Iron Lady Canu irom Sharmila
-
ఇరోమ్ షర్మిల మళ్లీ అరెస్ట్
ఇంఫాల్: పౌర హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలను పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్ట్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆమెను బలవంతంగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆమెకు తాజాగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే ఆరోపణలపై ఇన్నాళ్లూ ఆసుపత్రిలో బందీగా ఉన్న షర్మిలను మూడు రోజుల క్రితమే ఇంఫాల్ స్థానిక కోర్టు విడుదల చేసింది. అయితే ఆసుపత్రి వెలుపలే తాత్కాలిక శిబిరంలో షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు. -
షర్మిల విడుదల
ఇంఫాల్: మణిపూర్‌లో అమల్లో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించాలంటూ 14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల (41) బుధవారం తాత్కాలిక జైలు (ప్రభుత్వాస్పత్రిలోని ఓ గది) నుంచి విడుదలయ్యారు. తూర్పు ఇంఫాల్‌లోని పోరంపట్లో ఉన్న ఆస్పత్రి నుంచి ఆమె చెమర్చిన కళ్లతో బయటకు వచ్చారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ గతంలో కేసు పెట్టిన ప్రభుత్వం దాన్ని నిరూపించడంలో విఫలమైనందున షర్మిలను విడుదల చేయాలని తూర్పు ఇంఫాల్‌లోని సెషన్స్ కోర్టు మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పును దేవుని దయగా అభివర్ణించారు. తాను విడుదల కావడం సంతోషంగా ఉన్నప్పటికీ వివాదాస్పద ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని ఉపసంహరించే వరకూ నిరాహారదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. న్యాయం కోసం తాను చేస్తున్న ఉద్యమానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. అనంతరం ఆమె ఆస్పత్రి ప్రాంగణంలో నిరాహారదీక్షను కొనసాగించారు.