ఉల్లం‘ఘనులు’ | Mining | Sakshi
Sakshi News home page

ఉల్లం‘ఘనులు’

Published Wed, Aug 10 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఉల్లం‘ఘనులు’

ఉల్లం‘ఘనులు’

  • గనుల బాబులదే అసలు పాపం
  • కుంటిసాకులతో కాలయాపన
  • ఉన్నతాధికారుల ఉత్తర్వులనూ తొక్కిపెట్టిన ఘనులు
  • కళ్లు మూసుకొని.. అక్రమ తవ్వకాలకు సహకారం
  • ఏటా రూ.30కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
  • లోకల్‌ బాబు రుబాబు సరే.. అంత అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసి, తరలించేస్తుంటే గనుల శాఖ బాబులు ఏం చేస్తున్నట్టు?.. పిల్లి కళ్లు మూసుకొని తననెవరూ చూడటం లేదు. తానెవరినీ చూడలేదు.. అన్నట్లుంది వారి నిర్వాకం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని నిస్సహాయ రాగం ఆలపిస్తున్న సదరు మైనింగ్‌ బాబులు.. మరి రెవెన్యూ అధికారుల ఆదేశాలను ఎందుకు తొక్కిపెట్టినట్టు?.. ప్రభుత్వ కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు బేఖాతరు చేసినట్టు??.. అంటే.. కంచే చేను మేసిన చందంగా గనుల శాఖ అధికారులే లేటరైట్‌ అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించినట్లే కదా!.. ఖనిజ తవ్వకాల లెక్కలు చూసినా.. దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే తీసుకున్న అనుమతుల ప్రకారం లక్షన్నర క్యూబిక్‌ మీటర్లే తవ్వాల్సి ఉంది. కానీ దానికి రెట్టింపు అంటే మూడు లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా లేటరైట్‌ ఖనిజాన్ని దోచేసుకున్నా గనుల అధికారులు కనులు మూసేసుకున్నారు.  అక్రమాలన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారన్నమాట
     
    సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  తాళం వేసి ఉన్న ఇల్లు కంటే.. తలుపులు బార్లా తెరచుకున్న ఇంటివైపే దొంగల దష్టి ఉంటుంది. సరిగ్గా ఇదే తరహాలో లేటరైట్‌ గనుల దోపిడీ జరుగుతోంది. అక్రమాలు జరిగితే కట్టడి చేయాల్సిన గనుల శాఖ అధికారులే కళ్లు మూసుకోవడంతో లేటరైట్‌ గనులను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేసి తరలించుకుపోతున్నారు. నిబంధనల ప్రకారం.. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఏడాదికి లక్షన్నర టన్నుల మేరకే లైటరేట్‌ను తరలించేందుకు అనుమతులు ఉన్నాయి.  తవ్విన ఖనిజాన్ని  గనులశాఖ అధికారులు పరిశీలించి, సెస్‌ నిర్ణయించాలి. వాటిని చెల్లించిన తర్వాతే ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. టన్నుకు రూ.150 సెస్‌ చెల్లించాలి. అయితే ఇక్కడ ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు.  ఏడాది కాలంలోనే 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర లేటరైట్‌ తవ్వకాలు, తరలింపు జరిగినట్టు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న భూమికి మించి తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఏటా ఇలా అక్రమంగా తవ్వి తరలిస్తున్న ఖనిజం విలువ రూ. 30 కోట్లు వరకు ఉంటుందని అంచనా.
     
    అక్కడ నో...  ఇక్కడ ఓకే
    వాస్తవానికి పరిమితికి మించి తవ్వకాలు చేపట్టిన కారణంగా గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా వంతాడలో లేటరైట్‌ మైనింగ్‌ను అధికారులు నిలిపివేశారు. కానీ విశాఖ జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడి హవా నడవడంతో అడ్డూ అదుపూ లేకుండా మైనింగ్‌ జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్‌ మైనింగ్‌పై వేటు పడటంతో ముడిసరుకు అవసరమైన కంపెనీలన్నీ సరుగుడు ప్రాంతంలోని తవ్వకాలపై కన్నేశాయి. దీంతో ఇక్కడ తవ్వకందారుడు ఎంత ధర చెప్పినా వెనుకాడకుండా కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు.
     
    ఎన్‌వోసీ పేరిట కాలయాపన
    సరుడుగు పరిధిలో లైటరైట్‌ గనుల తవ్వకాలకు అనుమతులిస్తూ పంచాయతీ చేసిన తీర్మానాలు రద్దయి ఏడాది దాటింది. అప్పట్లో మైనింగ్‌ అనుమతిపై పంచాయతీ తప్పుడు తీర్మానాలు చేసిందని పంచాయతీరాజ్‌ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన  జిల్లా పంచాయతీ అధికారి అనుమతులు సరికాదంటూ నివేదిక ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని కూడా గనులశాఖ అధికారులు అప్పట్లోనే ఈ అనుమతులను రద్దు చేయాల్సి ఉంది. కానీ పట్టించుకోలేదు. నిరభ్యంతర పత్రం( ఎన్‌వోసీ) రద్దు కాలేదంటూ తాత్సారం చేస్తూ వచ్చారు. ముఖ్యకార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు రెవెన్యూ ఉన్నతాధికారులు, పంచాయతీ రాజ్‌ అధికారులు ఆదేశాలిచ్చినా లీజు రద్దు చేయకుండా పెడచెవిన పెట్టిన గనుల శాఖ అధికారులు ఇప్పుడు కూడా ఎన్‌వోసీ నెపం చూపించే కాలయాపన చేస్తున్నారు. విలువైన సంపద, ప్రభుత్వానికి ఆదాయం పోతున్నా గనులశాఖ బాబులు పట్టించుకోకపోవడానికి అసలు కారణం లోకల్‌ బాబు భయం ఒక్కటే కాదు.. అందిన కాడికి మామూళ్లు దండుకోవాలన్న యావే కారణమని రెవెన్యూ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement