2100 నాటికి మంచులేని ఎవరెస్ట్!
హిమాలయ హిమానీనదాలు పూర్తిగా కనుమరుగు
కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోని గ్లేసియర్లు(హిమానీనదాలు) ఈ శతాబ్ది చివరిలోగా కనుమరుగయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం వల్లే ఈ ముప్పు తలెత్తుతోందన్నారు. ఈ వాయువులను నియంత్రించకుంటే ఎవరెస్ట్ సానువుల్లోని మంచు 70 శాతం మేర కరిగిపోతుందని లేదా మొత్తమే కనుమరుగవుతుందని నేపాల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ పరిశోధకుల బృందం అంచనా వేసింది. గ్లోబల్‌వార్మింగ్ ప్రభావంతో 21వ శతాబ్ది ముగిసేలోగా మంచు పొరలు పూర్తిగా నాశనమవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను బట్టి మంచు తగ్గిపోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కఠ్మాండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్(ఐసీఐఎంవోడీ) అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జోసెఫ్ షియా పేర్కొన్నారు.
2100 సంవత్సరం నాటికి ఎవరెస్ట్ వద్ద ఉన్న గ్లేసియర్లు 70 నుంచి 99 శాతం కరిగిపోతాయని తెలిపారు. ప్రధానంగా దూద్కోసి బేసిన్‌లోని అతిపెద్ద గ్లేసియర్ క్రమంగా కరుగుతోందని, ఉష్ణోగ్రతలు పెరిగితే ఇది మరింత తీవ్రమవుతుందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల దిగువన కోసీ నదిలో నీరు పెరిగి నదుల ప్రవాహంపైనా ప్రభావం పడే అవకాశముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మంచు భారీగా కరిగిన తర్వాత తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, దీంతో వ్యవసాయం, జల విద్యుదుత్పత్తి ప్రభావితమవుతాయని విశ్లేషించారు. గ్లేసియర్లకు సంబంధించిన గత 50 ఏళ్ల సమాచారం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల తదితరాలను విశ్లేషిస్తూ ఈ అధ్యయనం సాగింది.