ప్రఖ్యాత యూనివర్సిటీలో వికృత నిబంధన!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ ఓ వికృతమైన నిర్ణయాన్ని తీసుకుంది. వర్సిటీలోని అమ్మాయిల హాస్టల్లో పడకను పంచుకోవడాన్ని నిషేధించింది. మీడియా కథనాల ప్రకారం 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ (ఐఐయూ) తాజాగా ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఏ అమ్మాయైనా తన స్నేహితులతోగానీ, అక్కాచెల్లెళ్లతోగానీ బెడ్ షేర్ చేసుకుంటే (ఒకే దుప్పటి కప్పుకొని పడుకున్నా, కూర్చున్నా) భారీగా జరిమానా తప్పదని హెచ్చరించింది.
అంతేకాకుండా పడకల మధ్య సహేతుకమైన, సరైన దూరాన్ని పాటించాలని సూచనలు చేసింది. ప్రత్యేకంగా అమ్మాయిల హాస్టళ్లలోనే ఈ విధంగా నిబంధనలు అమలుచేయడంపై సోషల్ మీడియాతో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అబ్బాయిల హాస్టళ్లలో పెద్దసంఖ్యలో నాన్ బోర్డర్లు మకాం వేసినా పట్టించుకోకుండా అమ్మాయిల హాస్టళ్లలోనే ఈవిధంగా ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, హాస్టళ్లలో స్థలం సమస్య ఉందని, అంతేకాకుండా అమ్మాయిల తమ వెంట బంధువులు, కుటుంబసభ్యులను ఉంచుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్లే ఈ నోటిఫికేషన్ జారీచేశామని యూనివర్సిటీ సమర్థించుకుంటోంది.