ట్రైనీ ఐపీఎస్ మృతి కేసు సీబీఐ చేతికి
సాక్షి, సిటీబ్యూరో: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతూ గత ఏడాది ఆగస్టు 29న స్విమ్మింగ్ పూల్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్రైనీ ఐపీఎస్ కేసును సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ అధికారులు శుక్రవారం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఇన్స్పెక్టర్ ఎస్.వెంకట్‌రెడ్డి నుంచి కేసు వివరాలు అడిగి తెలుసుకుని పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును వారం రోజుల క్రితం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. వివరాలు ఇలా...
హర్యాన రాష్ట్రం ఇసార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్(30) హిమాచల్‌ప్రదేశ్ 2013 ఐపీఎస్ కేడర్‌గా ఎంపికయ్యారు. వీరి బ్యాచ్‌లో ఉన్న 146 మంది 2013 నుంచి ఎన్పీఏలో శిక్షణ పొందుతున్నారు. ఆగస్టు 29న సాయంత్రం 5గంటల వరకు శిక్షణ పూర్తి చేసుకున్న వీరంతా వారి వారి బ్యారక్లకు వెళ్లిపోయారు. అనంతరం రాత్రి 10 గంటల నుంచి అందరు కలిసి అక్కడే ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఈత కొట్టేందుకు ఎన్‌పీఏలోని స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు.
నీళ్లలోకి దిగిన మానవ్ ఈదలేకపోయాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇతని వెంటే ఉన్న మరో ఇద్దరు ఈ విషయాన్ని పసిగట్టేలోపే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం గమనించిన తోటి ఐపీఎస్‌లు మానవ్‌ను హుటాహుటినా అదే రోజు రాత్రి కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎన్పీఏ ఎస్ఐ షేక్ అబ్దుల్ సమద్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్యేనంటున్న కుటుంబ సభ్యులు..
మానవ్ మృతిపై అతని తల్లిదండ్రులు పలు అనుమానాలను లేవనెత్తారు. అర్ధరాత్రి సమయంలో ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌కు ఎందుకు వెళ్తాడని వారు అధికారులను ప్రశ్నించారు. ఇది హత్యేనని వారు వాదించారు. ఈ మేరకు ప్రధాని, రాష్ట్రపతిని సైతం కలిసి కేసు విచారణను సీబీఐకి ఇచ్చి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోం శాఖ అధికారులు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ వారం రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు.
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో మానవ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని నమోదు చేసిన కేసు ఫైల్‌ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్టు, పోస్టుమార్టం రిపోర్టులను (క్రైమ్ నంబర్ 789/14 సెక్షన్ 174 సీఆర్పీసీ) సీడీ స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు ఈ ఫైల్‌ను క్షుణ్ణంగా చదివిన తరువాత ఎన్‌పీఏకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.
ఘటన జరిగిన రోజున మందుపార్టీ ఎవరు ఇచ్చారు?, ఎవరెవరు పాల్గొన్నారు?, మానవ్ స్విమ్మింగ్ పూల్‌లోకి ఎలా వచ్చాడు?. వెంబడి ఎవరున్నారు..? తదితర విషయాలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. అకాడమీలోని అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలియవచ్చని భావిస్తున్నారు.