International Museum Day
-
ప్రతి ఒక్కరూ మ్యూజియంలను సందర్శించాలి: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: దేశ గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించే మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాగరికత విలువలతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలు, కళాఖండాలను ప్రదర్శించడంతోపాటు వర్తమాన పరిస్థితులను, సాంకేతిక విప్లవంతో భవిష్యత్తును దర్శించేందుకు ఈ మ్యూజియంలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో రెండోరోజు సందర్భంగా.. వివిధ రాష్ట్రాల్లో మ్యూజియంల పునరుద్ధరణ, 2047 కోసం రాష్ట్రాలు నిర్దేశించుకున్న అజెండా తదితర అంశాలకు సంబంధించిన ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మ్యూజియంలను ప్రతి ఒక్కరూ సందర్శించేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత మ్యూజియంల సందర్శన ద్వారా స్ఫూర్తిని పొందేందుకు వీలువుతుందని, ఈ దిశగా.. విద్యాశాఖతో కలిసి ముందుకెళ్లాలని ఆయన సూచించారు ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పోలో ఫిజిటల్ ఎగ్జిబిషన్స్ (ఫిజికల్, డిజిటల్ ఎగ్జిబిషన్ల మధ్య సమన్వయం), టెక్నోమేలా, ఇన్-సిట్యు కన్జర్వేషన్ ల్యాబ్, పాఠశాల విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఎక్స్కవేషన్ పిట్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు, విశ్వవిద్యాలయలతో కలిసి 1200కు పైగా మ్యూజియంలు ఉన్నాయని, గత 9 ఏళ్లలోనే 145 య్యూజియంలను కేంద్రం కొత్తగా ఏర్పాటుచేసిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, ఆదీవాసీ వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గోవా తోపాటు 10 చోట్ల ఆదీవాసీ మ్యూజియంలు ఏర్పాటుచేశామన్నారు. దీంతోపాటుగా ఆధునిక సాంకేతికతను, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు వి;hkద్యార్థులను ప్రోత్సహించేలా సైన్స్ సిటీ, సైన్స్ మ్యూజియం నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మ్యూజియం, విప్లవ్ గ్యాలరీ మ్యూజియం (కోల్‌కతా), ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం, రెడ్ ఫోర్ట్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్ మ్యూజియం మొదలైనవి.. నిర్మాణమైన వినియోగంలోకి వచ్చాయని.. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మ్యూజియంలు నిర్మాణంలో ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలో మ్యూజియంల వ్యవస్థను మరింత బలోపేతం దిశగా.. అన్ని భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వంతో ముందుకెళ్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖితోపాటు వివిధ రాష్ట్రాల సాంస్కృతిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. -
సాలార్ జంగ్ మ్యూజియం అరుదైన ఆఫర్స్ : అందరికీ ప్రవేశం ఉచితం
-
సాలార్ జంగ్ మ్యూజియం అరుదైన ఆఫర్స్ : అందరికీ ప్రవేశం ఉచితం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ మ్యూజియం సాలార్ జంగ్ మ్యూజియం సందర్శకులకు ఒక బంపర్ ఆఫర్. అంతర్జాతీయ మ్యూజియం డే ని పురస్కరించుకుని కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లా పెద్దా అంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ 1977 నుండి ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం డేని నిర్వహిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు ఎంత ముఖ్యమైనవో అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియమ్స్ కౌన్సిల్ (ఐకామ్) ఈ పిలుపు నిచ్చింది. 2022లో ‘పవర్ ఆఫ్ మ్యూజియమ్స్’ అనే థీమ్‌తో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల్లో పాల్గొంటాయి. గత సంవత్సరం, సుమారు 158 దేశాల్లో 37వేలకు పైగా మ్యూజియంలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. 75 వసంతాల ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డా.నాగేందర్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మ్యూజియంను తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాత్రి తొమ్మిదిగంటల వరకు మ్యూజియం సందర్శన అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా సెల్పీ, ఫోటో పాయింట్లను ఈ సందర్భంగా లాంచ్ చేయనున్నామని చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించేలా దివ్యాంగులు, అనాథ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజైన 21వ తేదీన వివిధ విదేశీ కార్యాలయాల ప్రతినిధులు కూడా మ్యూజియాన్ని సందర్శిస్తారని నాగేందర్ చెప్పారు. అలాగే చక్కటి పెయింటింగ్స్‌తో ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సెక్రటరీ రమణారెడ్డి వెల్లడించారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజేతలకు క్యాష్ అవార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. ఆరు రోజుల ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. మ్యూజియం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరు 25 దాకా ఎంట్రీలను పంపవచ్చన్నారు. భాగ్య నగర్ ఫోటో ఆర్ట్ క్లబ్ సౌజన్యంతో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సెక్రటరీ కే జనార్థన్ తెలిపారు. వీటితో పాటు ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు ప్రత్యేకమైన బిద్రి ఆర్ట్‌పై ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రివెంటివ్ కన్జర్వేషన్ మీద ఒక వెబ్‌నార్ నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. కాగా హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడో అతిపెద్దది. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు కెందిన కళాత్మక వస్తువుల భాండాగారం. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన విలువైన వస్తువులు, అరుదైన కలాఖండాలు ఇక్కడ కొలువు దీరాయి. ముఖ్యంగా ఈ మ్యూజియంలో గంటల గడియారం ఒక పెద్ద ఆకర్షణ. ఇంకా మేలిముసుగు రెబెక్కా, స్త్రీ-పురుష శిల్పం, ప్రధానంగా చెప్పు కోవచ్చు. ఇంకా అలనాటి అపురూప కళాఖండాలు, ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు, చెస్ బోర్డులు ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాలార్ జంగ్ మ్యూజియంలోని విశేషాలను కనులారా వీక్షించండి. -
జ్ఞానదీపాల వెలుగులో...
మే 18 ఇంటర్నేషనల్ మ్యూజియం డే మౌనముద్రదాల్చినట్లుగా కనిపిస్తాయి మ్యూజియాలు. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వ్యాఖ్యానించే మాటలు. కొన్ని మాటలు మాటలుగా మాత్రమే ఉండవు. అవి వెలుగుదీపాలై దారి చూపుతాయి. మ్యూజియంలోకి అడుగుపెట్టడం అంటే గంభీరమైన పాతభవనంలోకి అడుగుపెట్టడం కాదు. ఒక కొత్త దారిని వెదుకుతూ వెళ్లడం. జర్మనీలో ఎన్నో ప్రసిద్ధ మ్యూజియాలు ఉన్నాయి. ‘కవులు, ఆలోచనావాదుల భూమి’గా పిలవబడే జర్మనీ కళా, సాంస్కృతిక మేధా వికాసం ఆ దేశంలో కొలువుతీరిన మ్యూజియాల్లో వెయ్యివెలుగులై కనిపిస్తుంటుంది. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ సందర్భంగా కొన్ని మ్యూజియాల గురించి సంక్షిప్తంగా... స్పేస్ ట్రావెల్ మ్యూజియం: స్పేస్ టెక్నాలజీకి అద్దంపట్టే ఈ మ్యూజియం ప్రాన్కోనియన్ నగరంలో ఉంది. భవిష్యత్ దార్శనికుడు, రాకెట్ సాంకేతిక జ్ఞాన మార్గదర్శిగా పేరున్న హెర్మన్ ఒబెర్త్ జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులతో పాటు క్యుములస్ రాకెట్, సిర్రస్ రాకెట్లాంటి రకరకాల రాకెట్లు ఇక్కడున్నాయి. మ్యూజియం ముందు కనిపించే స్విస్ జెనిట్ సౌండింగ్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణ. బవేరియన్ నేషనల్ మ్యూజియం: మ్యూనిచ్‌లో ఉన్న ఈ మ్యూజియం జర్మనీలోని అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. డెకొరేటివ్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఈ మ్యూజియాన్ని 1885లో నిర్మించారు. ఆర్ట్ హిస్టారికల్, ఫోక్లోర్ కలెక్షన్ అనే రెండు విభాగాలుగా ఉన్న ఈ మ్యూజియంలో ఎన్నో అపురూపమైన వస్తువులు ఉన్నాయి. మ్యూజియం ఫైవ్ కాంటినెంట్స్: మ్యూనిచ్‌లో ఉన్న ఈ మ్యూజియంలో నాన్-యురోపియన్ ఆర్ట్‌వర్క్స్ ఉన్నాయి. 1859లో నిర్మించిన ఈ మ్యూజియం జర్మనీలో రెండవ అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. రెండు లక్షలకు పైగా కళాకృతులు ‘మ్యూజియం ఫైవ్ కాంటినెంట్స్’లో ఉన్నాయి. జర్మన్ స్టీమ్ లొకోమోటివ్ మ్యూజియం: ఫ్రాంకోనియాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 1977లో నిర్మించారు. ఈ మ్యూజియం ఉండే స్థలంలో 1895లో నిర్మించిన లొకమోటివ్ షెడ్ ఉండేది. దాదాపు 30 స్టీమ్ లొకోమోటివ్లు ఈ మ్యూజియంలో ఉన్నాయి. టాయ్ మ్యూజియం: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ టాయ్ మ్యూజియం నురెంబెర్గ్లో ఉంది. 1971లో నిర్మితమైన ఈ మ్యూజియంలో ప్రాచీన చరిత్ర నుంచి ఆధునిక చరిత్ర వరకు కళ్లకు కట్టే బొమ్మలు, కళాకృతులు ఉన్నాయి. మ్యూజియం బ్రాండ్హోస్ట్: 2009లో మ్యూనిచ్‌లో నిర్మించిన ఈ మ్యూజియంలో ఆధునిక కళకు అద్దంపట్టే అపురూప కళాకృతులు ఉన్నాయి. విజువల్ ఆర్ట్ మూమెంట్లో కీలక పాత్ర వహించిన అమెరికన్ ఆర్టిస్ట్ ఆండీ వర్హాల్కు చెందిన వంద చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. అమెరికన్ పెయింటర్, ఫొటోగ్రాఫర్ టుంబ్లీ సృజనాత్మక చిత్రాలు 60 వరకు ఉన్నాయి. మ్యూజియం ఐలాండ్: బెర్లిన్‌లో ఉన్న మ్యూజియం ఐలాండ్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు చేసుకుంది. మ్యూజియం ఐలాండ్‌లో ఐదు మ్యూజియాలు ఉన్నాయి. పెర్గమన్, బోడ్, న్యూయిజ్, అల్టే, ఆల్టేస్...అనే ఈ ఐదు మ్యూజియాలను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రాచీన చిత్ర, శిల్ప కళాసంపదకు ఈ మ్యూజియాలు అద్దం పడతాయి. బ్రైత్-మలి-మ్యూజియం: దక్షిణ జర్మనీలోని బెబైరక్ నగరంలో ఉన్న ఈ మ్యూజియంలో పురాతత్వ, చరిత్ర, కళలకు సంబంధించిన రకరకాల వస్తువుల కళాకృతులు ఉన్నాయి.