ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
♦ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మే 16న పరీక్ష
♦ తెలంగాణలోని విద్యార్థులకూ ఏపీలోనే పరీక్ష
ఏయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2016 నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు విలేకరులకు వెల్లడించారు. రూ. 350 రిజిస్ట్రేషన్ రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. పరీక్షను మే 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామన్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 17 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, తెలంగాణ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయట్లేదని తెలిపారు. అక్కడి విద్యార్థులు కూడా ఏపీకి వచ్చి పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఠీఠీఠీ. ్చఞజీఛ్ఛ్టి.్ఛ్ట.జీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.