డయాఫ్రం వాల్ ప్రాంతంలో అగాధాలపై అంతర్జాతీయ నిపుణుల ఆరా
ఎగువ కాఫర్ డ్యాం పనులు కూడా పరిశీలన
నేడు, రేపు కూడా ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతిపై సమీక్ష
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండోరోజైన సోమవారం కూడా పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. డేవిడ్ వి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో, రిచర్డ్ డొన్నెళ్లి, సీస్ హించ్ బెర్గర్‌లతో కూడిన బృందం సభ్యులు ఉ.10 గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని, క్షేత్రస్థాయిలో ప్రతి కట్టడం నిర్మాణాన్ని పరిశీలించారు.
బృందం సభ్యులకు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ డైరెక్టర్ అశ్వినీకుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ పి. నారాయణరెడ్డి, సీఈ నరసింహమూర్తిలు ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును వివరించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముందు చేసిన పనులు, తదుపరి చేసిన వివరాలను తెలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో వరద ఉధృతికి ఏర్పడ్డ అగాధాల పరిస్థితిపైనా ఆరా తీశారు. అగాధాలు పడిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్, జెట్ గ్రౌటింగ్ పనులను పరిశీలించి జల వనరుల శాఖాధికారుల నుంచి పనులు జరుగుతున్న తీరుతెన్నులను ప్రశ్నించారు.
డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించి గతంలో పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి.. దీనిపై ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. డయాఫ్రం వాల్ కట్టడం, పనితీరు తదితర అంశాలను ఇంజనీరింగ్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాం నుంచి సీపేజ్ (ఊట నీరు) వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాంపై జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ సేకరించిన మట్టి నమూనాలను బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, భూ భౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందం ఎక్కువ దృష్టిపెట్టింది.
నేడు, రేపు కూడా సమీక్ష..
ఇలా సుమారు మూడు గంటలపాటు డయాఫ్రం వాల్ మొత్తం పరిశీలించారు. పోలవరంలో ప్రధాన సమస్యలు ఇక్కడే ఉండటంతో, ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలించి, ఇంజనీరింగ్ అధికా>రులతో ఎప్పటికప్పుడు చర్చించారు. ఈ పరిశీలనలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధులు, వాప్కోస్, బావర్, కెప్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రి ప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా ప్రాజెక్టు వద్ద అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల భేటీ అనంతరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. ఇక మంగళ, బుధవారాల్లో కూడా బృందం సభ్యులు, జలవనరుల శాఖాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై సమీక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment