Sp naveen gulati
-
10 మందిపై కాల్‌మనీ కేసులు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నవీన్‌గులాఠి తెలిపారు. బుధవారం ఆయన ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్లను రూపుమాపడానికి నిరంతరం దాడులు కొనసాగిస్తామని చెప్పారు. టాస్క్ ఫోర్సు దాడుల నేపథ్యంలో జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా బాగా తగ్గిందన్నారు. కాల్ మనీ వ్యవహారంలో జిల్లా వ్యాప్తంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై దాడులు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 9 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశామన్నారు. ధర్మ వడ్డీకి ఇస్తున్న వారి జోలికి వెళ్లబోమన్నారు. వడ్డీకి డబ్బు ఇవ్వడమనేది నేరం కాదని, అయితే రూ. 1 లక్ష అప్పుగా ఇచ్చి వారి నుంచి రూ.4-5 లక్షలు వసూలు చేయడం పెద్ద నేరమని చెప్పారు. -
వేట ఆగదు
సాక్షి, కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ పేర్కొన్నారు. ప్రత్యేకంగా శేషాచలం అడవుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు వారంలో ఐదు రోజులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఢిల్లీ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం శోధిస్తున్నాయని చెప్పారు. స్మగర్లైనా, కూలీలైనా ఎర్రచందనం జోలికి వస్తే వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. శనివారం కడపలోని పోలీసు పరేడ్ మైదానంలో ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, రాజంపేట డీఎస్పీ అరవిందబాబుల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రత్యేక బృందం స్మగర్ల కోసం వెతుకుతోందని, కర్ణాటకలో కూడా ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా స్మగ్లర్లను పట్టుకునేందుకు పథక రచన చేస్తున్నామని ఆయన తెలిపారు. చైనా నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు కొంత మంది స్మగ్లర్లకు సహకారం అందిస్తున్నారన్నారు. వారి సంబంధాలపై కూడా కూపీ లాగుతున్నామని చెప్పారు. ఇటీవల దొరికిన జంగాల శివశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామని చెప్పారు. బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగిపై కూడా అనుమానం ఉందని, త్వరలోనే నిగ్గు తేలుస్తామన్నారు. అడవి లోపల, బయట అన్నిచోట్ల ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. బడా స్మగ్లర్లతో రమణకు సంబంధాలు ఒంటిమిట్టకు చెందిన బొడ్డె వెంకట రమణ సోదరుడైన పెద్ద వెంకట రమణ ముఠాలో ప్రధాన నిందితుడని, కర్ణాటకలోని కటిగానహళ్లికి చెందిన మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్, రియాజ్, తిరుపతికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ ప్రవీణ్‌లకు ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలియజేశారు. వీరితోపాటు ఢిల్లీకి చెందిన కొంతమంది బడా స్మగ్లర్లతో పెద్ద వెంకట రమణకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వెంకట రమణపై నాలుగు కేసులు ఉన్నట్లు తెలిపారు. గతనెలలో అరెస్టు అయిన బొడ్డె వెంకట రమణను విచారించగా, ఇతని గురించి తెలిసిందన్నారు. పెద్ద వెంకట రమణకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఒంటిమిట్టకు చెందిన పెద్ద వెంకట రమణతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన తమ్మినేని బాబులను అరెస్టు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాఠీ తెలిపారు. తిరుపతి నుంచి శేషాచలం ఫారెస్టులోకి వెళ్లిన వీరు ఓబులవారిపల్లె మండలంలోని అటవీ ప్రాంతం నుంచి ఐచర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగుళూరు వైపు తరలిస్తుండగా శివాజీనగర్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు ఐచర్ వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు రైల్వేకోడూరు పోలీ సులు పకడ్బందీగా పట్టుకున్నారన్నారు. వీరిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృంద సభ్యులు ఎస్బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, రైల్వేకోడూరు సీఐ కె.పుల్లయ్య, ఎస్ఐలు రోషన్, శివశంకర్, పెద్ద ఓబన్న, నాగరాజు, రాజరాజేశ్వర్‌రెడ్డి, నాగరాజులకు రివార్డులను ప్రకటించారు. -
ఎర్ర పోలీసుల్లో గుబులు!
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ ‘ఎర్ర’ పోలీసులను గుర్తించి వరుసగా వేటు వేస్తుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఐదుగురిపై వేటు వేసిన ఆయన తాజాగా బుధవారం రాత్రి ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. గతంలో ఒంటిమిట్టలో విధులు నిర్వర్తించిన పిఎన్ ప్రతాప్‌రెడ్డి, డిఎస్ రాజేంద్ర, ప్రస్తుతం ఒంటిమిట్టలో విధుల్లో ఉన్న టి రమేష్‌బాబులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు ఎర్ర స్మగ్లర్లతో నిర్వర్తించిన ప్రత్యక్ష సంబంధాలే సస్పెన్షన్‌కు దారితీసినట్లు అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. ఇలాంటి వారు అటవీ, పోలీసు శాఖల్లో సుమారు 72 మంది ఉన్నట్లు ఇటీవల పట్టుబడ్డ స్మగ్లర్ల ద్వారా తెలుస్తోంది. వీరి కాల్ డాటాను పోలీసు ఉన్నతాధికారులను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ మేరకే వేటు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ దిశగా పోలీసు కానిస్టేబుళ్లను మాత్రమే టార్గెట్ చేసి అధికారులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అదే విషయాన్ని అత్యున్నత అధికారి దృష్టికి పోలీసు సంఘం నాయకులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక టీంగా నియమించిన అధికారుల్లో కొందరికి గతంలో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఆశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజంపేట, రాయచోటి ప్రాంతాలల్లో పని చేసిన కొంత మందికి స్మగ్లర్లతో చెలిమి ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాట్లాడమని పురమాయించడంతోనే పోలీసులు వారి ఫోన్ల ద్వారా స్మగ్లర్లతో బేరాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లుతో మాట్లాడేందుకు కారకులైన అధికారులను విస్మరించి పోలీసులపై మాత్రమే వేటు వేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. భాకరాపేటకు చెందిన ఓ బడా స్మగ్లర్‌తో ఓ అధికారి ఇటీవల కూడ ప్రత్యక్షంగా సంబంధాలు నెరిపి లబ్ధి పొందారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాజమండ్రి జైల్లో ఉన్న పీడీ యాక్ట్ నమోదైన ఎర్ర స్మగ్లర్ రెడ్డినారాయణను పలు కేసుల్లో వాయిదాకు తీసుకు వచ్చే తరుణంలో ఏఆర్ పోలీసులు అందుకున్న ముడుపుల వ్యవహారాన్ని కూడ పలువురు ఎత్తిచూపుతున్నారు.