international team
-
రెండోరోజూ పోలవరం ప్రాజెక్టు పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండోరోజైన సోమవారం కూడా పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. డేవిడ్ వి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో, రిచర్డ్ డొన్నెళ్లి, సీస్ హించ్ బెర్గర్లతో కూడిన బృందం సభ్యులు ఉ.10 గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని, క్షేత్రస్థాయిలో ప్రతి కట్టడం నిర్మాణాన్ని పరిశీలించారు.బృందం సభ్యులకు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ డైరెక్టర్ అశ్వినీకుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ పి. నారాయణరెడ్డి, సీఈ నరసింహమూర్తిలు ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును వివరించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముందు చేసిన పనులు, తదుపరి చేసిన వివరాలను తెలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో వరద ఉధృతికి ఏర్పడ్డ అగాధాల పరిస్థితిపైనా ఆరా తీశారు. అగాధాలు పడిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్, జెట్ గ్రౌటింగ్ పనులను పరిశీలించి జల వనరుల శాఖాధికారుల నుంచి పనులు జరుగుతున్న తీరుతెన్నులను ప్రశ్నించారు.డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించి గతంలో పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి.. దీనిపై ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. డయాఫ్రం వాల్ కట్టడం, పనితీరు తదితర అంశాలను ఇంజనీరింగ్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాం నుంచి సీపేజ్ (ఊట నీరు) వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాంపై జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ సేకరించిన మట్టి నమూనాలను బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, భూ భౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందం ఎక్కువ దృష్టిపెట్టింది.నేడు, రేపు కూడా సమీక్ష..ఇలా సుమారు మూడు గంటలపాటు డయాఫ్రం వాల్ మొత్తం పరిశీలించారు. పోలవరంలో ప్రధాన సమస్యలు ఇక్కడే ఉండటంతో, ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలించి, ఇంజనీరింగ్ అధికా>రులతో ఎప్పటికప్పుడు చర్చించారు. ఈ పరిశీలనలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సీఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వాప్కోస్, బావర్, కెప్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రి ప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా ప్రాజెక్టు వద్ద అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల భేటీ అనంతరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. ఇక మంగళ, బుధవారాల్లో కూడా బృందం సభ్యులు, జలవనరుల శాఖాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై సమీక్షిస్తారు. -
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం
-
డిమెన్షియా డేంజర్ బెల్స్
డిమెన్షియా. మన దేశాన్ని కొత్తగా ఈ వ్యాధి పట్టిపీడిస్తోంది. వాస్తవానికి దీనిని పూర్తిగా వ్యాధి అని కూడా అనలేం. ఇదొక మానసిక స్థితి. వయసు మీద పడిన వారిలో డిమెన్షియా లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనలు లేకుండా స్తబ్దుగా ఉండిపోవడం, రీజనింగ్ కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి మానసిక సమస్యలు ఎవరిలోనైనా కనిపిస్తే దానిని డిమెన్షియా అని పిలుస్తారు. ఈ డిమెన్షియా కేసులపై మొట్టమొదటిసారిగా మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అధ్యయనం నిర్వహించారు. అంతర్జాతీయ బృందం భారత్‌లో 31,477 మంది వృద్ధులకి సెమీ సూరప్వైజ్డ్ మిషన్ సహకారంతో పరీక్షలు నిర్వహించి ఈ అధ్యయనం చేపట్టింది. యూకేలో యూనివర్సిటీ ఆఫ్ సర్రే, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్, న్యూఢిల్లీలో ఎయిమ్స్‌కు చెందిన పరిశోధనకారులు కృత్రిమ మేధ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలతో సరిసమానమైన డిమెన్షియా కేసులు భారత్‌లో కూడా బయటపడడం ఆందోళనకరంగా మారింది. దీనికి సంబంధించిన నివేదికను న్యూరో ఎపిడిమాలజీ జర్నల్ ప్రచురించింది. దేశంలో 60 ఏళ్ల కంటే పైబడినవారిలో 8.44% మంది అంటే కోటి 8 లక్షల మంది డిమెన్షియాతో బాధపడుతున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడైంది. 2050 నాటికి డిమెన్షియా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతాయని, ఆ సమయానికి దేశ జనాభాలో 19.1శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారి ఉంటారని వారిలో డిమెన్షియా ముప్పు తీవ్రంగా ఉంటుందని ఆ నివేదిక వివరించింది. గతంలో భావించిన దాని కంటే ఈ వ్యాధి వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉందని తేలింది. డిమెన్షియాకు ప్రస్తుతానికైతే చికిత్స లేదు. కొన్ని మందుల వల్ల లక్షణాలన్ని కొంతవరకు తగ్గించగలుగుతారు. వృద్ధాప్యంలో డిమెన్షియా రాకుండా యుక్త వయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. కశ్మీర్లో అధికం మన దేశంలో జమ్మూకశ్మీర్‌లో అత్యధికులు డిమెన్షియాతో బాధపడుతున్నారు. కశ్మీర్‌లోని 60 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్నవారిలో 11% మందికి డిమెన్షియా ఉంది. ఇక ఢిల్లీలో తక్కువగా 4.5% మందిలో ఈ లక్షణాలున్నాయి. డిమెన్షియా అంటే...? డిమెన్షియా అన్న పదం డి, మెంటియా అనే పదాల నుంచి వచ్చింది. డి అంటే వితౌట్ అని, మెంటియా అంటే మనసు అని అర్థం. డిమెన్షియా అనేది సోకితే రోజువారీ చేసే పనులకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొద్ది సేపటి క్రితం ఏం చేశారో వారికి గుర్తు ఉండదు. రోజూ తిరిగే దారుల్ని కూడా మరిచిపోతారు. మాట్లాడడానికి పదాలు వెతుక్కుంటూ ఉంటారు. చిన్న చిన్న లెక్కలు కూడా చెయ్యలేరు. స్థూలంగా చెప్పాలంటే బాధ్యతగా వ్యవహరించలేరు. దీనివల్ల మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. మహిళలే బాధితులు డిమెన్షియా ఎక్కువగా మహిళల్లో కనిపిస్తోంది. చదువు రాని గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళల్లో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని సర్వే తేల్చింది. మహిళల్లో 9% మందికి ఈ వ్యాధి ఉంటే , పురుషుల్లో 5.8% మందిలో గుర్తించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా అంతరం ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల (5.3%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారు (8.4%) ఈ సమస్యతో అధికంగా బాధపడుతున్నారు. ‘‘భారత్‌లో డిమెన్షియా మీద అవగాహన తక్కువ. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు కిందే దీనిని భావిస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ వ్యాధిపై అంతగా దృష్టి సారించడం లేదు. 2050 నాటికి డిమెన్షియా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతాయి. ఆ సమయానికి దేశ జనాభాలో 19.1శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారి ఉంటారు. వారిలో డిమెన్షియా ముప్పు తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధులు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించవచ్చు.’’ –ప్రొఫెసర్ హమియో జిన్, అధ్యయనం సహరచయిత, యూనివర్సిటీ ఆఫ్ సర్రే, యూకే ఒంటరితనంతో డిమెన్షియా ! డిమెన్షియా వ్యాధి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. చిన్నతనం నుంచి మెదడుని చురుగ్గా ఉంచే కార్యక్రమాల్లో ఉండకపోతే పెద్దయ్యేసరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరక్షరాస్యుల్లో ఈ వ్యాధి ఎక్కువ. పొగతాగడం, మద్యపానం, నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటివి కూడా మనసుపై ప్రభావాన్ని చూపించి డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సోకుతాయని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు ఒంటరితనం కూడా ఈ వ్యాధి సోకడానికి కారణమవుతోందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరి జీవితం గడిపే వారిలో డిమెన్షియా వ్యాధి సోకే ముప్పు 27% అధికంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చాపెల్‌కు చేత కాలేదు!
న్యూఢిల్లీ: గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న కాలంలో సీనియర్ ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాల గురించి క్రికెట్ ప్రపంచం మొత్తానికి తెలుసు. సచిన్, గంగూలీ తదితరులు తాము ఆ సమయంలో ఎలా ఇబ్బంది పడ్డామో గతంలోనే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తన ఆటోబయోగ్రఫీ ‘281 అండ్ బియాండ్’లో అతను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒక అగ్రశ్రేణి జట్టుకు కోచ్‌గా ఎలా వ్యవహరించాలో చాపెల్‌కు తెలీదని లక్ష్మణ్ విమర్శించాడు. ‘అతని పదవీకాలం మొత్తం ఒక చేదు జ్ఞాపకం. ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టును ఎలా నడిపించాలో అతనికి తెలియదు. మైదానంలో ఆడాల్సింది క్రికెటర్లు మాత్రమేనని కోచ్ కాదనే విషయాన్ని అతను మరచిపోయినట్లు అనిపించేది. చాలా మంది మద్దతుతో భారత జట్టుకు కోచ్‌గా వచ్చిన అతను జట్టును ఇబ్బందుల్లో నెట్టేసి వెళ్లిపోయాడు. నా కెరీర్లో ఘోరంగా విఫలమైన దశలో అతని పాత్ర కూడా ఉంది. అతని ఆలోచనలు సఫలమయ్యానని ఆ సమయంలో వచ్చిన కొన్ని ఫలితాలు చూస్తే అనిపిస్తుంది కానీ నిజానికి వాటికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని దాని ప్రకారమే పని చేసేవాడు తప్ప పరిస్థితికి తగినట్లుగా మారలేదు. అప్పటికే సమస్యల్లో ఉన్న జట్టులో అతను మరిన్ని విషబీజాలు నాటాడు. కోచ్ కొంత మందినే ఇష్టపడుతూ వారి గురించే పట్టించుకునేవాడు. మిగతావారంతా ఎవరి బాధలు వారు పడాల్సిందే. మా కళ్ల ముందే జట్టు ముక్కలైంది’ అని వీవీఎస్ తన పుస్తకంలో వివరించాడు. -
తేజోధర్కు 5 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: భారత్ సీసీ జట్టు బౌలర్ తేజోధర్ (5/24) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భరత్ సీసీ 71 పరుగుల తేడాతో ఇంటర్నేషనల్ జట్టుపై నెగ్గింది. తొలుత భరత్ సీసీ 193 పరుగులకు ఆలౌటైంది. తేజోధర్ 41, గణేశ్ 35, వికాస్ రావు 31 పరుగులు చేశారు. ఇంటర్నేషనల్ జట్టు బౌలర్ బాలకృష్ణ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత ఇంటర్నేషనల్ జట్టు 122 పరుగులకే చేతులెత్తేసింది. అమిత్ (35) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. భరత్ సీసీ బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో ఎంపీ యంగ్‌మెన్ బ్యాట్స్‌మన్ శ్రీకాంత్ (103 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 30 పరుగుల తేడాతో ఎంపీ స్పోర్టింగ్ జట్టుపై నెగ్గింది. తొలుత ఎంపీ యంగ్‌మెన్ 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నితిన్ 39 పరుగులు చేశాడు. తర్వాత ఎంపీ స్పోర్టింగ్ 230 పరుగులు చేసి ఆలౌటైంది. చైతన్య (55), వినీత్ (56 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎంపీ యంగ్‌మెన్ బౌలర్ అమృత్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అగర్వాల్ సీనియర్స్: 184 (ఫారుఖ్ 43, అజీమ్ 5/44); అపెక్స్ ఎలెవన్: 122 (బిపిన్ 4/12, షాకీర్ 3/25). స్పోర్టివ్ సీసీ: 212 (రోషన్ శ్యామ్యూల్ 54, గణేశ్ 35, తరుణ్ 31; విద్యాసాగర్ 5/72, యోగేష్ మెహతా 4/54); ఆజాద్ సీసీ: 214/7 (సాయి చరణ్ 62 నాటౌట్, హుజేఫా 67; మురళీ మోహన్ 5/28). సదరన్ స్టార్: 85 (నాగరాజు 3/20, నగేంద్ర కుమార్ 4/6); ఇన్కమ్ టాక్స్: 86/2 (సాయి లక్ష్మణ్ 39 నాటౌట్). హెచ్‌పీఎస్: 257/5 (విఘ్నేశ్ 35, రాజా 111 నాటౌట్, యాదవ్ 63); లాల్ బహదూర్: 253 (పరమేశ్వర్ రెడ్డి 42, పవన్ కుమార్ 60; ధీరజ్ 3/32, గౌస్ బాబా 3/48). చీర్‌ఫుల్ చమ్స్: 153 (రాజశేఖర్ 41, సందీప్ 31; ప్రేమ్ 5/38, సాయి కార్తీక్ 3/5); ఎస్ఎన్ గ్రూప్: 154/8 (ఫిరోజ్ 3/45, మధు 3/35). యునెటైడ్ సీసీ: 187 (శ్రవణ్ 70; భార్గవ్ 4/50); గగన్‌మహల్: 89 (శ్రవణ్ 5/42, విక్రమ్ 4/30). సఫిల్‌గూడ: 82 (ఆదిత్య 5/11); సెయింట్ ఆండ్రూస్: 87 (బౌమిక్ 44 నాటౌట్). ఏపీ హైకోర్ట్: 161/4 (అనిల్ 71, అభిషేక్ 70; సూర్య కుమార్ 4/41); కెనరా బ్యాంక్: 79 (కుమార్ 35 నాటౌట్; చంద్రశేఖర్ 5/20).