Religare Securities
-
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్!
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారికి సంబంధించిన పరిణామాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొనే ట్రెండ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక దేశీయ అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే సూచీలు కదలాడనున్నాయని వారు పేర్కొన్నారు. ‘దీపావళి బలిప్రతిపద‘ను పురస్కరించుకుని నేడు (సోమవారం) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారంలో దేశీ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘ఈవారంలో మార్కెట్ ఒక రోజు సెలవు, అలాగే కార్పొరేట్ ఫలితాల వెల్లడి కూడా దాదాపు పూర్తయినట్లే. దీంతో మార్కెట్‌ను ప్రభావితం చేయగల కీలక దేశీయ అంశాలేవీ లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌లలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో, కరోనావైరస్ ధోరణులు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో టోకు ద్రవ్యోల్బణం కొంత ప్రభావం చూపవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, క్రూడ్ ధర, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ‘ఇన్వెస్టర్లు రానున్న రోజుల్లో కోవిడ్–19 కేసులు అలాగే వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన పరిణామాలపై దృష్టి పెట్టనున్నారు‘ అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. ‘విదేశీ’ నిధుల వెల్లువ... భారత్ మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. మెరుగైన కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు(క్యూ2), పెట్టుబడులు పుంజుకునేలా ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణ చర్యలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో మార్కెట్లు కూడా కొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ.35,109 కోట్ల భారీ నిధులను వెచ్చించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నవంబర్ 2 నుంచి 13 మధ్య ఎఫ్‌పీఐలు స్టాక్స్‌లో నికరంగా రూ.29,436 కోట్లు, డెట్ (బాండ్స్) విభాగంలో రూ.5,673 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో సైతం ఎఫ్‌పీఐలు రూ.22,033 కోట్లను నికరంగా దేశీ మార్కెట్లో కుమ్మరించడం విశేషం. ‘రానున్న రోజుల్లో కూడా భారత్ మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆశావహ ధోరణినే కొనసాగించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనాన్ని తట్టుకొని నిలబడిన రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం నెలకొంది’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థాగత వ్యాపార విభాగం హెడ్ అర్జున్ యష్ మహాజన్ పేర్కొన్నారు. ‘మూరత్’ రికార్డులు... దీపావళి సందర్భంగా శనివారం గంటపాటు జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో దేశీ మార్కెట్లు రికార్డులను బద్దలుకొట్టాయి. ‘సంవత్ 2076’ ఏడాదికి లాభాలు, రికార్డులతో వీడ్కోలు పలికిన సూచీలు... ‘సంవత్ 2077’ కొత్త సంవత్సరాన్ని కూడా సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో ఆరంభించాయి. సెస్సెక్స్ 43,831 పాయింట్లను తాకి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరకు 195 పాయింట్ల లాభంతో 43,638 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 12,829 పాయింట్లకు ఎగసి కొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 60 పాయింట్లు లాభపడి 12,780 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ 1.12 శాతం వరకు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టాలతో ముగిశాయి. మొత్తం మీద గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,745 పాయింట్లు (4.16%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 517 పాయింట్లు (4.20%) దూసుకెళ్లాయి. సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి నుంచి దీపావళికి ‘విక్రమ్ సంవత్‘ ఏడాదిగా పరిగణిస్తారు. కాగా, గత సంవత్ 2076 సంవత్సరం మొత్తంలో చూస్తే, సెన్సెక్స్ 4,385 పాయింట్లు (11.22%), నిఫ్టీ 1,136 పాయింట్ల (9.8%) చొప్పున ఎగబాకాయి. -
రెలిగేర్ సెక్యూరిటీస్‌ను కొనేసిన ఎడిల్వీస్
సాక్షి, ముంబై: ఎడిల్ వీస్ వెల్త్ మేనేజ్మెంట్ రెలిగేర్ సెక్యూరిటీస్ బిజినెస్‌ను కొనుగోలు చేసింది. డిపాజిటరీ పార్టిసిపెంటరీ సర్వీసెస్ సహా సెక్యూరిటీస్, కమోడిటీ బ్రోకింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్టు ఎడిల్వీస్ బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌తో రెలిగేర్‌కు చెందిన సెక్యూరిటీ బిజినెస్‌లో భాగంగా కమోడిటీస్ బ్రోకింగ్, డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీసులను సైతం ఎడిల్వీస్ దక్కించుకోనుంది. ఈ డీల్ ద్వారా తమ గ్రోత్ ప్లాన్స్ మరింత ఆకర్షణీయంగా మారనున్నాయని ఎడిల్వీస్ గ్రూప్ గ్లోబల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, సీఈవో నితిన్ జైన్ చెప్పారు. తమ క్లయింట్ బేస్ దాదాపు మూడు రెట్లు పెరుగుదలకు సహాయం చేస్తుందన్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కొనుగోలు విషయాన్ని వెల్లడించడంతో ఈ రెండు కౌంటర్లూ వెలుగులోకి వచ్చాయి. బీఎస్ఈలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ షేరు 5 శాతం లాభపడగా, ఎడిల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.27 శాతం లాభాలతో కొనసాగుతోంది. కాగా గతంలో ఎడెల్ వీస్ వెల్త్ మేనేజ్మెంట్ రూష్నిల్ సెక్యూరిటీస్ (2001) , అనాగ్రాం క్యాపిటల్ లిమిటెడ్ (2010) ను కొనుగోలు చేసింది. -
తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్..
ఎఫ్ అండ్ వో ముగింపు ఎఫెక్ట్ ఆయిల్ ధరల కదలికలూ కీలకమే ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: రుతుపవనాల పురోగతి, ఇరాక్ అంతర్యుద్ధం కారణంగా వేడెక్కిన ఆయిల్ ధరలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచా వేశారు. వీటికితోడు గురువారం(26న) జూన్ నెల ఎఫ్ అండ్ వో సిరీస్ ముగియనున్నందున ప్రధాన ఇండెక్స్‌లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. జూన్ డెరివేటివ్ పొజిషన్లను ట్రేడర్లు రోల్ఓవర్ చేసుకోవడం కూడా ఇందుకు కారణంగా నిలవనుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు కూడా దేశీ ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయని తెలిపారు. భారీ పొజిషన్లు వద్దు గడిచిన శుక్రవారం మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి దిగివచ్చాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25,105 వద్ద, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,511 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే వారం ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అత్యధిక స్థాయిలో ఒడిదుడుకులకు లోనయ్యే కౌంటర్లకు దూరంగా ఉండటమే మేలని, ఇదే విధంగా గరిష్ట స్థాయిలో ట్రేడర్లు పొజిషన్లు తీసుకోవడం సమర్థనీయం కాదని సూచించారు. ధరల పెరుగుదలకు అవకాశం ఈ వారం మార్కెట్లకు రుతుపవనాలు కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఆహారోత్పత్తి తగ్గుతుందని, ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు. రుతుపవనాలు ఇప్పటికే దేశంలో సగభాగం వ్యాపించినప్పటికీ 4 రోజులు ఆలస్యమైన విషయం విదితమే. దీంతో జూన్ 1-18 మధ్య సాధారణంకంటే 45% తక్కువగా వర్షాలు పడ్డాయి. వెరసి ఇకపై వీటి పురోగమనం దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుందని మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై దృష్టి ఇకపై రుతుపవనాల కదలికలతోపాటు, జూలై రెండో వారంలో వెలువడనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా చెప్పారు. సమీప కాలానికి ఈ రెండు అంశాలే మార్కెట్లకు దిశను నిర్దేశిస్తాయని తెలిపారు. ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతోపాటు, ఇతర సంస్కరణలను ప్రకటిస్తే దేశీ మార్కెట్లు ఇతర వర్ధమాన మార్కెట్లకు మించి దూసుకెళతాయని అభిప్రాయపడ్డారు. అయితే ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగితే కరెంట్ ఖాతాలోటు, రూపాయి, ద్రవ్యోల్బణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అమెరికా గణాంకాలు... ఈ వారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. మే నెలకు వినియోగ వస్తు రంగ ఆర్డర్లు, హౌసింగ్ అమ్మకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. కాగా, ఇరాక్‌లో చెలరేగిన అంతర్యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 115 డాలర్లను తాకడంతో దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. చమురు అవసరాలకు విదేశాలపై అధికంగా ఆధారపడటంతో దిగుమతుల బిల్లు పెరిగి దేశీ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న అంచనాలు గత వారం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ వరుసగా రెండో వారం కూడా నష్టాలతో ముగిసింది.