క్రికెట్ కప్పులో ఫ్యాన్స్ తుఫాన్
బ్యాటులన్ ధ్యాయేత్.. పరుగుల్ ఆవాహయామి బంతులన్పూజయామి.. వికెట్లు సమర్పయామి టెస్టాకారం క్రికెట్ సర్వం.. వన్డేహం విశ్వక్రీడాయాం.. ట్వంటీ ట్వంటీ నమస్తుభ్యం.. గ్రౌండే కదా సమరాంగణం సర్వాభిమాన శోభితే తత్ప్రణమామి క్రికెటాయ నమః !
ఏ దేశంలో క్రికెట్ పూజిపబడుతుందో అదే భారతదేశం. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇక్కడ క్రికెట్క్రీడాకారులు ఆరాధ్య దైవాలు. ఇది చెప్పక్కర్లేని వాస్తవం. క్రికెట్ అభిమానులు పండుగ చేసుకునే కాలం వచ్చేసింది.
క్రేజీఆల్..
ఒకప్పట్లా ఇప్పుడు క్రికెట్ అభిమానం రోడ్లపై వెల్లువెత్తి పూజలందుకోవడం కనిపించట్లేదేమో. కానీ క్రికెట్ మోజు, క్రేజు ఏ మాత్రం తగ్గలేదు, తగ్గదు కూడా. పైకి వ్యక్తం చేయకపోయినా.. అభిమానం ప్రకటించకపోయినా.. క్రికెట్ మన జీవితాల్లో భాగమైపోయింది. మనకు క్రికెట్ కేవలం ఒక ఆటకాదు అది మన దేశ గౌరవం. ఒక పక్కన ఈ క్రీడకు అంతటి సామాజిక హోదా ఇస్తూనే మనం దాన్ని మన జీవితంలో అంతర్భాగం చేసేసుకున్నాం. క్రికెట్ మన ఎంటర్టైన్మెంట్. అందుకే ఏ రూపంలో క్రికెట్ వచ్చినా దాన్ని ఆదరించేస్తాం. ఎప్పటికీ వన్నె తగ్గని అచ్చమైన టెస్టులైనా, నిఖార్సయిన వన్డేలైనా, చిట్టి టీట్వంటీలైనా సందర్భానికి తగ్గట్టు పండుగ చేసుకుంటాం.
మ్యాచ్ కాలమానమే కొలమానం..
ఐపీఎల్ సంబరాలు పూర్తవగానే ట్రై సిరీస్ మ్యాచులు చూసేస్తాం. ఇప్పడు ప్రపంచ కప్ సమరానికి కళ్లప్పగించేశాం. క్రికెట్‌కి ఒక సీజన్ అంటూ లేదు. ఎక్కడ క్రికెట్ ఉంటే అక్కడ అభిమానం ఉంటుంది. ఆదివారం హైదరాబాద్ రోడ్లు సహజంగానే కొంత ఫ్రీగా దర్శనమిస్తుంటాయి. కానీ, క్రికెట్ అభిమానానికి కొలమానం కావాలంటే ఆదివారం ఇండియా మ్యాచ్ ఉంటే రోడ్డుపైకి వచ్చి చూడండి (అదీ మ్యాచ్ వదిలే ధైర్యం మీకుంటే). కర్ఫ్యూ పెట్టినట్టు సిటీ బోసిపోతుంది. గెలిస్తే పండుగే. ఓడినా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.
మంచి కాలం మించకుండా..
క్రికెట్ సీజన్ ఒకప్పుడు ఏడాదికోసారి వచ్చేది. ఇప్పుడు ప్రతి సీజన్లోనూ క్రికెట్ ఉంటోంది. క్రికెట్లోని ఆయా సీజన్లకు తగ్గట్టుగా మార్కెట్ కూడా తనని తాను మార్చుకుంటోంది. నిన్నటి దాకా.. కూల్ డ్రింక్స్, స్నాక్స్ మాత్రమే క్రికెట్‌కి జతగా కనిపించేవి. కానీ, ఇప్పుడు అవీ ఇవీ కావు అన్నీ క్రికెట్ సీజన్‌ని వాడుకుని సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. వస్త్రాలు, ఫోన్లు, కార్లు, టీవీలు, చాక్లెట్లు, బైకులు, ఆఖరకు క్రికెట్ యాప్‌లు కూడా. కావేవీ క్రికెట్‌కి అనర్హం ! తింటూ క్రికెట్, నడుస్తూ, మాట్లాడుతూ, నిద్రిస్తూ కూడా క్రికెట్ ధ్యాసే. పనివేళల్లో కూడా ఆట మిస్‌కాకుండా అప్డేట్లు, రికార్డింగ్‌లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.
పందెం నష్టం.. పొందకు లాభం..
ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా ప్రత్యక్షంగా చూడటానికి స్టేడియాలకు వచ్చే అభిమానుల్లో అధిక శాతం భారతీయులే ఉంటున్నారట. పైగా ఆ మ్యాచ్‌లో ఇండియా ఆడితే.. టికెట్లు తెగ అమ్ముడవుతాయని నిర్వాహకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్త రికార్డులు సైతం సృష్టించేశామట. కిందటి ఆదివారం మెల్బోర్న్లో సౌత్ ఆఫ్రికా, ఇండియా మ్యాచ్‌కి వచ్చిన ప్రేక్షక మహాశయుల్లో 70 వేల మంది మనవారేనట. దాదాపు 80 శాతం మంది భారత అభిమానులతో స్టేడియం త్రివర్ణ శోభితమైంది. ఇంతటి పిచ్చి అభిమానం ఉన్న దేశానికి చీడ పీడ బెట్టింగ్ భూతం. అభిమానాన్ని వీక్నెస్గా మార్చుకుని బేరం సాగించే దుస్సంప్రదాయానికి నిజమైన క్రీడాస్ఫూర్తి బలైపోతోంది. ఇప్పటి వరకు పందెం బరిలోకి కోళ్లు, గుర్రాలనూ మాత్రమే దింపాం. ఆ మూగజీవాలకు గెలుపు లక్ష్యం తప్ప డబ్బుతో పనిలేదు. కానీ మన గెలుపోటముల సరదా మనుషులపై పందెం కట్టే స్థాయికి దిగజారిపోయింది.
ఎక్కడ పందెం ఉందో అక్కడ డబ్బు ఉంది. ఎక్కడ డబ్బుందో అక్కడ మాఫియా ఉంది. మూగజీవాల్లా డబ్బుకు అతీతంగా ఉండగలిగే అస్తిత్వాన్ని మన క్రీడాకారులకు ప్రసాదించు భగవాన్. ‘డబ్బుకు, పందానికీ తావులేని అభిమానాన్ని మా గుండెల్లో నింపు భగవాన్’ ఇంత పెద్ద కోరికలు ఆ భగవంతుడే తీర్చగలడు. కానీ, నా వంతు బాధ్యత నేను చేయగలను. చిన్న పందానికి కూడా లొంగకుండా నిజమైన క్రీడాస్ఫూర్తితో క్రికెట్ చూడటం. గెలుపోటములు రెండిట్లోనూ కిక్కుంది. ఆ కిక్ కోసం క్రికెట్‌ను ప్రేమించే కోట్లాది మందిలో ఓ అభిమానిగా హ్యాపీ క్రికెటింగ్.