సింగపూర్ ఒప్పందానికి చట్టం వర్తించదట!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో న్యాయం, చట్టం వర్తించని ఒప్పందాలేమైనా ఉంటాయా? అదీ.. రెండు ప్రభుత్వాల మధ్య చేసుకున్న ఒప్పందం న్యాయానికి, చట్టానికి అతీతంగా ఉంటుందా? ఉంటుందనే సమాధానం చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి మహా ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపకల్పనకు సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి న్యాయం, చట్టం వర్తించవని అదే ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు.
సింగపూర్, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏమైనా వివాదాలు ఏర్పడితే అంతర్జాతీయ ట్రిబ్యునల్, ఇతర ఫోరంలు, మూడో వ్యక్తి దగ్గరకు, ఆఖరికి న్యాయ స్థానం దగ్గరకు కూడా వెళ్లకూడదని ఒప్పందంలో పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సమస్యనైనా పర స్పర ప్రయోజనాలు కలిగేలా ఇరువురు పరిష్కరించుకోవాలని ఒప్పందంలో రాసుకున్నారు.
అలాగే ప్రణాళిక రూపకల్పనలో మరి న్ని సింగపూర్ ప్రైవేటు కంపెనీలను నియమించుకోవచ్చునని కూడా అందులో స్పష్టం చేశారు. సింగపూర్ ప్రైవేటు కంపెనీలు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీతో కలసి పనిచేస్తాయని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై అధికారవర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఒప్పందం ఎక్కడైనా ఉంటుందా అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రణాళిక రూపకల్పన పేరుతో హడావుడిగా సింగపూర్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకోవడంలో తెర వెనుక బాగోతం ఏదో ఉందనే అనుమానాలను అధికారవర్గాలే వ్యక్తంచేస్తున్నాయి.
మరోపక్క.. ప్రణాళిక రూప కల్పనకు సింగపూర్ కంపెనీలకు ఎంత చెల్లిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంలో పేర్కొన కుండా దాచి పెట్టడాన్ని కూడా అధికారవర్గాలు తప్పుప డుతున్నాయి. ఏ విషయంలోనైనా పార దర్శకంగా ఉండాలని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు నోరు విప్పడంలేదని అంటున్నాయి.
ప్రణాళిక తయారీకి ఎంత ఖర్చవు తుందో సింగపూర్ కంపెనీలు అంచనాలు పంపాక ఆ మొత్తాన్ని చెల్లించేలా ఉన్నారని, అందుకే ఇప్పుడు ఆ అంశంపై నోరు విప్పడం లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకపక్క సింగపూర్ ప్రభుత్వం అంటూనే, మరో పక్క సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.