international smuggler
-
అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ బాషా భాయ్ అరెస్ట్
కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ షేక్ అబ్దుల్ హకీం అలియాస్ బాషా భాయ్ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఖాసీం, ఓఎస్డీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది.. బాషాతోపాటు మరో 11 మందిని సోమవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. వివరాలను ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు. బాషా భాయ్‌తో పాటు కడపకు చెందిన జయరాం నాయక్, వెంకట మహేశ్వరరాజు, గిరీశ్‌కుమార్, తిప్పిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్, తూర్పుగల్లూరు కాలనీకి చెందిన నవీన్‌కుమార్, బీడీ కాలనీకి చెందిన రవికాంత్, పెద్దచెప్పలికి చెందిన పెయ్యల చిరంజీవి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కడపలో పట్టుబడ్డారు. అలాగే రైల్వేకోడూరులో వీరరాఘవ సెట్టియార్, రామన్ అశోక్, మణిమాధవన్లు స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయ్యారు. ఈ 12 మంది నుంచి 1.300 టన్నుల బరువున్న 34 ఎర్రచందనం దుంగలను, లారీ, కారు, మూడు మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బయటికి.. ఈ నెల 2న కడప– కమలాపురం రహదారిపై స్కార్పియో వాహనం.. టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం నరికి అప్పగించడానికి తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది కూలీలతో బాషా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలు ఎర్రచందనం దుంగలతో ఈ నెల 2న స్కార్పియోలో బయలుదేరారు. అయితే వారికి ఇస్తానన్న మొత్తం ఎగ్గొట్టాలని బాషా నిర్ణయించుకున్నాడు. వీరిని అటకాయించి దుంగలు తీసుకురావాలని తన అనుచరులను కారులో పంపాడు. ఆ కారును చూసిన తమిళ కూలీలు పోలీసులు అనుకుని భయపడ్డారు. దీంతో వాహనాన్ని వేగంగా పోనిస్తూ టిప్పర్‌ను ఢీకొట్టి ఐదుగురు మృతి చెందారు. ఎవరీ భాషా? పోలీసులు తమ దర్యాప్తులో బాషా భాయ్‌ని ఘటనకు బాధ్యుడిగా తేల్చారు. ఇతడిపై వివిధ జిల్లాల్లో 26 కేసులు ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాషా భాయ్ కడపలోని బంధువుల వద్దకు వచ్చిపోతూ ఉండేవాడు. అనేక వ్యాపారాలు చేసిన అతడు గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేశాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎంచుకున్నాడు. గతంలో 9 నెలలు కడప, చిత్తూరు జైళ్లలో గడిపాడు. విడుదలయ్యాక కోయంబత్తూరులో బట్టల వ్యాపారం ముసుగులో మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. -
అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్ మస్తాన్ వలీ అరెస్ట్
మైదుకూరు : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన మస్తాన్‌వలి అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్ భాస్కర్‌ను వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మస్తాన్‌వలి, భాస్కర్‌తో పాటు మరికొందరు నల్లమల అడవుల నుంచి మైదుకూరు మండలం వనిపెంట మీదుగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ నాగభూషణం నేతృత్వంలో పోలీసులు దాడి నిర్వహించారన్నారు. ఇందులోభాగంగా మైదుకూరు మండలం అన్నలూరు గ్రామం వద్ద వేగంగా వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులో ఉన్నవారు కారుతో పోలీసులను తొక్కించి తప్పించుకు వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కారును వెంబడించి అందులో ఉన్న మస్తాన్ వలి, భాస్కర్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ వలి ఈ ఏడాది మార్చినెలలో అరెస్టయి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్ జైలులో ఉన్నప్పుడు కూడా జైలు నుంచే ఫోన్ ద్వారా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడేవాడన్నారు. గత నెలలో బెయిల్‌పై విడుదలై తిరిగి యథావిధిగా స్మగ్లింగ్‌కు పాల్పడుతుండటంతో పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేశామన్నారు. పేరు మోసిన స్మగ్లర్లతో సంబంధాలు మస్తాన్‌వలీ మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రధాన స్మగర్లతో సత్సంబంధాలు పెట్టుకుని కర్నూలు, వైఎస్సార్ జిల్లాలోని నల్లమల అడవుల నుంచి దుంగలను దేశ సరిహద్దులు దాటించేవాడని డీఎస్పీ వెల్లడించారు. మస్తాన్ వలీకి దేశంలోని 90మందికి పైగా ప్రధాన స్మగ్లర్లతో అనుబంధం ఉందని..గతంలో పలు కేసులు కూడా వారిపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జైలులో ఉండి కూడా స్మగ్లింగ్ రాకెట్ నడిపే వాడన్నారు. మస్తాన్ వలీతో కలిసి స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రధాన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు.. ప్రధాన స్మగ్లర్ మస్తాన్‌వలీని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అర్బన్, రూరల్ సీఐలతోపాటు ఎస్ఐ చలపతి, పీఎస్ఐ కృష్టమూర్తి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.. మస్తాన్‌వలీతో పాటు, భాస్కర్ అనే స్మగ్లర్‌ను కోర్టులో హాజరు పరిచామన్నారు. జైలు నుంచే కార్యకలాపాలు మస్తాన్‌వలీ ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్‌జైలులో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న జైలు సిబ్బంది సహకారంతో సెల్ఫోన్లు తెప్పించుకొని జైలు నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించేవాడని డీఎస్పీ తెలిపారు. గతంలో చిత్తూరు జైలులో పరిచయమైన భాస్కర్ అలియాస్ ప్రసాద్‌తో కలసి విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసేవాడన్నారు. మస్తాన్ వలీ చాగలమర్రి మండలం ముత్యాలపాడు నుంచి ఎంపీటీసీగా గెలుపొంది ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నాడని, అతని మొదటిభార్య కొండపల్లి స్వప్న ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్నారని తెలిపారు. ఇతను సినీ నటి నీతూ అగర్వాల్‌ను కూడా వివాహం చేసుకున్నాడని వివరించారు. -
సంగీతా చటర్జీకి 31వరకు గడువు
ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ ఈనెల 31వ తేదీలోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచింది. దీంతో.. తదుపరి విచారణకు చిత్తూరు కోర్టు నుంచి మినహాయించాలని సంగీత కోల్‌కతా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ సంగీత చిత్తూరు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని మన పోలీసులు ఇటీవల కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు విచారణకు హాజరుకాకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈనెలాఖరులోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. -
అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించాడు. వీరపునాయునిపల్లె మండలం వేముల-పులివెందుల రహదారిలో ఈ నెల 12న పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి.. రూ.రెండు కోట్ల విలువైన నాలుగు టన్నుల బరువుగల 178 ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, మూడు వ్యాన్లు, రూ. 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ మీడియాకు వివరించారు. ఆయన కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బద్రుల్ హసన్ అలియాస్ హసన్ భాయ్‌కి ఫయాజ్ ప్రధాన అనుచరుడు. ఇతని స్వస్థలం బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట తాలూకా కటిగెనహళ్లి. యుక్త వయసు నుంచే కటిగెనహళ్లికి చెందిన స్మగ్లర్ నజీర్‌కు సహాయకుడిగా ఉన్నాడు. కొంత కాలం తర్వాత అతనితో గొడవపడి ఇతర స్మగ్లర్లు ఫైరోజ్ ఖాన్, తబ్రేస్ ఖాన్‌లతో కలిసి స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. ఇతనికి చైనా, దుబాయ్, సింగపూర్ తదితర ఆసియా దేశాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయల మాటున కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబయికి ఎర్రచందనం దుంగలను తరలించేవాడు. ఇతనికి బెంగళూరులో నాలుగు అపార్ట్మెంట్లు, కటిగెనహళ్లిలో 10 ఇళ్లు, 15 ఎకరాల భూమి ఉంది. రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇటీవల అరెస్ట్ అయిన స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇతని కదలికలపై నిఘా ఉంచి ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. జిల్లా పోలీసులు ఫయాజ్ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. -
వేట ఆగదు
సాక్షి, కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ పేర్కొన్నారు. ప్రత్యేకంగా శేషాచలం అడవుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు వారంలో ఐదు రోజులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఢిల్లీ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం శోధిస్తున్నాయని చెప్పారు. స్మగర్లైనా, కూలీలైనా ఎర్రచందనం జోలికి వస్తే వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. శనివారం కడపలోని పోలీసు పరేడ్ మైదానంలో ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, రాజంపేట డీఎస్పీ అరవిందబాబుల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రత్యేక బృందం స్మగర్ల కోసం వెతుకుతోందని, కర్ణాటకలో కూడా ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా స్మగ్లర్లను పట్టుకునేందుకు పథక రచన చేస్తున్నామని ఆయన తెలిపారు. చైనా నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు కొంత మంది స్మగ్లర్లకు సహకారం అందిస్తున్నారన్నారు. వారి సంబంధాలపై కూడా కూపీ లాగుతున్నామని చెప్పారు. ఇటీవల దొరికిన జంగాల శివశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామని చెప్పారు. బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగిపై కూడా అనుమానం ఉందని, త్వరలోనే నిగ్గు తేలుస్తామన్నారు. అడవి లోపల, బయట అన్నిచోట్ల ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. బడా స్మగ్లర్లతో రమణకు సంబంధాలు ఒంటిమిట్టకు చెందిన బొడ్డె వెంకట రమణ సోదరుడైన పెద్ద వెంకట రమణ ముఠాలో ప్రధాన నిందితుడని, కర్ణాటకలోని కటిగానహళ్లికి చెందిన మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్, రియాజ్, తిరుపతికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ ప్రవీణ్‌లకు ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలియజేశారు. వీరితోపాటు ఢిల్లీకి చెందిన కొంతమంది బడా స్మగ్లర్లతో పెద్ద వెంకట రమణకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వెంకట రమణపై నాలుగు కేసులు ఉన్నట్లు తెలిపారు. గతనెలలో అరెస్టు అయిన బొడ్డె వెంకట రమణను విచారించగా, ఇతని గురించి తెలిసిందన్నారు. పెద్ద వెంకట రమణకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఒంటిమిట్టకు చెందిన పెద్ద వెంకట రమణతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన తమ్మినేని బాబులను అరెస్టు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాఠీ తెలిపారు. తిరుపతి నుంచి శేషాచలం ఫారెస్టులోకి వెళ్లిన వీరు ఓబులవారిపల్లె మండలంలోని అటవీ ప్రాంతం నుంచి ఐచర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగుళూరు వైపు తరలిస్తుండగా శివాజీనగర్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు ఐచర్ వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు రైల్వేకోడూరు పోలీ సులు పకడ్బందీగా పట్టుకున్నారన్నారు. వీరిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృంద సభ్యులు ఎస్బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, రైల్వేకోడూరు సీఐ కె.పుల్లయ్య, ఎస్ఐలు రోషన్, శివశంకర్, పెద్ద ఓబన్న, నాగరాజు, రాజరాజేశ్వర్‌రెడ్డి, నాగరాజులకు రివార్డులను ప్రకటించారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదాని అరెస్ట్
కడప: ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం హరియాణలో అరెస్ట్ చేశారు. ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి బృందం శుక్రవారం హరియాణ రాష్ట్రంలోని హిస్తార్ జిల్లాలో మంగళి ప్రాంతంలో ముఖేశ్ బదానిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బదానిని అక్కడి కోర్టులో హాజరు పరిచిన అనంతరం విచారణకు జిల్లాకు తీసుకురానున్నారు.