ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నవీన్‌గులాఠి తెలిపారు. బుధవారం ఆయన ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లను రూపుమాపడానికి నిరంతరం దాడులు కొనసాగిస్తామని చెప్పారు. టాస్క్ ఫోర్సు దాడుల నేపథ్యంలో జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా బాగా తగ్గిందన్నారు. కాల్ మనీ వ్యవహారంలో జిల్లా వ్యాప్తంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై దాడులు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 9 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశామన్నారు. ధర్మ వడ్డీకి ఇస్తున్న వారి జోలికి వెళ్లబోమన్నారు. వడ్డీకి డబ్బు ఇవ్వడమనేది నేరం కాదని, అయితే రూ. 1 లక్ష అప్పుగా ఇచ్చి వారి నుంచి రూ.4-5 లక్షలు వసూలు చేయడం పెద్ద నేరమని చెప్పారు.