ఊరించి.. ఉసూరనిపించి..
ఈపూరు, న్యూస్‌లైన్ :మార్కెట్లో ఉల్లి ధరలు వినియోగదారులకు వణుకుపుట్టిస్తున్నాయి. వంద రూపాయలకు రెండు కిలోలు కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా చూసి సహజంగానే టన్నుల కొద్దీ పంట పండించే రైతుకు కనకధార కురుస్తుందని భావిస్తాం. ఇలా ఊరిస్తున్న ఉల్లి ధరలు కొందరు రైతులను సాగుకు ఉసిగొల్పాయి. మంచి లాభాలు వస్తాయిని ఆశించిన వారిని నష్టాల ఊబిలోకి నెట్టాయి. వర్షాల దెబ్బకు పంట తడిసిపోగా లాభాల మాట దేవుడెరుగు ఇప్పడు పెట్టుబడి కూడా దక్కేలా కనిపించడం లేదు. ప్రతి ఇంటా తప్పని సరిగా వాడే నిత్యావసర వస్తువుల్లో ఉల్లి ప్రధానమైంది. ఇప్పుడు ఉల్లి పేరు చెబితే ప్రభుత్వాలే కాదు, దాన్ని నమ్ముకుని పండించిన రైతులు సైతం వణికిపోతున్నారు. ఏడాది కాలంగా ఉల్లి ధరలు కొండెక్కడంతో వాటికి మంచి డిమాండ్ వచ్చింది.
ధరలపై ఆశతో కొత్త పంటపై మోజు పడ్డ వినుకొండ ప్రాంత రైతులకు దిమ్మ తిరిగింది. ఈపూరు మండలం అగ్నిగుండాల, సమీపంలోని రంగాపురం తండాకు చెందిన అంజిరెడ్డి, శ్రీను నాయక్, మల్లేశ్‌నాయక్, వాగ్యానాయక్, వాన్యానాయక్ తదితర రైతులు ఉల్లి పండిస్తే మంచి లాభాలు వస్తాయని భావించారు. ఏటా పత్తి, మిర్చి పండించే తమ పొలాల్లో ఈ ఏడాది ఉల్లి సాగు చేపట్టారు. ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే వరకు అప్పు తెచ్చి మరీ వందల మంది కూలీలను పెట్టారు. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల కొద్దీ పంట చేతి కొస్తుందని, కనీసం మూడు, నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఇక్కడి నల్లరేగడి నేల స్వభావం పంటకు అనుకూలంగా లేకపోవడంతో వర్షాల తాకిడికి పంటను భూమి నుంచి బయటకు తీసేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు.
కేవలం ఎకరాకు రెండు, మూడు టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా పంటచేతి కందే సమయానికి వర్షాలు పడ్డాయి. వర్షాలకు మొత్తం పంట తడిసిపోయింది. ఇప్పుడు ఆ తడిసిన పంటను కొనే నాథుడులేడు. కొందరు రైతులు కిలో పది రూపాయల చొప్పున కొంత సరుకు విక్రయించేశారు. సాగు సమయంలో సూచనలిచ్చే వ్యవసాయ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. పంటను దాచే వసతి లేక, తడిసిన ఉల్లిపాయలను రాశులుగా పొలాల్లోనే ఆరబెట్టుకుంటూ రైతులు అవస్థలు ఎదుర్కొన్నారు. పది ఎకరాల్లో పండించిన పంట పొలంలోనే మళ్లీ మొక్కలు వస్తున్నాయి. వర్షాలకు 50 శాతం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ, పంట నష్టంపై అంచనాలు తయారు చేసే అధికారులు ఇప్పటి వరకు ఈ తండావైపు తొంగి చూసిన దాఖలాలు లేవు.