సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధిద్దాం
న్యూఢిల్లీ: సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడమే ధ్యేయంగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని, బహిరంగ విసర్జనకు స్వస్తిపలకాలని ప్రతినిధులు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ‘ప్రపంచ మరుగుదొడ్ల దినం’ సందర్భంగా సులభ్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరుగనున్న ‘ఇంటర్నేషనల్ టాయ్లెట్ ఫెస్ట్’ను మంగళవారం నగరంలోని సెంట్రల్ పార్కులో ప్రారంభించారు. 2019 వరకు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే ప్రధాని మోదీ ఆకాంక్షను నెరవేర్చాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పథక్ అన్నారు. ప్రధానంగా గాంధీ కలలుగన్న సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం కోసం ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్ఘనిస్తాన్,ర భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, విముక్తి పొందిన పారిశుధ్యకార్మికులు, 100 మంది వితంతువులు, నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు.