laterite
-
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు. అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. రేప్ కేసు సహా 23 ఎఫ్ఐఆర్లు ► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. ► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది. -
లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్
నాతవరం: విశాఖ జిల్లాలో లేటరైట్ నిక్షేపాలున్న కొండలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున బుధవారం పరిశీలించారు. నాతవరం మండలంలో సుందరకోట శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల కోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేశారని గునుపూడికి చెందిన కె.మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో కలెక్టర్ లేటరైట్ నిక్షేపాలున్న కొండలను సందర్శించారు. కొండపైకి కారు వెళ్లే అవకాశం లేదు. దీంతో జీపులో, ద్విచక్రవాహనంపై కొంత దూరం ప్రయాణించి, సుమారు రెండు కిలోమీటర్లు నడిచి కొండలను చేరుకున్నారు. అటవీ, రెవెన్యూ భూములు, వాటి సరిహద్దుల మ్యాప్‌లను తహసీల్దార్ జానకమ్మ వివరించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదీ మరిడయ్యతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న విషయాలకు, క్షేత్రస్థ్ధాయిలో కనిపిస్తున్న దానికి పొంతన లేకపోవడం, భారీ వృక్షాలు లేకపోవడంపై ఫిర్యాదీని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ లేటరైట్ తవ్వకాల కోసం వేసిన రోడ్లను పరిశీలించామని చెప్పారు. నిబంధనలను పాటించారా లేదా అన్న విషయంపై అటవీ, మైనింగ్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కలెక్టర్‌తోపాటు జేసీ వేణుగోపాలరెడ్డి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్‌బాబు, ఇతర అధికారులు ఉన్నారు. -
ఏపీ: బాక్సైట్ తవ్వకాలు ఈ ప్రభుత్వంలో జరగలేదు
సాక్షి, విజయవాడ: 2 లక్షల టన్నుల లేటరైట్ అక్రమంగా తవ్వకాలు జరిగాయని గుర్తించినట్లు గోపాలకృష్ణ ద్వివేది, డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ తవ్వకాలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో శాఖాపరంగా విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అక్రమ తవ్వకాలపై ఆరోపణలు రావడంతో వారు బుధవారం వివరాలు సేకరించారు. ఆండ్రస్ మినరల్‌కి 8 లీజులు 2013లో వాళ్లకి మంజూరయ్యాయని, వాటిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిపై తాము పెనాల్టీ కూడా వేసినట్లు పేర్కొన్నారు. భద్రతా చర్యలు, ఇతర ప్రమాణాలను తనిఖీ చేశామని చెప్పారు. వేదాంతకి 34 లక్షల టన్నుల సరఫరా చేశారు, 4.5 లక్షల టన్నుల చైనాకు సరఫరా చేశారు అని వెల్లడించారు. వీటిపై విచారణ చేస్తున్నట్లు ద్వివేది తెలిపారు. లేటరైట్ తవ్వరా.. బాక్సైట్ తవ్వరా అని విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. అల్యూమినియం కంపెనీకి సరఫరా చేయడం వలన ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని పేర్కొన్నారు. 2013 నుంచి 2019 జనవరి వరకు ఈ తవ్వకాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగలేదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు లేటరైట్‌ని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు.. అందుకే లేటరైట్ అని నిర్ధారిస్తున్నాట్లు వివరించారు. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు కేటీఆర్?: ఎమ్మెల్యే సీతక్క చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
లీజు నిర్వాహకులకే అనుమతులు పునరుద్ధరించాం
సాక్షి, తిరుపతి తుడా: తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్ నిక్షేపాల నమూనాలను కెమికల్ అనాలసిస్‌కు పంపామని.. అందులో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజు నిర్వాహకులకే అనుమతులను పునరుద్ధరించామని రాష్ట్ర గనులు, భూగర్భ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. బాక్సైట్‌కు అయితే కేంద్రమే అనుమతులిస్తుందని ఆయనన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నిరాధారమైన ఆరోపణలతో ‘ఏటా రూ.180 కోట్లు’ స్వాహా చేస్తున్నట్లు అసత్య కథనాన్ని ప్రచురిం చిందని ఆయన మండిపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మందికి 2033 వరకు ఈ లేటరైట్ నిక్షేపాల తవ్వకాలకు అనుమతులిచ్చారని మంత్రి తెలిపారు. తిరుపతిలోని తన నివాసంలో పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆదివారం ఆ పత్రిక ప్రచురించిన ‘ఏటా రూ. 180 కోట్లు’ స్వాహా కథనంపై చట్టపరంగా చర్యలు తప్పవు. ఇప్పటికే నోటీసులు జారీచేశాం. సరైన వివరణ ఇవ్వకున్నా ఆధారాలు చూపకుంటే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు హయాంలో దోచేశారు కాబట్టే మా ప్రభుత్వం కూడా దోచేస్తోందనే భ్రమలో ఎల్లో మీడియా ఉన్నట్లుంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి కుట్ర చేస్తోంది. గనుల కేటాయింపుల్లో ముఖ్యనేత అంటూ ఒకసారి.. మంత్రి సమీ ప బంధువంటూ మరోసారి కథనాలను రాయడం సరైందికాదు. గతంలోనూ సరస్వతి పవర్‌కు కోట్లు కట్టబెట్టారంటూ అసత్యాన్ని ప్రచారం చేశారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ జరిగి తీరుతుంది. కరోనా కా రణంగా ఆలస్యమవుతోంది. సరైన సమయంలో నిర్ణయిస్తాం. -
ఉల్లం‘ఘనులు’
గనుల బాబులదే అసలు పాపం కుంటిసాకులతో కాలయాపన ఉన్నతాధికారుల ఉత్తర్వులనూ తొక్కిపెట్టిన ఘనులు కళ్లు మూసుకొని.. అక్రమ తవ్వకాలకు సహకారం ఏటా రూ.30కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి లోకల్ బాబు రుబాబు సరే.. అంత అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసి, తరలించేస్తుంటే గనుల శాఖ బాబులు ఏం చేస్తున్నట్టు?.. పిల్లి కళ్లు మూసుకొని తననెవరూ చూడటం లేదు. తానెవరినీ చూడలేదు.. అన్నట్లుంది వారి నిర్వాకం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని నిస్సహాయ రాగం ఆలపిస్తున్న సదరు మైనింగ్ బాబులు.. మరి రెవెన్యూ అధికారుల ఆదేశాలను ఎందుకు తొక్కిపెట్టినట్టు?.. ప్రభుత్వ కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ వరకు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు బేఖాతరు చేసినట్టు??.. అంటే.. కంచే చేను మేసిన చందంగా గనుల శాఖ అధికారులే లేటరైట్ అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించినట్లే కదా!.. ఖనిజ తవ్వకాల లెక్కలు చూసినా.. దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే తీసుకున్న అనుమతుల ప్రకారం లక్షన్నర క్యూబిక్ మీటర్లే తవ్వాల్సి ఉంది. కానీ దానికి రెట్టింపు అంటే మూడు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా లేటరైట్ ఖనిజాన్ని దోచేసుకున్నా గనుల అధికారులు కనులు మూసేసుకున్నారు. అక్రమాలన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారన్నమాట సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాళం వేసి ఉన్న ఇల్లు కంటే.. తలుపులు బార్లా తెరచుకున్న ఇంటివైపే దొంగల దష్టి ఉంటుంది. సరిగ్గా ఇదే తరహాలో లేటరైట్ గనుల దోపిడీ జరుగుతోంది. అక్రమాలు జరిగితే కట్టడి చేయాల్సిన గనుల శాఖ అధికారులే కళ్లు మూసుకోవడంతో లేటరైట్ గనులను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేసి తరలించుకుపోతున్నారు. నిబంధనల ప్రకారం.. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఏడాదికి లక్షన్నర టన్నుల మేరకే లైటరేట్ను తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. తవ్విన ఖనిజాన్ని గనులశాఖ అధికారులు పరిశీలించి, సెస్ నిర్ణయించాలి. వాటిని చెల్లించిన తర్వాతే ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. టన్నుకు రూ.150 సెస్ చెల్లించాలి. అయితే ఇక్కడ ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. ఏడాది కాలంలోనే 3 లక్షల క్యూబిక్ మీటర్ల మేర లేటరైట్ తవ్వకాలు, తరలింపు జరిగినట్టు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న భూమికి మించి తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఏటా ఇలా అక్రమంగా తవ్వి తరలిస్తున్న ఖనిజం విలువ రూ. 30 కోట్లు వరకు ఉంటుందని అంచనా. అక్కడ నో... ఇక్కడ ఓకే వాస్తవానికి పరిమితికి మించి తవ్వకాలు చేపట్టిన కారణంగా గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా వంతాడలో లేటరైట్ మైనింగ్‌ను అధికారులు నిలిపివేశారు. కానీ విశాఖ జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడి హవా నడవడంతో అడ్డూ అదుపూ లేకుండా మైనింగ్ జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్ మైనింగ్‌పై వేటు పడటంతో ముడిసరుకు అవసరమైన కంపెనీలన్నీ సరుగుడు ప్రాంతంలోని తవ్వకాలపై కన్నేశాయి. దీంతో ఇక్కడ తవ్వకందారుడు ఎంత ధర చెప్పినా వెనుకాడకుండా కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. ఎన్వోసీ పేరిట కాలయాపన సరుడుగు పరిధిలో లైటరైట్ గనుల తవ్వకాలకు అనుమతులిస్తూ పంచాయతీ చేసిన తీర్మానాలు రద్దయి ఏడాది దాటింది. అప్పట్లో మైనింగ్ అనుమతిపై పంచాయతీ తప్పుడు తీర్మానాలు చేసిందని పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి అనుమతులు సరికాదంటూ నివేదిక ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని కూడా గనులశాఖ అధికారులు అప్పట్లోనే ఈ అనుమతులను రద్దు చేయాల్సి ఉంది. కానీ పట్టించుకోలేదు. నిరభ్యంతర పత్రం( ఎన్వోసీ) రద్దు కాలేదంటూ తాత్సారం చేస్తూ వచ్చారు. ముఖ్యకార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ ఉన్నతాధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశాలిచ్చినా లీజు రద్దు చేయకుండా పెడచెవిన పెట్టిన గనుల శాఖ అధికారులు ఇప్పుడు కూడా ఎన్వోసీ నెపం చూపించే కాలయాపన చేస్తున్నారు. విలువైన సంపద, ప్రభుత్వానికి ఆదాయం పోతున్నా గనులశాఖ బాబులు పట్టించుకోకపోవడానికి అసలు కారణం లోకల్ బాబు భయం ఒక్కటే కాదు.. అందిన కాడికి మామూళ్లు దండుకోవాలన్న యావే కారణమని రెవెన్యూ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
పెద్దతరహా ఖనిజాలపై రాయల్టీ పెంపు!
తాండూరు: పెద్ద తరహా ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం రాయల్టీని పెంచింది. దీంతో ప్రభుత్వానికి రాయల్టీ ఆదాయం పెరగనుంది. ఈ మేరకు పెద్ద తరహా ఖనిజాలపై రాయల్టీని పెంచుతూ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 1న 630 జీవోను జారీ చేసింది. దీంతో కొత్త రాయల్టీ విధానం అమల్లోకి వచ్చింది. లైమ్‌స్టోన్, ల్యాటరైట్, క్వార్డ్జ్, షేల్, ఇనుము తదితర పెద్ద తరహా ఖనిజాలపై రాయల్టీ పెరిగింది. సిమెంట్ ఉత్పత్తుల తయారీకి వినియోగించే లైమ్‌స్టోన్ (సున్నపురాయి)పై టన్నుకు రూ.63 ఉన్న రాయల్టీ ఛార్జీలను రూ.80కు, ల్యాటరైట్ (ఎర్రమట్టి)పై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) విలువ ప్రకారం టన్నుకు రూ.46- రూ.51 (15 శాతం నుంచి 25శాతం) రాయల్టీని కేంద్రం ప్రభుత్వం పెంచింది. క్వార్డ్జ్(పలుగురాయి)పై రూ.20 నుంచి రూ.35కు, షేల్పై రూ.36 నుంచి రూ.60, ఇనుము టన్నుకు రూ.60 నుంచి రూ.80కు రాయల్టీని పెంచింది. తాండూరు ప్రాంతంలోని పెద్ద తరహా ఖనిజాలపై ఏడాదికి సుమారు రూ.25కోట్ల మేరకు రాయల్టీ రూపంలో ఆదాయం వస్తోంది. కొత్త రాయల్టీ విధానం ప్రకారం సర్కారుకు అదనంగా రూ.5 కోట్ల ఆదాయం సమకూరనుంది. చిన్నతరహా ఖనిజాలపై.. చిన్నతరహా ఖనిజాలపైనా రాయల్టీని పెంచాలనే దిశగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. నాపరాతి బండలు (లైమ్‌స్టోన్ స్లాబ్), సుద్ద (పుల్లర్స్ఎర్త్) తదితర చిన్నతరహా ఖనిజాలపై రాయల్టీ పెరగనుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ రాష్ట్ర గనుల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక చదరపు అడుగు నాపరాతికి ప్రభుత్వానికి రూ.7 రాయల్టీ వస్తోంది. దీనిపై 10-20 శాతం రాయల్టీ పెంచాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఒక చదరపు అడుగు నాపరాతికి రూ.10 రాయల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇక తెల్ల సుద్ద టన్నుకు రూ.110 -రూ.121, ఎర్ర సుద్ధ టన్నుకు రూ.44 నుంచి సుమారు రూ.50 వరకు రాయల్టీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చిన్నతరహా ఖనిజాల కొత్త రాయల్టీపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. చిన్నతరహా ఖనిజాలపై రాయల్టీ ఛార్జీల పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.50 లక్షల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. ఎన్నికల సందర్భంగా తాండూరు పర్యటనలో తాండూరు నాపరాతిపై రాయల్టీని తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో రాయల్టీ పెంచుతారా.. లేదా.. అనేది సందిగ్ధంగా మారింది. మరోవైపు తాండూరు సరిహద్దులోని కర్ణాటకలో సుమారు రూ.450 రాయల్టీ ఉంది. ఇదే పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేసి, కష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.