అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్ | International Red sandalwood smuggler Fayaz arrested | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్

Published Tue, Oct 13 2015 7:34 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

International Red sandalwood smuggler Fayaz arrested

కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించాడు. వీరపునాయునిపల్లె మండలం వేముల-పులివెందుల రహదారిలో ఈ నెల 12న పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి.. రూ.రెండు కోట్ల విలువైన నాలుగు టన్నుల బరువుగల 178 ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, మూడు వ్యాన్లు, రూ. 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ మీడియాకు వివరించారు. ఆయన కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బద్రుల్ హసన్ అలియాస్ హసన్ భాయ్‌కి ఫయాజ్ ప్రధాన అనుచరుడు. ఇతని స్వస్థలం బెంగళూరు రూరల్ జిల్లా హోస్‌కోట తాలూకా కటిగెనహళ్లి.

యుక్త వయసు నుంచే కటిగెనహళ్లికి చెందిన స్మగ్లర్ నజీర్‌కు సహాయకుడిగా ఉన్నాడు. కొంత కాలం తర్వాత అతనితో గొడవపడి ఇతర స్మగ్లర్లు ఫైరోజ్‌ ఖాన్, తబ్రేస్‌ ఖాన్‌లతో కలిసి స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. ఇతనికి చైనా, దుబాయ్, సింగపూర్ తదితర ఆసియా దేశాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయల మాటున కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబయికి ఎర్రచందనం దుంగలను తరలించేవాడు. ఇతనికి బెంగళూరులో నాలుగు అపార్ట్‌మెంట్లు, కటిగెనహళ్లిలో 10 ఇళ్లు, 15 ఎకరాల భూమి ఉంది. రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇటీవల అరెస్ట్ అయిన స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇతని కదలికలపై నిఘా ఉంచి ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. జిల్లా పోలీసులు ఫయాజ్‌ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement