irregular lands
-
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు. అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. రేప్ కేసు సహా 23 ఎఫ్ఐఆర్లు ► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. ► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది. -
స్వామి భూములు స్వాహా
సాక్షి, ఒంగోలు : ప్రతిష్టాత్మక ఆలయాలకు జిల్లా పెట్టింది పేరు. చారిత్రత విశేషాలకు, మహిమలకు నిలయమైన భైరవ కోన, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర ఆలయాలు, సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మాలకొండ, మిట్టపాలెం, మార్కాపురం చెన్నకేశవుడు.. ఇలా అనేక మహిమాన్విత దేవాలయాలు ప్రకాశం జిల్లాలో కొలువై ఉన్నాయి. దాదాపు 150కి పైగా ఆలయాలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎంతో కొంత భూమిని ఆలయ ఉద్ధరణ కోసం, పూజాదికాల నిర్వహణ కోసం పెద్దలు బహూకరించారు. నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఈ భూమిని కేటాయించారు. ఇలా జిల్లాలో అన్ని ఆలయాలకు దాదాపు 30 వేల ఎకరాలకు పైచిలుకు భూమి ఉంది. ఈ భూమిని వేలం పాటల ద్వారా కౌలుకు ఇస్తూ..దాని మీద వచ్చే ఆదాయంతో పలు ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. అయితే, ఈ భూముల కేటాయింపు వ్యవహారం, వేలం, కౌలు వసూలు తదితరాల విషయంలో పారదర్శకత కొరవడుతోంది. ఇదిలావుంటే ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోనే అనేక దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఎప్పటికప్పుడు సంబంధిత దేవదాయ శాఖాధికారులు ఆలయాలకు ఉన్న భూమి వివరాల విషయంలో పారదర్శకత పాటించడం లేదు. దీంతో అనేక చోట్ల దేవదాయ భూమి ఇతర ఆక్రమణదారుల ఆధీనంలోకి వెళుతోంది. 20 వేల ఎకరాల పైనే.. దేవదాయ శాఖ పరిధిలో భూ రికార్డుల నిర్వహణ పదేళ్లుగా మందగించింది. జిల్లాలో రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్ల నియామకం జరగకపోవం, ఎఫ్ఏసీలు జిల్లాలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండటం. దేవదాయ శాఖ మీద ఒకరిద్దరి ఆ«ధిపత్యమే కొనసాగటం దరిమిలా దేవదాయ భూముల లెక్కల నిర్ధారణ మీద ప్రత్యేకంగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఏళ్ల తరబడి ఒకే వ్యక్తుల చేతుల్లో దేవదాయ శాఖ భూమి నిలిచి ఉండటంతో అనేకచోట్ల కొందరు అక్రమార్కులు దేవదాయ భూమిపై కన్నేశారు. దరిమిలా జిల్లాలో 20 వేల ఎకరాలపైనే దేవదాయ శాఖ భూమి ఆక్రమణదారుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌కు నోచుకోని వైనం: దేవదాయ శాఖకు చెందిన భూములు ఆన్లైన్ చేసే వ్యవహారంలో జిల్లాకు వస్తున్న అధికారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో పలుచోట్ల ఆలయ అభివృద్ధి కమిటీల చేతుల్లో భూములు బందీ అయిపోయాయి. దీంతో ఆలయాలకు రావాల్సిన ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోంది. మండలం వారీగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ఆలయాల వారీగా ఉన్న భూమి, ఏయే ఆలయాల ఆధీనంలోని భూమి ఆన్లైన్ చేశారు అనే విషయం మీద దేవదాయ శాఖ అధికారుల వద్ద సరైప సమాచారం లేదు. అదేవిధంగా ఏయే ఆలయాలకు చెందిన ఎంతెంత భూమి సాగులో ఉంది, సాగుకు గాను చెల్లిస్తున్న కౌలు తదితరాల మీద కూడా రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొన్నిచోట్ల దేవదాయ శాఖ భూములు ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు భరోసాతో కదులుతున్న తీగ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కౌలు రైతుల సంక్షేమం కోసం ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతుండగా, జిల్లాలో ఏయే భూములు, ఎవరెవరి భూములు ఎంతెంత కౌలులో ఉన్నాయనే విషయం మీద అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తక్షణం దేవదాయ శాఖ ఆధీనంలోని భూమి వివరాలు, ఏయే ఆలయాల భూమి ఎవరెవరి వద్ద కౌలులో ఉందనే వివరాలను ప్రకటించాలని పలు ఆలయాల ధర్మకర్తలు కోరుతున్నారు. -
క్రమబద్ధీకరణ జీవో వచ్చేస్తోంది!
► అక్రమ లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం ► ఒకట్రెండు రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు ► చట్ట సవరణ తర్వాతే బీపీఎస్.. నెల రోజులు పట్టే అవకాశం ► క్రమబద్ధీకరణకు కటాఫ్ 2015, ఆగస్టు 31 ► స్లమ్స్‌లో క్రమబద్ధీకరణకు చదరపు గజానికి రూ.15 ► గడువు ముగిసిన తర్వాత అక్రమాలపై కఠిన చర్యలు ► కూల్చివేతలతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు ► అనుమతులు లేని కట్టడాలు, లే అవుట్ల రిజిస్ట్రేషన్లకు నో సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లే అవుట్లు ఉన్న వారికి శుభవార్త. వాటి క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరిసారిగా రాష్ట్రంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)తో పాటు లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) ప్రవేశపెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సంబంధిత ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. న్యాయ శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఎల్ఆర్ఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ తంతు పూర్తయ్యే అవకాశముంది. బీపీఎస్ అమలుకు ముందు న్యాయపరమైన చిక్కులను తొలగించిన తర్వాతే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకేసారి (వన్ టైమ్ స్కీం) అంటూనే గత ప్రభుత్వాలు పదేపదే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు.. 1998లో నాటి ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్ ఉత్తర్వుల (జీవో 419)ను కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ ద్వారా 2007-08లో మళ్లీ బీపీఎస్‌ను అమలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ ద్వారా ఏపీ మునిసిపాలిటీ చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంతో పాటు భవన నిర్మాణ నియమావళి మార్గదర్శకాల (జీవో 168)ను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ముగిసి బీపీఎస్ ఉత్తర్వులు జారీ అయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చివరిసారిగా అమలు చేసిన క్రమబద్ధీకరణ పథకాల గడువు 2013 జూన్ 12తో ముగిసిపోగా, వేల సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని సర్కారు నిర్ణయించింది. పేద, మధ్యతరగతికి వెసులుబాటు అక్రమాల క్రమబద్ధీకరణ కోసం 2015 ఆగస్టు 31ని కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తర్వాత చేపట్టిన కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించకూడదని నిర్ణయించింది. అవినీతికి తావు లేకుండా ‘టీఎస్-ఐపాస్’ తరహాలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించనున్నారు. అక్రమ ప్లాట్లు, కట్టడాల మార్కెట్ ధరల ఆధారంగా రుసుం వసూలు చేయనున్నారు. వైశాల్యం ఆధారంగా వాటి మార్కెట్ విలువలో 20 నుంచి 100 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, పేద, మధ్య తరగతి వర్గాలకు ఫీజుల విషయంలో వెసులుబాటు కల్పించనున్నారు. 500 చ.మీ.లోపు ప్లాట్లకు నామమాత్రంగా రుసుములు ఉండనున్నాయి. 5 వేల చ.గజాలు దాటిన అక్రమ లే అవుట్లపై మాత్రం భారీగా వడ్డీంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మురికివాడల్లో నిర్మించిన ఇళ్లు/కట్టడాలకు చ.గజానికి కేవలం రూ.15 చొప్పున క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 100 చ.గజాలలోపు ఉండే కట్టడాలకు సైతం ఇదే ఫీజులను వర్తింపజేసే అవకాశముంది. బీపీఎస్ ద్వారా ఒక్క జీహెచ్ఎంసీలోనే సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఇకపై ‘అక్రమం’ క్రైమే! ఇదే చివరిసారి అంటూ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతోంది. ఈ పథకాల గడువు ముగిసిన తర్వాత అక్రమ కట్టడాలు, లే అవుట్లపై ఉక్కుపాదం మోపనుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలతో పాటు తొలిసారిగా యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టనుంది. కేసులు పెట్టేందుకు అనువుగా కొత్త భవన నిర్మాణ నియమావళికి రూపకల్పన చేస్తోంది. ఇది అమలులోకి వస్తే అక్రమ లే అవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు జరపరు.