వేట ఆగదు
సాక్షి, కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ పేర్కొన్నారు. ప్రత్యేకంగా శేషాచలం అడవుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు వారంలో ఐదు రోజులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఢిల్లీ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం శోధిస్తున్నాయని చెప్పారు. స్మగర్లైనా, కూలీలైనా ఎర్రచందనం జోలికి వస్తే వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. శనివారం కడపలోని పోలీసు పరేడ్ మైదానంలో ఓఎస్‌డీ రాహుల్‌దేవ్‌శర్మ, రాజంపేట డీఎస్పీ అరవిందబాబుల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో ప్రత్యేక బృందం స్మగర్ల కోసం వెతుకుతోందని, కర్ణాటకలో కూడా ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ ద్వారా స్మగ్లర్లను పట్టుకునేందుకు పథక రచన చేస్తున్నామని ఆయన తెలిపారు. చైనా నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు కొంత మంది స్మగ్లర్లకు సహకారం అందిస్తున్నారన్నారు. వారి సంబంధాలపై కూడా కూపీ లాగుతున్నామని చెప్పారు. ఇటీవల దొరికిన జంగాల శివశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామని చెప్పారు. బీహెచ్‌ఈఎల్ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగిపై కూడా అనుమానం ఉందని, త్వరలోనే నిగ్గు తేలుస్తామన్నారు. అడవి లోపల, బయట అన్నిచోట్ల ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
బడా స్మగ్లర్లతో రమణకు సంబంధాలు
ఒంటిమిట్టకు చెందిన బొడ్డె వెంకట రమణ సోదరుడైన పెద్ద వెంకట రమణ ముఠాలో ప్రధాన నిందితుడని, కర్ణాటకలోని కటిగానహళ్లికి చెందిన మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్, రియాజ్, తిరుపతికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ ప్రవీణ్‌లకు ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలియజేశారు. వీరితోపాటు ఢిల్లీకి చెందిన కొంతమంది బడా స్మగ్లర్లతో పెద్ద వెంకట రమణకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వెంకట రమణపై నాలుగు కేసులు ఉన్నట్లు తెలిపారు. గతనెలలో అరెస్టు అయిన బొడ్డె వెంకట రమణను విచారించగా, ఇతని గురించి తెలిసిందన్నారు. పెద్ద వెంకట రమణకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఒంటిమిట్టకు చెందిన పెద్ద వెంకట రమణతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన తమ్మినేని బాబులను అరెస్టు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాఠీ తెలిపారు. తిరుపతి నుంచి శేషాచలం ఫారెస్టులోకి వెళ్లిన వీరు ఓబులవారిపల్లె మండలంలోని అటవీ ప్రాంతం నుంచి ఐచర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగుళూరు వైపు తరలిస్తుండగా శివాజీనగర్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు ఐచర్ వాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు రైల్వేకోడూరు పోలీ సులు పకడ్బందీగా పట్టుకున్నారన్నారు. వీరిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్‌డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృంద సభ్యులు ఎస్‌బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, రైల్వేకోడూరు సీఐ కె.పుల్లయ్య, ఎస్‌ఐలు రోషన్, శివశంకర్, పెద్ద ఓబన్న, నాగరాజు, రాజరాజేశ్వర్‌రెడ్డి, నాగరాజులకు రివార్డులను ప్రకటించారు.