సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ ‘ఎర్ర’ పోలీసులను గుర్తించి వరుసగా వేటు వేస్తుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఐదుగురిపై వేటు వేసిన ఆయన తాజాగా బుధవారం రాత్రి ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. గతంలో ఒంటిమిట్టలో విధులు నిర్వర్తించిన పిఎన్ ప్రతాప్‌రెడ్డి, డిఎస్ రాజేంద్ర, ప్రస్తుతం ఒంటిమిట్టలో విధుల్లో ఉన్న టి రమేష్‌బాబులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు ఎర్ర స్మగ్లర్లతో నిర్వర్తించిన ప్రత్యక్ష సంబంధాలే సస్పెన్షన్‌కు దారితీసినట్లు అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి.
ఇలాంటి వారు అటవీ, పోలీసు శాఖల్లో సుమారు 72 మంది ఉన్నట్లు ఇటీవల పట్టుబడ్డ స్మగ్లర్ల ద్వారా తెలుస్తోంది. వీరి కాల్ డాటాను పోలీసు ఉన్నతాధికారులను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ మేరకే వేటు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ దిశగా పోలీసు కానిస్టేబుళ్లను మాత్రమే టార్గెట్ చేసి అధికారులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అదే విషయాన్ని అత్యున్నత అధికారి దృష్టికి పోలీసు సంఘం నాయకులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక టీంగా నియమించిన అధికారుల్లో కొందరికి గతంలో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఆశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజంపేట, రాయచోటి ప్రాంతాలల్లో పని చేసిన కొంత మందికి స్మగ్లర్లతో చెలిమి ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాట్లాడమని పురమాయించడంతోనే పోలీసులు వారి ఫోన్ల ద్వారా స్మగ్లర్లతో బేరాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లుతో మాట్లాడేందుకు కారకులైన అధికారులను విస్మరించి పోలీసులపై మాత్రమే వేటు వేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
భాకరాపేటకు చెందిన ఓ బడా స్మగ్లర్‌తో ఓ అధికారి ఇటీవల కూడ ప్రత్యక్షంగా సంబంధాలు నెరిపి లబ్ధి పొందారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాజమండ్రి జైల్లో ఉన్న పీడీ యాక్ట్ నమోదైన ఎర్ర స్మగ్లర్ రెడ్డినారాయణను పలు కేసుల్లో వాయిదాకు తీసుకు వచ్చే తరుణంలో ఏఆర్ పోలీసులు అందుకున్న ముడుపుల వ్యవహారాన్ని కూడ పలువురు ఎత్తిచూపుతున్నారు.
ఎర్ర పోలీసుల్లో గుబులు!
Published Fri, Jun 5 2015 3:07 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
Advertisement