సత్తా చాటిన అకాడమీ జట్లు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంత క్రీడా మైదానంలోని విన్సెంట్ క్రీడా మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ అండర్–12, 14 జట్లు తొలి రోజు సత్తా చాటాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో అండర్–12 జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జైన్ స్కూల్ జట్టు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ ధాటికి కుప్పకూలింది. అనంతపురం జట్టులో సుమంత్, కరీమ్ చెరో నాలుగు వికెట్లు తీసి జట్టును కుప్పకూల్చారు. సునీల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అనంతపురం జట్టు 7 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో నిక్షిప్త మనోహర్ 23 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మధ్యాహ్నం అండర్–14 మ్యాచ్‌లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, బెంగళూరు జైన్ స్కూల్ జట్లు తలపడ్డాయి. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టులో బాలురతో సమానంగా పల్లవి, అనూష క్రికెట్ ఆడడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 215 పరుగులు చేసింది. జట్టులో విఘ్నేష్ దినకర్ చెలరేగిపోయాడు. 70 బంతుల్లో 93 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ పల్లవి 75 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జైన్ స్కూల్ నిర్ణీత 30 ఓవర్లలో 150 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. జట్టులో సుయాస్ 50 పరుగులు సాధించాడు. అనంతపురం జట్టు బౌలర్లు ప్రణయ్ 4, మహేశ్ 3 వికెట్లు తీసి జట్టును 65 పరుగుల తేడాతో గెలిపించారు. ఆదివారం కూడా మ్యాచ్‌లు కొనసాగుతాయని కోచ్ యుగంధర్‌రెడ్డి ప్రకటించారు.