ఇరుముడుల్లో చేతివాటం
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులు జరిగే భవానీదీక్షల విరమణ కార్యక్రమం గురువారం వివాదంతో మొదలైంది. భవానీ దీక్ష నిర్వహించి అమ్మ వారికి సమర్పించేందుకు తీసుకువచ్చిన ముడుపులను, కానుకలను దేవస్థానంలోని తాత్కాలిక అర్చకులు తస్కరిస్తుండగా గురుభవానీలు పట్టుకోవడంతో ఈ వివాదం నెలకొంది. గురువారం ఉదయం 6.30 గంటలకు ఆలయ ఈవో దంపతులు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్షల విరమణ ప్రారంభించారు.
అప్పటికే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు క్యూలో వచ్చి తమ వద్ద ఉన్న ఇరుముడులు, మాలలను తీయించుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికి గురుభవానీలు అక్కడకు రాకపోవడంతో పదిమంది తాత్కాలిక అర్చకులు వచ్చి ఇరుముడులు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించి అందులోని ముడుపులు, కానుకలు తమ సంచుల్లో దాచుకోసాగారు.గురుభవానీలే ఇలా చేస్తున్నారని భావించిన భక్తులు అభ్యంతరం పెట్టారు.
ఈలోగా గురుభవానీలు అక్కడకు వచ్చి తాత్కాలిక అర్చకుల బండారం బైట పెట్టారు. ముడుపులు కాజేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. అధికారులు వచ్చి తాత్కాలిక అర్చకుల సంచుల్లో ఉన్న డబ్బును తీసుకుని అమ్మవారి హుండీల్లో వేసి, వారిని బయటకు పంపేశారు.