జ్ఞానదీపాల వెలుగులో...
మే 18 ఇంటర్నేషనల్ మ్యూజియం డే
మౌనముద్రదాల్చినట్లుగా కనిపిస్తాయి మ్యూజియాలు. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వ్యాఖ్యానించే మాటలు. కొన్ని మాటలు మాటలుగా మాత్రమే ఉండవు. అవి వెలుగుదీపాలై దారి చూపుతాయి. మ్యూజియంలోకి అడుగుపెట్టడం అంటే గంభీరమైన పాతభవనంలోకి అడుగుపెట్టడం కాదు. ఒక కొత్త దారిని వెదుకుతూ వెళ్లడం. జర్మనీలో ఎన్నో ప్రసిద్ధ మ్యూజియాలు ఉన్నాయి.
‘కవులు, ఆలోచనావాదుల భూమి’గా పిలవబడే జర్మనీ కళా, సాంస్కృతిక మేధా వికాసం ఆ దేశంలో కొలువుతీరిన మ్యూజియాల్లో వెయ్యివెలుగులై కనిపిస్తుంటుంది. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ సందర్భంగా కొన్ని మ్యూజియాల గురించి సంక్షిప్తంగా...
స్పేస్ ట్రావెల్ మ్యూజియం: స్పేస్ టెక్నాలజీకి అద్దంపట్టే ఈ మ్యూజియం ప్రాన్‌కోనియన్ నగరంలో ఉంది. భవిష్యత్ దార్శనికుడు, రాకెట్ సాంకేతిక జ్ఞాన మార్గదర్శిగా పేరున్న హెర్మన్ ఒబెర్త్ జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులతో పాటు క్యుములస్ రాకెట్, సిర్రస్ రాకెట్‌లాంటి రకరకాల రాకెట్లు ఇక్కడున్నాయి. మ్యూజియం ముందు కనిపించే స్విస్ జెనిట్ సౌండింగ్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణ.
బవేరియన్ నేషనల్ మ్యూజియం: మ్యూనిచ్‌లో ఉన్న ఈ మ్యూజియం జర్మనీలోని అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. డెకొరేటివ్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఈ మ్యూజియాన్ని 1885లో నిర్మించారు. ఆర్ట్ హిస్టారికల్, ఫోక్‌లోర్ కలెక్షన్ అనే రెండు విభాగాలుగా ఉన్న ఈ మ్యూజియంలో ఎన్నో అపురూపమైన వస్తువులు ఉన్నాయి.
మ్యూజియం ఫైవ్ కాంటినెంట్స్: మ్యూనిచ్‌లో ఉన్న ఈ మ్యూజియంలో నాన్-యురోపియన్ ఆర్ట్‌వర్క్స్ ఉన్నాయి. 1859లో నిర్మించిన ఈ మ్యూజియం జర్మనీలో రెండవ అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. రెండు లక్షలకు పైగా కళాకృతులు ‘మ్యూజియం ఫైవ్ కాంటినెంట్స్’లో ఉన్నాయి.
జర్మన్ స్టీమ్ లొకోమోటివ్ మ్యూజియం: ఫ్రాంకోనియాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 1977లో నిర్మించారు. ఈ మ్యూజియం ఉండే స్థలంలో 1895లో నిర్మించిన లొకమోటివ్ షెడ్ ఉండేది. దాదాపు 30 స్టీమ్ లొకోమోటివ్‌లు ఈ మ్యూజియంలో ఉన్నాయి.
టాయ్ మ్యూజియం: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ టాయ్ మ్యూజియం నురెంబెర్గ్‌లో ఉంది. 1971లో నిర్మితమైన ఈ మ్యూజియంలో ప్రాచీన చరిత్ర నుంచి ఆధునిక చరిత్ర వరకు కళ్లకు కట్టే బొమ్మలు, కళాకృతులు ఉన్నాయి.
మ్యూజియం బ్రాండ్‌హోస్ట్: 2009లో మ్యూనిచ్‌లో నిర్మించిన ఈ మ్యూజియంలో ఆధునిక కళకు అద్దంపట్టే అపురూప కళాకృతులు ఉన్నాయి. విజువల్ ఆర్ట్ మూమెంట్‌లో కీలక పాత్ర వహించిన అమెరికన్ ఆర్టిస్ట్ ఆండీ వర్హాల్‌కు చెందిన వంద చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. అమెరికన్ పెయింటర్, ఫొటోగ్రాఫర్ టుంబ్లీ సృజనాత్మక చిత్రాలు 60 వరకు ఉన్నాయి.
మ్యూజియం ఐలాండ్: బెర్లిన్‌లో ఉన్న మ్యూజియం ఐలాండ్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు చేసుకుంది. మ్యూజియం ఐలాండ్‌లో ఐదు మ్యూజియాలు ఉన్నాయి. పెర్గమన్, బోడ్, న్యూయిజ్, అల్టే, ఆల్టేస్...అనే ఈ ఐదు మ్యూజియాలను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రాచీన చిత్ర, శిల్ప కళాసంపదకు ఈ మ్యూజియాలు అద్దం పడతాయి.
బ్రైత్-మలి-మ్యూజియం: దక్షిణ జర్మనీలోని బెబైరక్ నగరంలో ఉన్న ఈ మ్యూజియంలో పురాతత్వ, చరిత్ర, కళలకు సంబంధించిన రకరకాల వస్తువుల కళాకృతులు ఉన్నాయి.