Investors Market
-
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్!
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారికి సంబంధించిన పరిణామాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొనే ట్రెండ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక దేశీయ అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే సూచీలు కదలాడనున్నాయని వారు పేర్కొన్నారు. ‘దీపావళి బలిప్రతిపద‘ను పురస్కరించుకుని నేడు (సోమవారం) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారంలో దేశీ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘ఈవారంలో మార్కెట్ ఒక రోజు సెలవు, అలాగే కార్పొరేట్ ఫలితాల వెల్లడి కూడా దాదాపు పూర్తయినట్లే. దీంతో మార్కెట్‌ను ప్రభావితం చేయగల కీలక దేశీయ అంశాలేవీ లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌లలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో, కరోనావైరస్ ధోరణులు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో టోకు ద్రవ్యోల్బణం కొంత ప్రభావం చూపవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, క్రూడ్ ధర, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ‘ఇన్వెస్టర్లు రానున్న రోజుల్లో కోవిడ్–19 కేసులు అలాగే వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన పరిణామాలపై దృష్టి పెట్టనున్నారు‘ అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. ‘విదేశీ’ నిధుల వెల్లువ... భారత్ మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. మెరుగైన కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు(క్యూ2), పెట్టుబడులు పుంజుకునేలా ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణ చర్యలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో మార్కెట్లు కూడా కొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ.35,109 కోట్ల భారీ నిధులను వెచ్చించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నవంబర్ 2 నుంచి 13 మధ్య ఎఫ్‌పీఐలు స్టాక్స్‌లో నికరంగా రూ.29,436 కోట్లు, డెట్ (బాండ్స్) విభాగంలో రూ.5,673 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో సైతం ఎఫ్‌పీఐలు రూ.22,033 కోట్లను నికరంగా దేశీ మార్కెట్లో కుమ్మరించడం విశేషం. ‘రానున్న రోజుల్లో కూడా భారత్ మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆశావహ ధోరణినే కొనసాగించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనాన్ని తట్టుకొని నిలబడిన రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం నెలకొంది’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థాగత వ్యాపార విభాగం హెడ్ అర్జున్ యష్ మహాజన్ పేర్కొన్నారు. ‘మూరత్’ రికార్డులు... దీపావళి సందర్భంగా శనివారం గంటపాటు జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో దేశీ మార్కెట్లు రికార్డులను బద్దలుకొట్టాయి. ‘సంవత్ 2076’ ఏడాదికి లాభాలు, రికార్డులతో వీడ్కోలు పలికిన సూచీలు... ‘సంవత్ 2077’ కొత్త సంవత్సరాన్ని కూడా సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో ఆరంభించాయి. సెస్సెక్స్ 43,831 పాయింట్లను తాకి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరకు 195 పాయింట్ల లాభంతో 43,638 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 12,829 పాయింట్లకు ఎగసి కొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 60 పాయింట్లు లాభపడి 12,780 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ 1.12 శాతం వరకు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టాలతో ముగిశాయి. మొత్తం మీద గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,745 పాయింట్లు (4.16%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 517 పాయింట్లు (4.20%) దూసుకెళ్లాయి. సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి నుంచి దీపావళికి ‘విక్రమ్ సంవత్‘ ఏడాదిగా పరిగణిస్తారు. కాగా, గత సంవత్ 2076 సంవత్సరం మొత్తంలో చూస్తే, సెన్సెక్స్ 4,385 పాయింట్లు (11.22%), నిఫ్టీ 1,136 పాయింట్ల (9.8%) చొప్పున ఎగబాకాయి. -
మీరు ఇన్వెస్టర్‌గా రాణిస్తారా?
♦ షేర్లలో సక్సెస్‌కు వ్యాల్యూ ఇన్వెస్టింగ్ ప్రధానం ♦ వ్యాల్యూ ఇన్వెస్టర్లు చూసేవి చాలా అంశాలు ♦ డివిడెండ్ల నుంచి ఈపీఎస్దాకా చూశాకే నిర్ణయం ♦ ఎన్నాళ్లయినా ఉంచుకోదగ్గ షేర్లకే వీరి ఓటు ♦ వీరి సూత్రాల్ని అనుసరిస్తే దీర్ఘకాలంలో చక్కని లాభాలు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి విషయ పరిజ్ఞానం కాస్త ఎక్కువే ఉండాలి. అప్పుడే ఎన్ని కల్లోలాలు వచ్చినా మంచి లాభాల్ని కళ్లచూడటం సాధ్యమవుతుంది. విలువైన స్టాక్స్‌ను ఎంచుకోవడంలోనే ఇన్వెస్టర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. వ్యాల్యూ ఇన్వెస్టర్లు చేసేది ఇదే. వీరు విలువైన షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో ఉండేలా చూసుకుంటారు. ఏవి విలువైన షేర్లు, ఏవి కావన్న విషయం కూడా వీరికి బాగా తెలుసు. వేటిలో పెట్టుబడులు పెట్టాలి, వేటికి దూరంగా ఉండాలన్న విషయాల్లోనూ చాలా స్పష్టతతో ఉంటారు. వీరు అనుసరించే సూత్రాలను చూస్తే... నిజం! స్టాక్ మార్కెట్ ఒక పట్టాన అర్థం కాదు. కానీ చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్ గురించి తమకు బాగా తెలుసనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం... ఆ గొడవంతా తమకెందుకులే అనుకుని మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తుంటారు. నిజం చెప్పాలంటే... స్టాక్ మార్కెట్లో సక్సెస్‌కు కొలమానం... మనం సంపాదించే లాభాలే. అలాగని నెలలోనో, రెండు నెలల్లోనో తమ ఇన్వెస్ట్మెంట్లను రెట్టింపు చేసుకున్నవారు మాత్రమే సక్సెస్ అయినట్లు కాదు. పద్ధతిగా ఇన్వెస్ట్ చేస్తూ... దీర్ఘకాలంలో బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ రాబడి సంపాదించిన వారంతా విజయవంతమైనట్లే లెక్క. మరి దాన్ని సాధించటమెలా? మార్కెట్లలో సక్సెస్ కావటమెలా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వ్యాల్యూ ఇన్వెస్టింగ్’. అంటే విలువ కలిగిన షేర్లలో ఇన్వెస్ట్ చేయటమన్న మాట. అదెలాగో వివరించేదే ఈ కథనం... డివిడెండ్ చెల్లింపులు అవసరమైతే ఎన్నాళ్లయినా ఉంచుకోతగిన స్టాక్స్‌నే వీరు ఎంచుకుంటారు. ఇదో ప్రాథమిక సూత్రం. కంపెనీ షేరు ధర వాస్తవిక విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతుంటే అది వీరి ఎంపికకు అర్హమైనది. కాకపోతే ఇలా విలువకు తగ్గట్టు రాణించని షేర్ల యాజమాన్యాలు వాటాదారులకు క్రమం తప్పకుండా ప్రతిఫలాలను అందించేవి అయి ఉండాలి. ఉదాహరణకు డివిడెండ్లు. అలా లేకుంటే తక్కువ విలువకు లభిస్తున్నా వాటిని ఎంపిక చేసుకోరు. అదే సమయంలో డివిడెండ్ చెల్లించనివి మంచి స్టాక్స్ అయినా... వాటిలో పెట్టుబడులకు కూడా వీరు దూరంగానే ఉంటారు. ఎందుకంటే వ్యాల్యూ ఇన్వెస్టర్లకు డివిడెండ్ అంటే ఎంతో మక్కువ. నిరంతరం డివిడెండ్ చెల్లింపులు చేసే స్టాక్స్‌కు వీరు అగ్ర ప్రాధాన్యమిస్తారు. షేరువారీ ఆర్జన (ఈపీఎస్) వ్యాల్యూ ఇన్వెస్టర్లు పాటించే మరో సూత్రం ఈపీఎస్. అంటే ఒక్కో షేరుకు వచ్చే ఆదాయమన్న మాట. కేవలం ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈపీఎస్‌ను చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోరు. గత పదేళ్ల కాలంలో ఆ కం పెనీ ఈపీఎస్ ఎలా ఉన్నదనేది చూస్తా రు. ఈపీఎస్‌లో గనక క్రమానుగతంగా వృద్ధి ఉంటేనే అటువైపు చూస్తారు. గడిచిన 3, 5, 10 సంవత్సరాల్లో ఓ కంపెనీ ఈపీఎస్‌లో స్థిరమైన వృద్ధి లేకపోతే ఆ షేర్లను పక్కన పెట్టేస్తారు. ఈపీఎస్‌లో హెచ్చుతగ్గులున్నా వీరు ఇష్టపడరు. కొత్త వాటికి దూరం ఇటీవలే స్టాక్మార్కెట్లో లిస్టయిన షేర్లకు వీరు తక్కువ రేటింగ్ ఇస్తుంటారు. ఈ షేర్లు క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తున్నా, ఈపీఎస్‌లో వృద్ధి ఉన్నా సరే... వెంటనే వాటిలో ఇన్వెస్ట్ చేయకుండా కొంత సమయం తీసుకుంటారు. తమ సత్తా ఏంటో ఆయా కంపెనీలు నిరూపించుకునే వరకూ వాటిని తమ పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోరు. పోటీ ఇవ్వలేకుంటే పక్కకే వ్యాల్యూ ఇన్వెస్టర్లు చూసే మరో ప్రధానాంశం... అసాధారణమైన పోటీ సామర్థ్యం. అదే రంగంలోని ప్రత్యర్థి కంపెనీలను తట్టుకుని దీర్ఘకాలం పాటు తమ మార్కెట్ షేరును, లాభాలను కాపాడుకునే సామర్థ్యం గల వాటికే వీరు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఈ సామర్థ్యాలే కంపెనీల ఈపీఎస్‌లో వృద్ధికి, నిరంతరాయ డివిడెండ్ చెల్లింపులకు కీలకంగా పనిచేస్తాయి. తీవ్రమైన పోటీని ఎదుర్కొనే కంపెనీలు తమ విక్రయాలపై వచ్చే లాభాల మార్జిన్లలో రాజీ పడాల్సి వస్తుంది. దాంతో ఆ ప్రభావం షేరు ధరపై ప్రతిఫలిస్తుంది. అందుకే ఆ రంగంలో తిరుగులేని కంపెనీలకు వీరు మొదట ఓటేస్తారు. ఉత్పత్తులకు ఆదరణ ఉంటేనే ఓ కంపెనీ కొత్తగా పళ్ల రసాలు లేదా శీతలపానీయాల వ్యాపారంలోకి అడుగుపెట్టిందనుకోండి. అటువంటి వాటిలో వీరు పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే అన్ని కంపెనీలూ కోకకోలా, పెప్సీ, పార్లేలు కాలేవు. కొత్త కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల ఆదరణ ఎలా ఉంటుంది? పోటీతో కూడిన మార్కెట్లో దీర్ఘకాలంలో అవి ఎలా రాణిస్తాయి? ఎలా నిలదొక్కుకుంటాయి? వంటి అంశాలను చూస్తారు. ఒకవేళ కొత్త కంపెనీ కోకకోలా మాదిరిగా అవతరిస్తే అప్పుడు వాటిని తమ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చేసుకుం టారు. ఇందుకు ఉదాహరణ ప్రపంచ స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్‌గా పేర్కొనే వారెన్ బఫెట్... 2011లో ఐబీఎం షేరును తొలిసారి కొనుగోలు చేయడం. వాస్తవానికి ఈ కంపెనీ షేరు అంతకు ఎన్నో ఏళ్ల ముందు నుంచి అందుబాటులో ఉన్నదే. ప్రజాదరణ ఉన్నవాటికే తాము ఇన్వెస్ట్ చేసే కంపెనీల ఉత్పత్తులకు ప్రజాదరణ ఉండాలి. అటువంటివి తేలిగ్గా అమ్ముడుపోతాయి. ఈ తరహా ఉత్పాదనలున్న కంపెనీలు తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఆయా ఉత్పత్తుల్లో నాణ్యత, ప్రత్యేకత, విభిన్నతే వాటిని రాణించేలా చేస్తాయి. ఉదాహరణకు యాపిల్ తరహా సంస్థలు. అధిక రుణాలుంటే ప్రతికూలమే! అధిక రుణాలతో వ్యాపారం చేసే కంపెనీలకు సైతం వ్యాల్యూ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. వీరు కంపెనీల బ్యాలెన్స్ షీట్లో చూసే అంశాల్లో తక్కువ రుణం– ఈక్విటీ నిష్పత్తి ఉందా లేదా అని. ఇలా ఉన్నవాటినే తమ లిస్ట్‌లో చేర్చుకుంటారు. ఎందుకంటే అధిక రుణాలతో వ్యాపారం చేసే కంపెనీలు ఏ కొద్దిగా తేడా వచ్చినా పూర్తిగా మునిగిపోతాయి. వ్యాపారం తగ్గినా, పోటీ తట్టుకోలేకపోయినా, రుణ భారం భరించలేని స్థాయికి చేరిపోయినా, ఆర్థిక సంక్షోభ తరహా పరిస్థితులు ఏర్పడినా వీటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. గత ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మన దేశంలో మౌలిక రంగ కంపెనీల పరిస్థితి ఏమైందో గుర్తు చేసుకోండి. తక్కువ లాభాలున్న వాటికి దూరం ఇతర అంశాలన్నీ సానుకూలంగా ఉన్నా సరే..! కంపెనీల అమ్మకాల్లో లాభాల శాతం తక్కువగా ఉంటే ఆయా కంపెనీల షేర్లను వ్యాల్యూ ఇన్వెస్టర్లు ఎంచుకోరు. రిటైల్, టెలికం కంపెనీలు, ఎయిర్‌లైన్ కంపెనీల్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. వీటి వ్యాపారం భారీ స్థాయిలోను, లాభాలు తక్కువగానూ ఉంటాయి. టైమింగ్ చూశాకే... చివరిగా... వ్యాల్యూ ఇన్వెస్టర్లు సంప్రదాయవాదులే, రక్షణాత్మక ధోరణితోనే ఉంటారు. కానీ, బద్ధకస్తులు మాత్రం కాదు. పెట్టుబడులు పెట్టినా, ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా సరైన సమయంలోనే చేస్తారు.