అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌! | International Factors Investors Focus On Covid Developments | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌!

Published Mon, Nov 16 2020 6:00 AM | Last Updated on Mon, Nov 16 2020 7:15 AM

International Factors Investors focus on Covid‌ developments - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారికి సంబంధించిన పరిణామాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొనే ట్రెండ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక దేశీయ అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే సూచీలు కదలాడనున్నాయని వారు పేర్కొన్నారు. ‘దీపావళి బలిప్రతిపద‘ను పురస్కరించుకుని నేడు (సోమవారం) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారంలో దేశీ మార్కెట్లలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది.

‘ఈవారంలో మార్కెట్‌ ఒక రోజు సెలవు, అలాగే కార్పొరేట్‌ ఫలితాల వెల్లడి కూడా దాదాపు పూర్తయినట్లే. దీంతో మార్కెట్‌ను ప్రభావితం చేయగల కీలక దేశీయ అంశాలేవీ లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌లలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో, కరోనావైరస్‌ ధోరణులు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

‘ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో టోకు ద్రవ్యోల్బణం కొంత ప్రభావం చూపవచ్చు’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, క్రూడ్‌ ధర, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ‘ఇన్వెస్టర్లు రానున్న రోజుల్లో కోవిడ్‌–19 కేసులు అలాగే వ్యాక్సిన్‌ అభివృద్ధికి సంబంధించిన పరిణామాలపై దృష్టి పెట్టనున్నారు‘ అని ఛాయిస్‌ బ్రోకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమీత్‌ బగాడియా పేర్కొన్నారు.

‘విదేశీ’ నిధుల వెల్లువ...
భారత్‌ మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. మెరుగైన కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు(క్యూ2), పెట్టుబడులు పుంజుకునేలా ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణ చర్యలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో మార్కెట్లు కూడా కొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ నెలలో ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో రూ.35,109 కోట్ల భారీ నిధులను వెచ్చించారు.

డిపాజిటరీల గణాంకాల ప్రకారం నవంబర్‌ 2 నుంచి 13 మధ్య ఎఫ్‌పీఐలు స్టాక్స్‌లో నికరంగా రూ.29,436 కోట్లు, డెట్‌ (బాండ్స్‌) విభాగంలో రూ.5,673 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో సైతం ఎఫ్‌పీఐలు రూ.22,033 కోట్లను నికరంగా దేశీ మార్కెట్లో కుమ్మరించడం విశేషం. ‘రానున్న రోజుల్లో కూడా భారత్‌ మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆశావహ ధోరణినే కొనసాగించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనాన్ని తట్టుకొని నిలబడిన రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం నెలకొంది’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సంస్థాగత వ్యాపార విభాగం హెడ్‌ అర్జున్‌ యష్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

‘మూరత్‌’ రికార్డులు...
దీపావళి సందర్భంగా శనివారం గంటపాటు జరిగిన ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్‌లో దేశీ మార్కెట్లు రికార్డులను బద్దలుకొట్టాయి. ‘సంవత్‌ 2076’ ఏడాదికి లాభాలు, రికార్డులతో వీడ్కోలు పలికిన సూచీలు... ‘సంవత్‌ 2077’ కొత్త సంవత్సరాన్ని కూడా సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాలతో ఆరంభించాయి. సెస్సెక్స్‌ 43,831 పాయింట్లను తాకి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరకు 195 పాయింట్ల లాభంతో 43,638 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 12,829 పాయింట్లకు ఎగసి కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 60 పాయింట్లు లాభపడి 12,780 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ 1.12 శాతం వరకు  లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్‌ సిమెంట్, బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రమే నష్టాలతో ముగిశాయి. మొత్తం మీద గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,745 పాయింట్లు (4.16%), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 517 పాయింట్లు (4.20%) దూసుకెళ్లాయి. సాంప్రదాయ హిందూ క్యాలెండర్‌ ప్రకారం దీపావళి నుంచి దీపావళికి ‘విక్రమ్‌ సంవత్‌‘ ఏడాదిగా పరిగణిస్తారు. కాగా, గత సంవత్‌ 2076 సంవత్సరం మొత్తంలో చూస్తే, సెన్సెక్స్‌ 4,385 పాయింట్లు (11.22%), నిఫ్టీ 1,136 పాయింట్ల (9.8%) చొప్పున ఎగబాకాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement