లేటరైట్‌ను దోచుకున్న మాజీ మంత్రి కుటుంబీకులు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్ల అక్రమార్జన
అప్పట్లో లేటరైట్ అనుమతులు రద్దు చేస్తూ ఇచ్చిన కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
పంట కాలువనూ కబ్జా చేసి అక్రమ నిర్మాణం
విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి
కొండలనూ కొల్లగొట్టిన ఘనుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు.
అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి
బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్‌మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.
టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు.
అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం
నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది.
రేప్ కేసు సహా 23 ఎఫ్‌ఐఆర్‌లు
► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్‌లో రేప్ కేసు నమోదైంది.
► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.
► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు.
► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment