బాలుడి ప్రాణాలు తీసిన మత్తుమందు
గుర్గావ్: డాక్టర్ల నిర్లక్ష్యం బధిర బాలుడి ప్రాణాలు తీసింది. కొడుకు వైద్యం కోసం దేశంకాని దేశం వచ్చిన తండ్రికి వైద్యులు విషాదం మిగిల్చారు. మత్తుమందు(ఎనస్తీషియా) వికటించి ఇరాక్ కు చెందిన 12 ఏళ్ల బధిర బాలుడు మృతి చెందిన ఘటన హర్యానాలోని గుర్గావ్లో చోటుచేసుకుంది.
పుట్టినప్పటి నుంచి మూగ, చెవిటితనంతో బాధ పడుతున్న అహ్మద్ ఇమాద్ ఫైసల్ను వైద్యం కోసం అతడి తండ్రి ఇమాద్ ఫైసల్... బాగ్దాద్ నుంచి గుర్గావ్ లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎమ్మారై పరీక్ష చేయించమన్నారు. ఆస్పత్రికి సమీపంలో ఉన్న మోడ్రన్ డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో పరీక్ష చేయించేందుకు వెళ్లగా బాలుడికి మత్తుమందు ఇచ్చారు. అతడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన మళ్లీ ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. 20 నిమిషాల తర్వాత మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అయితే ఎనస్తీషియా వల్లే బాలుడు మరణించాడా, మరేదైనా కారణముందా అనేది వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు తీసుకున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని చెప్పారు.