట్టూ ఉన్న చెరువులను పరిశీలించేందుకు సాహితికి ఒక టీమ్ ఉండేది. ప్రతి శని, ఆదివారాలు తన జట్టు సభ్యులతో కలిసి వర్తూర్ చెరువుకు వెళ్లేది. బ్లూ, గ్రీన్ రంగు ప్లాస్టిక్ మగ్గు, జనపనారుతో అల్లిన తాడు తీసుకొని చెరువుకు వెళ్లేది. జాగ్రత్తగా మోకాళ్ల లోతు వరకు చెరువులోకి దిగేది. జనపనారు తాడుతో కట్టిన మగ్గుతో నీటిని చేదేది. ఇదంతా గమనిస్తున్న వాళ్లకు అదో పిల్ల చేష్టగా.. ఆటగా అనిపించేది. సాహితి నీటి మగ్గుతో ఇంటికి వెళ్లి మగ్గులోని నీటిని ఓ బాటిల్లో నింపేది. తాను చెరువుల నుంచి తెస్తున్న నీటిలోని కాలుష్యాన్ని పరీక్షించడానికి కావాల్సిన పరికరాల సేకరణ, ఆ ప్రాసెస్ వ్యయప్రయాసలతో కూడుకున్నదని అర్థమైంది. అప్పుడామె దృష్టి.. కాలుష్యాన్ని కనిపెట్టే పరికరాల పరిశోధన మీదకు మళ్లింది.
అతి తక్కువ ఖర్చుతో సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉండే పరికరం కావాలి. అది ఎప్పుడూ వెంట తీసుకెళ్లేట్టుగా బ్యాగ్‌లో, పర్సులో.. అరచేతిలో ఇమిడేట్టు ఉండాలి... ఎలా? ఆలోచించింది.. శోధించింది. మారిన టెక్నాలజీ ఊతంతో యేడాది శ్రమించింది. ఓ మోబైల్ యాప్‌ను తయారు చేసింది. మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ఎక్కడ ఏ చెరువును చూసినా.. అందులో కాలుష్యం ఎంతుందో ఇట్టే కనిపెట్టేయొచ్చు. నివారణకు మార్గం చూడొచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ సెన్సార్స్, కెమికల్ టెస్ట్ స్ట్రిప్స్‌తో ఈ యాప్ పనిచేస్తుంది. అంతేకాదు ఇలా కాలుష్యాన్ని పరీక్షించిన డాటా మొత్తం ఆన్లైన్ డాటా బ్యాంక్‌లో స్టోర్ అవుతుంది.
పాలపుంతలోపేరు
సాహితి రూపొందించిన యాప్ స్కూల్ యాజమాన్యానికి బాగా నచ్చింది. ఈ యేడు గత నెలలో (జూన్) అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘ది ఇంటర్నేషనల్ సస్టెయినబుల్ వరల్డ్ ఇంజనీరింగ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఒలింపియాడ్’కు పంపేందుకు సాహితి పేరును, ఆమె యాప్ వివరాలనూ పంపారు. ఎంపికైంది. అంతేకాదు ఆ సైన్స్ సదస్సుకు దేశం నుంచి ఎంపికైన యువ శాస్త్రవేత్తలందరికీ పదహారేళ్ల ఆ అమ్మాయే నేతృత్వం వహించింది. సదస్సు ప్రారంభమైంది. మొత్తం 62 దేశాల నుంచి యువప్రతినిధులు హాజరయ్యారు వాళ్ల ప్రాజెక్ట్స్‌తో. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన అధ్యయన పత్రాలు, పరికరాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అవన్నీ చూస్తుంటే మన యువకిశోరాలకు లోపల కొంచెం బెరుకు, భయంగానే ఉంది. కాని సాహితిలో మాత్రం చెదరని చిరునవ్వు. పోతపోసిన ఆత్మవిశ్వాసం. వచ్చిన నిపుణులకు తన యాప్ గురించి వివరించింది .. ప్రెజెంటేషన్ ఇచ్చింది తొణక్కుంగా.. బెణక్కుండా! కొన్ని క్షణాలు.. ఎక్స్పర్ట్స్ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు.
అంతే వేల కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. ఆ పోటీలో ఇన్నోవేటివ్ రీసెర్చ్ విభాగంలో సాహితికి బంగారు పతకం బహుకరిస్తున్నట్టు వెల్లడించారు. కరతాళ ధ్వనులు మిన్నంటాయి. సాహితిలో.. అదే చిరునవ్వు.. అంతే ఆత్మవిశ్వాసం! తలవంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలిపింది. అక్కడి నుంచి సాహితి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని లింకన్ ల్యాబరేటరీ కొలాబరేషన్‌తో జరిగిన ఇన్టెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ఇంటెల్ ఐఎస్ఈఎఫ్)లో పాల్గొంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మాకమైన ప్రీకాలేజ్ సైన్స్ కాంపీటీషన్. ఇందులో ఆమె ప్రాజెక్ట్‌ను చూసిన మహుమహులంతా .. ముక్కుపచ్చలారని ఈ పిల్లేంటి? ఈ అచీవ్మెంట్ ఏంటి అని ఆనందశ్చర్యాలకు లోనయ్యారు. ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీ, సౌదీ అరేబియా కింగ్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్నెస్ అండ్ క్రియేటివిటీ, యూఎస్ ఎజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వాళ్ల ప్రత్యేకమైన అవార్డులూ పొందింది. ఆ తర్వాత కొద్ది సమయంలోనే మరో వార్త.. ఐఏయూ, ఎమ్ఐటీ నుంచి.. పాలపుంతలోని ఒక గ్రహానికి ఆమె పేరును ఖరారు చేస్తున్నట్టు. అప్పుడు సాహితి ఆడియెన్స్ గ్యాలరీలో తన చెల్లెళ్లిద్దరి మధ్య కూర్చొని ఉంది. ఆ మాట విన్నవింటనే ప్రపంచంలో చావడానికి సిద్ధంగా ఉన్న చెరువలన్నీ ఒక్కసారిగా ఉత్తేజితమయ్యాయి. ఆక్సిజన్ లెవెల్స్ సమస్థాయికి వచ్చినట్టు తరంగాలు .. తెరలుతెరలుగా.. కదిలాయి! గాలితో సయ్యాటలాడుతూ సందడి చేశాయి. నిజానికి అంత పెద్ద సత్కారం.. ఆ చిన్నపాపను ఆకాశానికి ఎత్తేయాలి. కాని సాహితి.. ఎప్పటిలాగే చిరునవ్వు.
అదే సమయంలో...
సాహితి చదివిన ఇన్వెంచర్ అకాడమీలో ఆ రాత్రి (భారతకాలమానం ప్రకారం) యాన్యువల్ స్లీప్ ఓవర్‌కోసం గ్యాదర్ అయిన 700 మంది విద్యార్థులు హ్యూస్టన్‌లో తమ స్కూల్‌మేట్ పొందిన సన్మానం చూసి రోమాంఛితులయ్యారు. ఆ పిల్లల హర్షధ్వానాలతో అకాడమీ పులకించిపోయింది. ‘ఇక నుంచి టెలిస్కోప్‌లో సాహితిని చూస్తాం..’ అన్నారు అకాడమీలోని సాహితీ మిత్రులు!
చదువు.. చెరువు
సాహితి కుటుంబం న్యూయార్క్ నుంచి బెంగళూరుకు మారాక.. బెంగుళూరులోని ఇన్వెంచర్ అకాడమీ స్కూల్లో చేరింది. దేశంలోని బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఇది ఒకటి. పాఠాలతోపాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యత కూడా పాఠ్యాంశాల్లో భాగమే. పిల్లల్లో సామాజిక స్ప్రహ పెంచే కార్యక్రమమైన ‘చేంజ్ మేకింగ్ ఇనిషియేటివ్’ లో పాలుపంచుకునేది సాహితి. కైకొండ్రహళ్లి చెరువును పరిశీలించడం.. ముందు అదొక మురికికాలువలా ఉండి.. తర్వాత మంచి నీటి చెరువుగా మారడం.. ఇవన్నీ ఆమె ‘చేంజ్ మేకింగ్ ఇనిషియేటివ్’లో భాగమైన ‘అవర్ లేక్స్ అవర్ వాయిస్’లో చేరింది. బెంగళూరులోని అత్యంత కాలుష్యమైన వర్తూర్, బెళందూర్ చెరువులను ఎన్నుకుంది. ముందుగా వర్తూర్ చెరువు మీద దృష్టి కేంద్రీకరించింది.
– శరాది